Organic Mama Hybrid Alludu review
ఒకప్పుడు డైరక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి హవా నడిచింది. వరసపెట్టి హిట్స్ కొట్టారు..హీరోగానూ మారారు, మ్యూజిక్ డైరక్టర్ గానూ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. అయితే కాలం మారింది. ఆయన వెనకబడ్డారు. చివరిసారిగా 2014లో యమలీల 2 తీశారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయితే ఆయన మరోసారి రీఎంట్రీ ఇచ్చారు. ఈ దర్శకుడు, దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ అందుకుని ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తెరకెక్కించారు. ఎప్పట్లానే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం కృష్ణారెడ్డే చూసుకున్నారు. వీటికి అదనంగా ఈసారి డైలాగ్స్ కూడా అందించారు. మరి ఈ కాలం అభిరుచులకు తగ్గ కథతోనే వచ్చారా, సినిమా ఎలా ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
organic mama hybrid alludu
కథాంశం
ఫెయిల్యూర్ సినిమా డైరక్టర్ విజయ్ (సోహైల్ ) ఇంట్లో పోరు భరించలేక తన తల్లి తయారు చేసిన కొండపల్లి బొమ్మలు అమ్మాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో స్టాల్ పెడతాడు. అక్కడ హాసిని (మృణాలిని రవి) పరిచయం అవుతుంది. ఇద్దరూ ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు. ఈ లోగా ప్రొడ్యూసర్ మనికొండ(సునీల్) వచ్చి విజయ్ కు ఓ సినిమా ఛాన్స్ ఇస్తాడు. జీవితం మళ్లీ ట్రాక్ ఎక్కుతోందని ఆనందపడేలాగా ఆర్గానిక్ వెంకటరణ(రాజేంద్రప్రసాద్) తో ట్విస్ట్ పడుతుంది. అతను మరెవరో కాదు. విజయ్ ప్రేమిస్తున్న అమ్మాయి హాసిని తండ్రి. తన కూతురు ప్రేమ వ్యవహారం తెలిసిపోతుంది. దాంతో ఇలాంటి సంపాదన,ఆర్దికంగా సెటిల్ అవ్వనివాడికి తన కూతురుని ఇవ్వటానికి ఇష్టపడడు. ప్రేమ కథకు ఫుల్ స్టాప్ పెట్టాలనకుంటాడు. అప్పుడు విజయ్ ఏం చేసాడు.. తన ప్రేమను గెలిపించుకున్నాడా..సినిమా తీసి సక్సెస్ కొట్టాడా , కథలోకి ఎంట్రి ఇచ్చిన గాజుల గంగారత్నం(అజయ్ ఘోష్) ఎవరు..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Organic Mama Hybrid Alludu review
ఎలా ఉంది
అప్పట్లో ఎస్వీ కృష్ణా రెడ్డి తీసిన సినిమా ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ చేస్తే చూస్తుంటే ఎలా అనిపిస్తుంది. అదే ఫీల్ మనకూ వస్తుంది. సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చాలనే తలంపుతో కృష్ణారెడ్డి కృష్ణపడ్డారు. అయితే అదే ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోవటం లేదు. ఫ్యామిలీలో ఎవరికి నచ్చిన సినిమాలు వాళ్లకు తోచిన మార్గంలో చూస్తున్నారు. అందరూ కలిసి కూర్చుని సినిమా చూసే రోజులు వెళ్లిపోతున్నాయి. దాంతో ఎంతో పెద్ద హిట్ అయితే తప్ప కుటుంబం అంతా కలిసి వెళ్లి ఓ ఈవెంట్ లా ఆ సినిమా ఎంజాయ్ చేయటం లేదు. దానికి తోడు ఇప్పటి ప్రేక్షకుడుకి తొంభైలనాటి ప్రేక్షకుడుకి చాలా మార్పు వచ్చేసింది. అది ఎస్వీ కృష్ణారెడ్డి గమనించలేదు అని మనకు అర్దమవుతుంది. స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ కేవలం హీరో,హీరోయిన్స్, రాజేంద్రప్రసాద్ పరిచయాలు, ప్రేమ కథతో సరిపెట్టి సెకండాఫ్ లో కథలోకి వచ్చారు. అప్పటికే మనకు ఓపిక నశిస్తుంది. ఇక సెకండాఫ్ లో అయినా కథ కీలకమైన మలుపు తిరిగుతుందా అంటే జస్ట్ ఓకే అన్నట్లు నడుస్తుంది. క్లైమాక్స్ లో కొద్ది పాటి ఎమోషన్స్ పండినా అది ఇంత సినిమాని బాలెన్స్ చేసి నిలబెట్టాలా అనిపించదు. సెస్సేషనల్ కోసం మీడియానూ, ఇప్పటి దర్శకులు నిర్మాతకు కనీసంకథ కూడా చెప్పకుండా మేనేజ్ చేసి ఒప్పించడం వంటి వాటిపైనా, అమలాపురం వాళ్లు అతి మంచివాళ్ళు అన్నరీతిలో సెటైర్ వేసినవి బాగున్నాయి.
