మాస్ మహారాజా రవితేజకు ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. 2021 సంక్రాంతికి వచ్చిన క్రాక్ మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ ఫిబ్రవరిలో వచ్చిన కిలాడీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి ట్రేడ్ లోనూ అభిమానుల్లో ఏర్పడింది.యాక్షన్ ట్రైలర్ , లీక్ వీడియోలు ఇంట్రస్టింగ్ గా ఉండటంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అందుకు తగ్గట్లుగా సినిమా ఉందా...సినిమా కథేంటి, రవితేజకు హిట్ వచ్చినట్లేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
1995 చిత్తూరులో జరిగే ఈ కథలో నిజాయితీ గల సబ్ కలెక్టర్ రామారావు(రవితేజ) . నీతి నిజాయితో ఎక్కడా ఎక్కువ కాలం డ్యూటీ చేయలేకపోతాడు. అంతేకాదు డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎమ్మార్వోగా demote అయ్యి..తన సొంతూరు తిమ్మ సముద్రంకు ట్రాన్సఫర్ అవుతాడు. అక్కడ అతనికి తన చిననాటి లవర్ మాలిని (రజిష విజయన్) కలుస్తుంది. ఆమె భర్త సురేంద్ర (చైతన్య కృష్ణ) ఏడాది పాటుగా కనిపించకుండా పోయాడని తెలుస్తుంది. ఆ కేసును ఛేదించేందుకు రామారావు రంగంలోకి దిగుతాడు. అయితే సురేంద్ర మిస్సింగ్ కేసు పోలీస్ (వేణు తొట్టెంపూడి) పట్టించుకోవడం లేదని అర్దం చేసుకుని, డైరక్టర్ గా రామారావు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు.ఆ క్రమంలో అతనికి ఇలా మిస్సైంది... ఒక్క సురేంద్ర మాత్రమే కాదని... మొత్తం 20 మంది కనిపించకుండా పోయారని అర్దమవుతుంది.
Ramarao on duty review
దాంతో స్టెప్ బై స్టెప్ క్లూ లు వెతుక్కుంటూ వెళ్తూంటే... అది ఎర్ర చందనం అక్రమ రవాణా దగ్గర ఆగుతుంది. అంతేకాదు ఈ ఇన్విస్టిగేషన్ చేయకుండా చాలా మంది తెలియని వాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు సొంత బాబాయ్ కొడుకు అనంత్ (రాహుల్ రామకృష్ణ) చంపాలని అనుకుంటాడు. ఎందుకిలా జరుగుతోంది. తను పెద్ద తుట్టనే కదిపాడా. మనుషుల మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ వ్యక్తి ఎవరు? సొంత బాబాయ్ కొడుకు రామారావు మీద అటాక్ చేయాల్సిన పరిస్దితి ఎందుకొచ్చింది ? ఈ మిస్సింగ్ కేసులో ఎస్పీ దేవానంద్ (జాన్ విజయ్) పాత్ర ఏంటి? అసలు ఎర్రచందన స్మగ్లింగ్‌కు, 20 మంది కనిపించకుండా పోవడానికి ఉన్న లింక్ ఏంటి? చివరకు రామారావు తన డ్యూటీని పూర్తి చేశాడా? లేదా? అన్నదే కథ.
విశ్లేషణ
టైటిల్, ట్రైలర్ చూడగానే ఇదోదో పక్కా కమర్షియల్ రవితేజ మార్క్ కథ అనుకుంటాం. యాక్షన్ ఎపిసోడ్స్ చూసి క్రాక్ ని దాటేస్తుందేమో అని అపోహపడతాం. అయితే అంతలేదు...ఎక్కువ ఊహించుకోకండి అని డైరక్టర్ మొదటి పది నిముషాల్లోనే మనకు సిగ్నల్స్ ఇవ్వటం మొదలెడతాడు. అయితే ఇది కంటెంట్ డ్రైవన్ కథ కదా..ఏదో ఎదర అద్బుతం జరుగుతుంది. అందులోనూ కొత్త డైరక్టర్ కదా ఏదో కొత్త విషయం చెప్తాడులే..లేకపోతే రవితేజ ఎందుకు డేట్స్ ఇచ్చి సినిమా చేస్తాడు అని ఆశగా ఎదురుచూస్తాం. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి అర్దమవుతుంది. మన ఎదురుచూపులుకు అర్దం లేదని, సినిమాలో అంత సీన్ లేదని, ఎక్కువ ఎక్సపెక్ట్ చేసామని తెలిసిపోతుంది. అయితే మళ్లీ ఏదో ఆశ..మరీ అంత దారుణమైన ఊహలు ఎందుకు....సెకండాఫ్ లో చించేసే ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయేమో అని...అబ్బే...అంత లేదమ్మా అని డైరక్టర్ మరోసారి మనని వెక్కిరిస్తాడు. రవితేజ కూడా నా మీద అంత నమ్మకం ఎందుకు రాజా అన్నట్లు చూస్తాడు. కన్ఫర్మ్ ....ఇది మన ఖర్మ ఫామ్ లో ఉందని డిసైడ్ అయ్యిపోతాము.
