Vikrant Rona:సుదీప్ ‘విక్రాంత్ రోణ’రివ్యూ

First Published | Jul 28, 2022, 1:58 PM IST


ఇప్పుడు పాన్ ఇండియా క్రేజు నడుస్తోంది. అన్ని భాషల హీరోలు ఆ స్టేటస్ ని తమ సినిమాలకు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఆ క్రమంలోనే  ఆ కిచ్చా సుదీప్ త‌న కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్ సినిమా ఒక‌టి చేశాడు. అదే… `విక్రాంత్ రోణ‌`.  వీ.ఆర్ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా మరి కేజీఎఫ్ 2 లాగ, ఆర్ ఆర్ ఆర్ లాగ వర్కవుట్ అవుతుందా?
 

చెప్పుకోవటానికి  కన్నడ  హీరో అయినా సుదీప్ ఈ రోజు దాదాపు అన్ని భాషల వారికి పరిచయమే. ముఖ్యంగా తెలుగులో  ఈగ సినిమాతో విలన్ గా పరిచయమయ్యారు.  దాంతో సుదీప్ చేస్తున్న దాదాపు  చాలా  సినిమాల ఇక్కడ డబ్బింగ్ అవుతున్నాయి. అయితే నేరుగా ఇప్పటివరకు సుదీప్ ఏ సినిమాతోనూ మళ్ళీ తెలుగులో హీరోగా రాలేదు. మధ్యలో బాహుబలి, సైరా వంటి సినిమాలలో అడపాదడపా పాత్రలు చేశారు.  ఇప్పుడు  విక్రాంత్ రోణ అనే సినిమా ద్వారా  పాన్ ఇండియా  రిలీజ్ తో మన  ముందుకు వచ్చారు.  ఇప్పటికే  ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ అలాగే మిగతా పోస్టర్లు సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా  ఈ రోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది... తెలుగు వారికి నచ్చుతుందా వంటి విషయాలు చూద్దాం.

కథ

 కొమరట్టు అనే ఊరిలో వరస పెట్టి పిల్లలు చనిపోతూంటారు. ఆ కేసులు ఇన్విస్టిగేట్ చేయాల్సిన  పోలీస్ కూడా చనిపోతారు. ఒక ఇంటి ఆవరణలోని బావిలో ఆ శరీరం దొరుకుతుంది. కానీ, తల దొరకదు. కొన్నేళ్ల కింద అదే ఊళ్ళో నిట్టోని అనే వ్యక్తి కుటుంబాన్ని.. గుడి నగలు దొంగిలించారనే నెపంతో కొట్టి తరిమేసి ఉంటారు ఆ ఊరి జనం. ఆ అవమానంతో నిట్టోని కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడుతుంది.  వాళ్ళ ఆత్మలే ఊళ్ళో పిల్లల్ని చంపేస్తున్నాయని అంతా అనుకుంటారు. అసలు నిజం ఏమిటి...?

Latest Videos



అవి హత్యలా  లేక నిజంగా ఆత్మలే చంపేస్తున్నాయా అసలు  ఏం జరుగుతోంది... తేల్చటానికి  కొత్తగా  ఇన్‌స్పెక్ట‌ర్‌ విక్రాంత్ రోణ (కిచ్చా సుదీప్) అక్కడికి వస్తాడు.    చార్జ్ తీసుకున్న వెంటనే  ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టి ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. వాళ్ళ మోటో ఏంటి అని తెలుసుకునే పనిలో పడతారు. ఈ క్రమంలోనే ఆయనకు మైండ్ బ్లాక్ అయ్యే కొన్ని నిజాలు తెలుస్తాయి. అవేమిటి...అలాగే  ఊళ్ళోకి చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన ఆ ఊరి పెద్ద కుమారుడు సంజు (నిరూప్ బండారి) కు ఆ ఊరి హత్యలకు ఏమన్నా  సంబంధం ఉందా ...అసలు ఈ కేసును విక్రాంత్ రోణ ఎలా చేధించారు అనేది కథ..

Vikrant Rona Review


 విశ్లేషణ

దర్శకుడు అనూప్ భండారి 2015 లో డైరక్ట్ చేసిన రంగి తరంగ పెద్ద హిట్. అప్పట్లో అదొక సెన్సేషన్.  స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. అవార్డ్ లు వచ్చాయి. ఆస్కార్ కు వెళ్తుందనుకున్నారు. ఆ డైరక్టర్ చేసిన సినిమా అంటే ఖచ్చితంగా బజ్ ఉంటుంది. అయితే ఆయన ఈ ఏడేళ్లలో మళ్లీ అలాంటి సినిమా చేయలేదు. దాంతో ఇన్నాళ్ల తర్వాత  మళ్లీ ఆ స్దాయి సినిమా ఇది ప్రచారం జరిగింది. 

 కామెడీ,  హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి వండిన స్క్రిప్టు ఇది. కథగా ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాదు కానీ ఎంగేజ్ చేస్తుంది. అలాగే అన్ని ఎలిమెంట్స్ కావాలని కథలోకి దూర్చే ప్రక్రియలో చాలా చోట్ల ప్లాట్ గా తాయరైంది. నవ్వురాని కామెడీని కాస్త ప్రక్కన పెడితే బాగుండేది. ఫస్టాఫ్ ఆగకుండా వెళ్లిపోయినా సెకండాఫ్ లో కథ ఏంటో పూర్తిగా రివీల్ అవుతూంటే  గ్రిప్ మెల్లిగా తగ్గటం మొదలైంది. కొన్ని చోట్ల కాస్త అర్దమయ్యేలా చెప్తే కన్ఫూజింగ్ తగ్గేదేమో అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే పరంగా చూస్తే జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు బోలెడు చూసేసాం అని అర్దమవుతుంది. 

