ఈ శుక్రవారం చిన్న సినిమాల జాతర సాగుతుంది. పదికి పైగా సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో కాస్త బజ్ ఉన్న చిత్రాల్లో `ధూం ధాం` ఒకటి. ఇందులో చేతన్ కృష్ణ, హేబా పటేల్ జంటగా నటించగా, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషించారు. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. దీనికి ప్రముఖ రైటర్ గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ సినిమా నేడు శుక్రవారం(నవంబర్ 8)న గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కథః
కార్తిక్(చేతన్ కృష్ణ)కి నాన్న రామరాజు(సాయికుమార్) అంటే చాలా ఇష్టం. కొడుకంటే రామరాజుకి కూడా అంతే ప్రేమ. ఏ విషయం అయినా కొడుకుతో పంచుకుంటారు. కొడుకు కూడా అంతే. తను సుహానా(హేబా పటేల్)ని ఇష్టపడతాడు. కానీ ఆమె తెలియనట్టు ప్రవర్తిస్తుంది. కార్తీక్ తన పర్సనల్ పనిమీద పోలాండ్‌కి వెళ్తాడు. కార్తీక్ కోసం సుహానా కూడా పోలాండ్ వస్తుంది. ఆయన వెంటపడుతుంది. కానీ కార్తీక్ ఆమెని అవాయిడ్ చేస్తాడు. కారణం సుహానా తనపై బెట్టు కట్టి కార్తీక్‌ని తన లవ్ లో పడేయాలనుకోవడం. తమ పేరెంట్స్ కంటే ఎక్కువ ప్రేమ కార్తీక్ వాళ్ల నాన్న మీద ఉన్న నేపథ్యంలో ఆ ప్రేమని డైవర్ట్ చేయాలని, తనపై ఫోకస్ పెట్టించాలనుకుంటుంది. ఈ విషయం తెలిసి కార్తీక్ ఆమెని దూరం పెడతాడు. అంతేకాదు నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అయితే ఆమె ట్రెడిషనల్ గర్ల్ గా కనిపించి మోసం చేయడాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. దీంతో మళ్లీ సుహానాపై ప్రేమని పెంచుకుంటాడు. ఇద్దరు లవ్ లో ఎంజాయ్ చేస్తుంటారు. సుహానా సైతం తన నాన్నకి కార్తీక్ విషయం చెబుతుంది. నాన్నకి అతన్ని పరిచయం చేయాలనుకున్నప్పుడు విషయాన్ని దాటేస్తాడు కార్తీక్. వాళ్ల నాన్న ఎవరో తెలిసి భయపడతాడు. కట్ చేస్తే కార్తీక్ కజిన్ సుహాస్(వెన్నెల కిశోర్) మ్యారేజ్ కోసం ఇండియా వస్తారు. ఇక్కడ కార్తీక్, ఆయన ఫ్రెండ్స్ (ప్రవీణ్, నవీన్ నేని) ని చూసి షాక్ అవుతారు సుహానా పెదనాన్న(గోపరాజు రమణ) వాళ్ల తమ్ముళ్లు(బెనర్జీ). కార్తీక్‌పై కోపంతో రగిలిపోతారు. చంపేయాలని చూస్తుంటారు. కానీ సుహాస్ మాత్రం తన కజిన్ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని, అతనికి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదని చెబుతుంటాడు. దీంతో వారంతా తర్జనభర్జనా అవుతారు. మరి కార్తీక్ వారిని చూసి ఎందుకు భయపడుతుంటాడు? కార్తీక్, వారి ఫ్రెండ్స్ పై సుహానా పేరెంట్స్ ఎందుకు కోపంతో రగిలిపోతుంటారు? గతంలో ఏం జరిగింది? సుహాస్ పెళ్లి జరిగిందా? మధ్యలో ఆగిపోయిందా? ఫైనల్‌గా ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇటీవల కాలంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలు రావడం లేదు. యాక్షన్, రా, రస్టిక్ కథలకు ఎక్కువగా ఆదరణ ఉంటున్న నేపథ్యంలో మేకర్స్ అంతా అలాంటి సినిమాలే చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు రావడం లేదు. పైగా క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్స్ మేళవించిన సినిమాల లోటు అయితే ఉంది. ఈ క్రమంలో `ధూం ధాం` సినిమాతో ఆ లోటు భర్తీ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్ రైటర్ గోపీ మోహన్, దర్శకుడు సాయి కిషోర్ మచ్చా. మంచి రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఇక సినిమా క్లీక్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. లవ్ ట్రాక్ ఉన్నా, అందులో వల్గారిటీ ఉండదు. అందరు చూడగలిగేలా ఆయా ఎలిమెంట్లని జోడించారు. దీనికితోడు తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తోపాటు ఫ్యామిలీ అనుబంధాలను అంతర్లీనంగా చేసుకుని ఈ సినిమాని చేయడం విశేషం. ఆ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇక సినిమాగా చూసినప్పుడు ఫస్టాప్ అంతా హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ చుట్టూ సరదాగా సాగుతుంది. బెట్టింగ్‌లు, అలకలు, ఫన్నీ సన్నివేశాలతో సాగిపోతుంది. కాసేపు ఇండియాలో, ఎక్కువ భాగం పోలాండ్‌లో కథ రన్ అవుతుంది. ఈ సన్నివేశాలన్నీ కాస్త రెగ్యూలర్‌గానే ఉంటాయి. అదే సమయంలో చేతన్, హేబా ల మధ్య లవ్‌సీన్లు కొంత ఫన్నీగా, ఇంకొంత ఫీల్‌గుడ్‌గా, అలాగే రొమాంటిక్‌గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల రొటీన్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీనికితోడు ప్రవీణ్ చేసే కామెడీ కొంత రిలీఫ్‌నిచ్చే అంశమని చెప్పొచ్చు. హీరోయిన్ ఫ్రెండ్స్, ప్రవీణ్ మధ్య సీన్లు నవ్వించేలా ఉంటాయి.
ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. హేబా పటేల్ ఫాదర్ ఎవరో తెలిసి హీరో, ఆయన ఫ్రెండ్స్ షాక్ అవ్వడం, దీనికి తాలూకు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లడం,ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ఇక సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ ఎంట్రీ ఉంటుంది. ఆయన రాకతో సినిమా ఆద్యంతం కామెడీ వైపు టర్న్ తీసుకుంటుంది. ఓ రకంగా సెకండాఫ్ మొత్తం వెన్నెల కిశోర్ పాత్ర మీద రన్‌అవుతుంది. ఆయన చేసే కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది. దీనికితోడు ప్యాడింగ్ ఆర్టిస్ట్ లంతా ఉండటం తెర మొత్తం కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ పేరెంట్స్ కోపంతో రగిలిపోవడం, వెన్నెల కిశోర్ వారికి అడ్డుకట్ట వేయడం వంటి సీన్లు `మర్యాద రామన్న` సినిమాని తలపిస్తాయి. అవి రొటీన్‌గానే ఉన్నా, ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. అలా సెకండాఫ్ అంతా కామెడీతో నడిచిపోతుంది. మనకు తెలియకుండానే క్లైమాక్స్ కి చేరుకుంటుంది. నవ్వుతో ముగింపు పలుకుతుంది. అయితే క్లైమాక్స్ ఎండింగ్ మాత్రం అంతా ఊహించనట్టే జరగడం విశేషం. సినిమాలో ఫన్నీ సీన్లు వర్కౌట్ అయ్యాయి. కానీ కొన్ని చోట్ల బలవంతంగా పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాప్ ఆ స్థాయిలో ట్రాక్ ఏదైనా పెడితే బాగుండేది. దీనికితోడు అంతా ఊహించినట్టే జరుగుతుంది. ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు సినిమాలో కనిపించవు, ఫ్లాట్‌గా వెళ్తుంది. డైలాగ్‌లు కూడా కొంత రెగ్యూలర్‌గానే అనిపిస్తుంటాయి. హేబా, హీరో మధ్య లవ్ ట్రాక్ కూడా రెగ్యూలర్‌గానే అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకొంత జాగ్రత్తలు తీసుకుని, కొత్తగా రాసుకుంటే బాగుండేది. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే టైమ్ పాస్ నవ్వుకునే సినిమా అవుతుంది.