Organic Mama Hybrid Alludu review
టెక్నికల్ గా ..
ఈ సినిమా కు కృష్ణారెడ్డి ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. పైగా ఇప్పటితరం వారికి రీచ్ అయ్యేలా టెక్నికల్ ఎలిమెంట్స్ తెరపై కనిపించలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరపై ఆవిష్కరించాలనేది దర్శకుడి ప్రయత్నం. అక్కడక్కడా ఫన్ సీన్స్ పండాయి కానీ ఓవరాల్ గా కథలో ఆ ఫన్ రైజ్ అయ్యే మెలిక ఎక్కడా కనిపించదు. డైలాగులు మాత్రం బాగున్నాయి. ఇక ఈ సినిమాకు సంగీతం బాగున్నాయి. నేపధ్య సంగీతంలో వుండే ఎమోషన్ కంటెంట్ వుంటే బావుండేది.విజువలైజేషన్ కూడా బాగా చేసారు. చిత్ర నిర్మాత కోనేరు కల్పన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. సినిమా నిడివి కాస్త తక్కువే. కానీ ఎక్కువ చూసిన ఫీలింగ్ వచ్చింది.
Organic Mama Hybrid Alludu review
నటీనటుల్లో...
లక్కీ లక్ష్మణ్ తర్వాత బిగ్‌బాస్ సోహెల్ నటిస్తోన్న సినిమా ఇది. లక్కీ లక్ష్మణ్ తో పోలిస్తే ఈ సినిమా లో నటన మెరుగుపడిందనే చెప్పాలి. అలాగే ఎక్కడా కావాలని హీరోయిజం హైలెట్ చేయకుండా ఆ పాత్రని డిజైన్ చేయడం బావుంది. సునీల్ తన అమాయికత్వంతో కూడిన ఫన్ మరోసారి బాగా చూపించాడు. అజయ్ ఘోష్ ప్రెజెన్స్ కథలో ఇంటెన్స్ తీసుకొచ్చింది. హీరోయిన్ గా మృణాళిని రవి బాగానే చేసింది, రాజేంద్రప్రసాద్, మీనా ,అజయ్ ఘోష్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సూర్య, హేమ, హర్ష జెముడు, ప్రవీణ్, సునీల్, కృష్ణ భగవాన్, సప్తగిరి వంటి వారు చిన్న పాత్రలు అయినా ఫన్ తో లాగే ప్రయత్నం చేసారు.
Organic Mama Hybrid Alludu review
ఫైనల్ థాట్
ఎస్వీ కృష్ణారెడ్డి తన అభిమానులు కోసమే తీసినట్లు ఉండే ఈ చిత్రాన్ని ..వాళ్లు ఇంకా థియేటర్స్ కు వచ్చి చూస్తే ఏ ఇబ్బంది లేదు
Rating:2.5
Organic Mama Hybrid Alludu review
తెర మందు..వెనుక
సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు
కెమెరా: సి. రాంప్రసాద్,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
ఆర్ట్: శివ,
పాటలు: చంద్రబోస్, రామజోగయ్య, శ్రీమణి,
సమర్పణ: కె. అచ్చిరెడ్డి,
నిర్మాత: కోనేరు కల్పన,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.
విడుదల తేదీ: 03, మార్చి 2023