జితేందర్‌ రెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Nov 8, 2024, 8:01 AM IST

పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలు జోరు నడుస్తుంది. తాజాగా ఈ వారం 10కి పైగా సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో ప్రముఖంగా నిలిచింది `జితేందర్‌ రెడ్డి` మూవీ. ఈ సినిమా జనాలను ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

చరిత్రలో కొందరు నాయకుల గురించే మనం చెప్పుకుంటాం. కానీ బయటకు తెలియని, చరిత్రలో రాయని చాలా మంది నాయకులు ఉన్నారు. స్థానికంగా జనం కోసం పోరాడిన నాయకులు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో జితేందర్‌ రెడ్డి కూడా ఒకరు. జగిత్యాలకు చెందిన ఏబీవీపీ నాయకుడు జితేందర్‌ రెడ్డి. నక్సల్స్ కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆయన జీవితం ఆధారంగా తాజాగా `జితేందర్‌ రెడ్డి` పేరుతోనే సినిమా రూపొందింది.

`ఉయ్యాల జంపాల`, `మజ్ను` ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాకేష్‌ వర్రే ప్రధాన పాత్రలో జితేందర్‌ రెడ్డిగా నటించారు. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ఇందులో వైశాలి రాజ్‌, రియా సుమన్‌, ఛత్రపతి శేఖర్‌, సుబ్బరాజు, రవి ప్రకాష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ నేడు విడుదలైంది. ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కథః
జితేందర్‌ రెడ్డి(రాకేష్‌ వర్రే) అలియాస్‌ జిత్తన్న తండ్రి ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలకంగా పనిచేస్తుంటారు. ఆయన నేర్పిన ఆశయాలను, పాఠాలను బాగా వంటపట్టించుకుంటాడు జితేందర్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం అప్పుడప్పుడే పెరుగుతుంది. బీజేపీ సైతం బాగా యాక్టివ్‌గా మారిన రోజులు. అదే సమయంలో నక్సల్‌ ప్రభావం కూడా బాగానే ఉంది.

తెలంగాణలో ఆ ప్రభావం మరింతగా ఉంది. నక్సల్‌ అనుబంధ స్టూడెంట్‌ యూనియన్‌ ప్రభావం కాలేజీలు, యూనివర్సిటీల్లో మరింతగా ఉంది. ఆ సమయంలో జిగిత్యాల ప్రభుత్వ కాలేజీలో అప్పటికే పీడీఎస్‌యూ(సినిమాలో యూనియన్లు, నాయకుల పేర్లు మార్చారు) హవా నడుస్తుంది. బంద్‌లతో హల్‌చల్‌ చేస్తుంటారు. దీంతో వారికి వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకుడిగా ఎదిగాడు జితేందర్‌. అప్పటి వరకు నక్సల్‌ యూనియన్‌ ప్రభావంతో కాలేజీ మొత్తం హడలిపోతున్న నేపథ్యంలో జితేందర్‌ రెడ్డి రాకతో వారికి వణుకు పుడుతుంది.

జగిత్యాల ప్రాంతంలోని ఊర్లలోనూ జనం కూడా నక్సల్‌కి అనుకూలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారిలో మార్పు తీసుకొస్తాడు. తనే స్వయంగా రంగంలోకి దిగి నక్సల్స్ అంతం కోసం పనిచేస్తుంటాడు. పోలీసులు చేయలేనిది తను చేసి చూపిస్తాడు. ఈ క్రమంలో తనకు నక్సల్స్ నుంచి ప్రాణహాని పొంచి ఉంది. అయినా దాన్ని లెక్కచేయకుండా తన ఆశయం కోసం పనిచేస్తుంటాడు.

ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటాడు జితేందర్‌ రెడ్డి. స్టూడెంట్‌ లీడర్‌గా ఉంటే ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం, అదే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయితే మరింతగా మంచి చేయోచ్చు, అభివృద్ధి చేసి నక్సల్‌ ప్రభావాన్ని మరింతగా తగ్గించవచ్చు అని భావిస్తాడు. మరి రాజకీయాల్లో రాణించగలిగాడా? అందులో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు? ఎమ్మెల్యేగా గెలిచాడా? అప్పటి సీఎం ఎన్టీ రామారావు దృష్టిలో పడేలా జితేందర్‌ రెడ్డి ఏం చేశాడనేది మిగిలిన కథ.


విశ్లేషణః
జితేందర్‌ రెడ్డి సినిమా.. 1978-90 మధ్య కాలంలో జరిగిన కథ. ఓ రకంగా జితేందర్‌ రెడ్డి ఎదిగిన తీరుని, జనం కోసం చేసిన పోరాటం, నక్సల్స్ పై చేసిన తిరుగుబాటుని ఆవిష్కరించే చిత్రమవుతుంది. రైట్‌ వింగా, లెఫ్ట్ వింగా అనేది పక్కన పెడితే జనం కోసం ఎదిగిన నాయకుడిగా, ఉన్న తక్కువ టైమ్‌లో అయినా జనంలో మార్పు కోసం, జాతీయవాదం కోసం, అభివృద్ధి కోసం, ధర్మం కోసం పనిచేసిన వ్యక్తి జితేందర్‌ రెడ్డి అనేది ఈ సినిమాలో చూపించారు.