Vikrant Rona Review


మామూలు రొటీన్ పగ,ప్రతీకారం కథకే కాస్తంత హారర్ కలర్ కలిపారు అనిఅర్దమవుతుంది. మొదట్లో కొన్ని హత్యలు, అక్కడికి ఓ పోలీస్ అధికారి రావటం, రకరకాల క్యారక్టర్స్ పై అనుమానాలు, చివరకు ఎవరూ ఊహించని ఓ పాత్రను ప్రవేశపెట్టి వాడే అసలు విలన్ అనే తేల్చటం ...అనే ఫార్మెట్ లోనే వెళ్లిపోయారు. అయితే  ఈ ఫార్మెట్ మనకు తెలిసిందే అనిపించకుండా కాస్త హారర్ తో మాయ చేసే ప్రయత్నం చేసారు. ఇక ఇన్విస్టిగేషన్ తో పాటు మరో ప్రక్కన సాగే  నిరూప్ బండారి పాత్ర లవ్ స్టోరీ కూడా అంత ఇంట్రస్టింగ్ గా ఉండదు. ఇవన్నీ చివర్లో ముడి విప్పాక...ఓహో అందుకా ఫలానా సీన్  వేసాడు. ఈ ట్రాక్ పెట్టారు..ఆ క్యారక్టర్ అక్కడకి వచ్చింది అనుకుంటాము. ఏదైమైనా  రొటీన్ కథను స్క్రీన్ ప్లే తో  డిఫరెంట్‌గా చెప్పాలని  ఓవరాల్ గా కన్ఫూజ్ చేశారు. క్లైమాక్స్ దాకా కొద్దో గొప్పో ఆ కన్ఫూజన్ నడుస్తుంది. అదే ఇప్పటి  కొత్తగా మారిన  స్క్రీన్ ప్లే అనుకుంటే అది కరెక్ట్ గా ఉన్నట్లే.

Vikrant Rona Review

టెక్నికల్ గా ..

ఈ సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. ఈ సినిమా మేజర్ గా ఇండోర్స్ లో ఎక్కువ షూట్ చేసారు. మిగతా సినిమాలో  దట్టమైన అడవి తప్పించి పెద్దగా లొకేషన్స్ ఏమీ కనపడవు. ఎక్కువగా  VFX మీదే ఆధారపడ్డారు. అవి హై స్టాండర్డ్స్ లోనే చేసారు. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలెట్. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది  అజనీష్ లోక్‌నాథ్‌ సౌండ్ డిజైన్ మెచ్చుకోవాలి.  కొన్ని హారర్ సీన్స్ లో కొత్తగా  భయపెట్టారు. కొన్ని చోట్ల ఏదో జరగబోతోందనే ఆలోచన, ఉత్కంఠ క్రియేట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫెరఫెక్ట్ . పాటల్లో .. 'రా రా రక్కమ్మ' సినిమా రిలిజ్ కు ముందే సూపర్ హిట్. మిగతా పాటలు సోసో.  ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఖర్చుపెట్టారని అర్దమవుతోంది.  చాలా సీన్స్  వండ‌ర్‌ఫుల్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో  నచ్చేస్తాయి.

Vikrant Rona Review

నటీనటుల్లో 

సుదీప్ యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయియి.  సినిమా చాలా భాగం వాటిపై బేస్ అవుతుంది. ఆయన హీరోయిజం సీన్స్ కన్నడ వాళ్లకు నచ్చుతాయనుకుంటా .  హాట్ లుక్‌లో ఉన్న జాక్వలైన్ విషయానికి వస్తే ఆమె నుంచి ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే నిరాశే. ఆమెకు అంత స్క్రీన్ టైమ్ ఇవ్వలేదు. పొడిగించిన గెస్ట్ రోల్ లాంటిది. ఉన్నకాసేపు  అందచందాల‌తో ప్రేక్షకుల మ‌న‌సుల‌ను దోచుకుంది.   'రా రా రక్కమ్మ' కు హాల్ కాసేపు ఊగింది. తెలుగు మొహాలు ఏమీ పెద్దగా లేవు. 

Vikrant Rona Review


ప్ల‌స్ పాయింట్స్:
సుదీప్ అభిన‌యం
టెక్నికల్ గా హై స్టాండర్డ్స్  
ఇంట్రవెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్:

క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
సాగదీసిన‌ట్టుగా ఉండే స‌న్నివేశాలు

Vikrant Rona Review

ఫైనల్ థాట్

కొత్తగా అనిపించే విజువల్స్ ... కొన్ని సార్లు  కొత్త కథను మోసుకురాకపోయినా కొత్త ఎక్సపీరియన్స్ ఇస్తాయి. కాకపోతే సుదీప్ ని మనవాళ్లు ఎంతవరకూ హీరోగా ఏక్సెప్ట్ చేస్తారో చూడాలి.
Rating: 2.75
సూర్య ప్రకాష్ జోశ్యుల
 

Vikrant Rona Review


నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధుసూదన్ రావు తదితరులు
సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్‌
సహ నిర్మాత: అలంకార్ పాండియన్ 
నిర్మాతలు: జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్
Run Time:147 నిముషాలు 
రచన, దర్శకత్వం: అనూప్ భండారి
విడుదల తేదీ: జూలై 28, 2022

click me!