నటీనటులుః
హీరోగా చేతన్ కృష్ణ బాగా చేశాడు. నటుడిగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సినిమా కోసం తను పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ పరంగా మరింత వర్క్ చేయాల్సింది. కానీ కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తే మరింతగా ఎదుగుతాడు. ఇక చాలా రోజుల తర్వాత హేబా పటేల్ కమర్షియల్ హీరోయిన్‌గా మెరిసింది. తనని స్టార్‌ని చేసిన లవ్ ట్రాక్‌లో నటించి మెప్పించింది. పాత హేబాని పరిచయం చేసింది. అందంతో ఆకట్టుకోవడంతోపాటు అభినయంతోనూ అలరించింది. వీరిద్దరి జోడీ బాగా కుదిరింది. ఇక సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్రైనా జీవిస్తారు. ఇందులోనూ హీరో తండ్రిగా అదరగొట్టారు. సుహాస్‌గా వెన్నెల కిశోర్ సినిమాకి పెద్ద అసెట్. ఇంకా చెప్పాలంటే ఆయనే సెకండ్ హీరో. సెకండాఫ్ అంతా తన భుజాలపై మోశాడు. శృతిగా హర్షిణి రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కాసేపు రచ్చ చేసింది. వీరితోపాటు గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, గిరిధర్, నవీన్‌నేనిల కామెడీ హిలేరియస్‌గా నవ్విపిస్తుంది. మిగిలిన నటీనటులు బాగానే మెప్పించారు.
టెక్నీషియన్లుః
సినిమాకి గోపీసుందర్ మ్యూజిక్ పెద్ద అసెట్. పాటలు చాలా బాగున్నాయి. పెద్ద హీరోల రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఆర్‌ఆర్ కూడా అంతే బాగుంది. సినిమాకి మ్యూజిక్ కొత్త ఫీల్‌ని కలిగించిందని చెప్పొచ్చు. అలాగే సిద్ధార్థ్ రామస్వామి కెమెరా వర్క్ చాలా బాగుంది. విజువల్స్ గా కలర్ ఫుల్‌గా ఉంది. ఎడిటర్ అమర్ రెడ్డి సినిమాని చాలా షార్ప్ గా కట్ చేశారు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమా రేంజ్‌కి మించి ఖర్చు చేశారు. ఆ విషయం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఇక దర్శకుడు సాయి కిశోర్ మచ్చా దర్శకత్వం సినిమాకి మరో అసెట్. కథగా చెప్పాలంటే కొంత రెగ్యూలర్‌గానే అనిపిస్తుంది. కానీ దాన్ని ఆద్యంతం కొత్తగా, ఎంగేజింగ్‌గా తీయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఇలాంటి కథలు చెప్పినప్పుడు బాగుంటాయి, కానీ తెరపైకి వచ్చినప్పుడు తేలిపోతాయి. కానీ ఇందులో అవి పండేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. జనరల్‌గా శ్రీను వైట్ల కాంపౌండ్ నుంచి వచ్చిన వారంటే డ్రామాలతో విసుగుపుట్టిస్తారనే నానుడి ఉంది. కానీ దాన్ని బ్రేక్ చేశాడు సాయి కిశోర్. తన మార్క్ ని చూపించాడు. ఫన్ వర్కౌట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కథని కూడా కాస్త కొత్తగా ప్లాన్ చేస్తే బాగుండేది. ఫస్టాప్‌ని ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. ఓవరాల్‌గా దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్నాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః టైమ్ పాస్ లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
రేటింగ్‌ః 2.75
నటీనటులు -
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్ తదితరులు.
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ - రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ - గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా
read more: జితేందర్ రెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్