Ramarao on duty review
క్లైమాక్స్ లో ట్విస్ట్ ...విలన్ ఎవరో తెలుస్తుంది అనే ఫార్మెట్ థ్రిల్లర్ సినిమాలో ఓకే కానీ రవితేజ లాంటి కమర్షియల్ హీరోలతో చేసే సినిమాలతో కష్టం. ఎందుకంటే విలన్ ఎప్పుడో చివర్లో తెలిస్తే...అప్పటిదాకా హీరో చేసే పోరాటం అర్దం లేకుండా పోతుంది. విలన్ ,హీరో ..మధ్య బిగ్ ఫైట్ కు తావు ఉండదు. హీరో పూర్తి ప్యాసివ్ గా మారిపోతాడు. ఇదే ఇక్కడ జరిగింది.
సినిమా ఫస్టాఫ్ మొత్తం దాదాపుగా కథను,క్యారక్టర్స్ ని సెటప్ చేయటానికే తీసుకున్నారు. అసలు పాయింట్ లోకి రావటానికి గంటపైన పట్టింది. దాంతో ప్రారంభంలోనే బోర్ ప్రారంభమైపోయింది. దానికి తోడు ఫ్లాష్ బ్యాక్ మధ్యలో అర్దం పర్దం,సమయం సందర్బం లేకుండా వచ్చే ఐటమ్ సాంగ్. అలా ఫస్టాఫ్ మొత్తం డ్రాగ్ అవుతూ నడిచింది. ఇక సెకండాఫ్ అయినా సినిమా గాడిన పడుతుంది.అనుకుంటే ...ఇన్విస్టిగేషన్ డ్రామా తో నింపేసారు. అదీ బాగా బోరింగ్ గా, రొటీన్ గా సాగుతుంది. ట్విస్ట్ లు ఉంటాయి కానీ అవన్నీ కామన్ ప్రేక్షకుడు పసిగట్టేసేవే..అలా సినిమా మొత్తం దాని ఇష్టం వచ్చినట్లు దాని మానాన అది సాగిపోతుంది. ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో అసలు విలన్ ఎవరో బయిటపడుతుంది. అది మనం ఊహిస్తామా లేదా అన్నది ప్రక్కన పెడితే ...ఆ ట్విస్ట్ పూర్తిగా తేలిపోయింది. ఈ ట్విస్ట్ కోసం ఇంతసేపు డైరక్టర్ మనతో ఆడుకున్నాడా అనిపిస్తుంది. మన మానాన మనం సెల్ ఫోన్ చూసుకుంటూ బిజిగా ఉంటాం.
టెక్నికల్ గా...
సినిమా డైరక్టర్ శరత్ మండవ ఈ కథకు రవితేజ లాంటి మాస్ హీరోకు ఎంచుకోవటంలోనే ఫెయిలయ్యారని చెప్పాలి. ఇంట్రస్టింగ్ పాయింట్ తీసుకున్నా చెప్పే విధానంలో తడబడ్డాడు. దాంతో ఆయన డైరక్షన్ స్కిల్స్ ఎలివేట్ కాకుండా అది అడ్డం పడింది. మ్యాజిక్ విషయానికి వస్తే...పాటలు బాగోలేవు. వాటి ప్లేస్మెంట్స్ అసలు బాగోలేదు. ‘నా పేరు సీసా’సాంగ్ కూడా అంత ఊపేమీ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ డిసెంట్ గా నీట్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా చాలా ల్యాగ్ సీన్స్ తీసేయచ్చు అనిపించింది. డైలాగుల్లో చెప్పుకోదగ్గ విషయం లేదు కానీ సినిమా అంతా ఆపు,అంతూ లేకుండా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు.
నటీనటుల్లో
రవితేజ చేయదగ్గ పాత్ర కాదు. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ లేని రవితేజ చిత్రం. వేణు తొట్టింపూడి గ్యాప్ తర్వాత కనపడ్డారు కానీ ఆయనకు తగిన పాత్ర కాదు. నాసర్ ,రాహుల్ రామకృష్ణ, నరేష్, పవిత్రా లోకేష్, తణికెళ్ల ,పృధ్వీ అందరూ జస్ట్ ఓకే అన్నట్లుగా ఆ పాత్రల్లో కనపడి వెళ్లిపోతారు. ఎవ్వరివీ గుర్తుంచుకునే పాత్రలు కావు. పవిత్రా లోకేష్ ,నరేష్ వచ్చినప్పుడు మాత్రం జనం బాగా నవ్వటం వినపడింది.నటీనటుల పర్శనల్ లైఫ్ కూడా జనం తెరపై ఐడింటిఫై చేసుకుని స్పందిస్తారని మరోసారి ప్రూవైంది.
బాగున్నవి?
బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. (ఏమీ లేని సీన్స్ ని కూడా ఏదో ఉన్నట్లు భ్రమింప చేస్తుంది)
సినిమాటోగ్రఫీ
బాగోలేనివి?
అక్కర్లేని సబ్ ప్లాట్స్, ల్యాగ్ సీన్స్
పేలని డైలాగులు
కథనానికి అడ్డం పడే పాటలు ,కమర్షియల్ ఎలిమెంట్స్
RamaRao on Duty Movie Review
ఫైనల్ థాట్
ఏ హీరోతో ఎలాంటి కథ తెరపై చెప్పాలన్న నిర్ణయం దగ్గరే సినిమా రిజల్ట్ తేలిపోతుంది. అది అర్దం చేసుకోకపోతే థియేటర్ లో ఆ సినిమా తేలిపోతుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
Run Time: 2 hr 26 నిముషాలు
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేదీ: జూలై 29, 2022