ముఖ్యంగా జితేందర్‌ రెడ్డిలోని గొప్ప నాయకత్వాన్ని, వీరత్వాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో, ఆ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జితేందర్‌ రెడ్డి వారికి వ్యతిరేకంగా పోరాడటం అంటే మామూలు కాదు. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆయన పోరాడిన తీరు స్పూర్తిదాయకం. నక్సల్స్ తో గేమ్‌ అంటే మామూలుగా ఉండదు, దానికి చాలా గుండెధైర్యం కావాలి. అవన్నీ ఉన్న వ్యక్తి జితేందర్‌ రెడ్డి, అందుకే ఆయన గొప్ప నాయకుడు అయ్యాడు.

ఇప్పటికీ అక్కడి జనంలో గుర్తిండిపోయాడు. అయితే జితేందర్‌ రెడ్డి గొప్ప నాయకుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు, కానీ కొంత రియాలిటీకి దూరంగా ఉందనే ఫీలింగ్‌ కలుగుతుంది. జితేందర్‌ రెడ్డిని హీరోగా చూపించే క్రమంలో నక్సల్స్ ని మరీ విలన్లుగా చూపించడం వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. 

అలాగే జితేందర్‌ రెడ్డి జర్నీని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో జితేందర్‌ రెడ్డి నేర్చుకున్న భావజాలం, తాను చూసిన సంఘటనలు, తాను ఎలా మారాలనుకున్నాడు? ఒకరి కోసం కాదు, అందరికోసం పనిచేసేలా ఎదగాలనుకోవడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో జరిగిన సంఘటనలు ఎమోషనల్‌గానూ అనిపిస్తాయి.

1980 పీరియడ్‌ టైమ్‌ని ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే కాలేజీ ఎన్నికలు, అందులో హడావుడి వంటి అంశాలను లైట్‌గా చూపించారు. అలాంటి సన్నివేశాలే బాగా ఎట్రాక్ట్ చేస్తాయి. ఆ ఉత్కంఠ, ఆ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తాయి. కానీ ఇందులో వాటికి ప్రయారిటీ ఇవ్వలేదు. అయితే తాము ఓడిపోవడంతో పీడీఎస్‌యూ నాయకులు జితేందర్‌రెడ్డిని చంపాలనుకోవడం, ఈ క్రమంలో వచ్చే సీన్లు, ఫైట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.

కానీ ఆయా సన్నివేశాలు ఇంకా బాగా చూపించాల్సింది. క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక స్క్రీన్‌ ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అదే సమయంలో సినిమాని మరింత ఉత్కంఠ భరితంగా తెరకెక్కిస్తే బాగుండేది. కొన్ని లాజికల్‌ విషయాలను మిస్‌ చేశారు. మొత్తంగా ఇది మంచి ఇన్‌స్పిరేషనల్‌ స్టోరీ అవుతుంది. అంతేకాదు నేటి తరానికి తెలియాల్సిన కథ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

నటీనటులుః 

జితేందర్‌ రెడ్డి పాత్రలో రాకేష్‌ వర్రే ఒదిగిపోయాడు. జితేందర్‌ రెడ్డిని మరిపించాడు. చాలా బాగా నటించాడు. చాలా చోట్ల సెటిల్డ్ పర్ఫెర్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసిన తీరు బాగుంది. అయితే ఆయన పాత్రలో హీరోయిజాన్ని మరింతగా ఎస్టాబ్లిష్‌ చేయాల్సింది. ఇక గోపన్న పాత్రలో సుబ్బరాజు అదరగొట్టాడు. ఈ కథ చెప్పే జితేందర్‌ రెడ్డి గన్‌మెన్‌ ఘట్టయ్య పాత్రలో రవి ప్రకాష్‌ బాగా చేశాడు. నక్సల్‌ నాయకుడిగా ఛత్రపతి శేఖర్‌ తనకు యాప్ట్ గా నిలిచే పాత్ర చేశాడు. హీరోయిన్‌ రియా సుమన్‌ ఉన్నంతలో బాగానే చేసింది. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందించడం విశేషం. అయితే ఆయన రేంజ్‌ సంగీతం కనిపించలేదు. బీజీఎం డోసు కూడా తగ్గింది. వీఎస్‌ జ్ఞాన శేఖర్‌ కెమెరా వర్క్ ఫర్వాలేదు. కానీ క్లారిటీ మిస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ లోపాలు కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్‌ పరంగా ఫర్వాలేదు. ఇక దర్శకుడు విరించి వర్మ స్థాయిలో సినిమా టేకింగ్‌ లేదని చెప్పొచ్చు. `ఉయ్యాల జంపాల` సినిమా స్థాయి దర్శకత్వ ప్రమాణాలు ఇందులో లోపించాయి. గ్రిప్పింగ్‌గా తీయలేకపోయాడు. కానీ కథలో హీరోయిజం ఎలివేట్‌ అయ్యిందికానీ, దర్శకుడు తాలూకూ టాలెంట్‌ని కూడా చూపించాల్సింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే ఇదొక ఇన్‌స్పైర్‌ చేసే స్టోరీ అవుతుందని చెప్పొచ్చు. 

ఫైనల్‌గాః `జితేందర్‌ రెడ్డి` తెలుసుకోవాల్సిన కథ. 

రేటింగ్‌ః 2.75
Read more: సమంత ఒంటి మీద 20 లక్షల ఐటమ్ ఏంటో తెలుసా..? ఇంత సింపుల్ గా ఉంది అంత కాస్టా..?

Latest Videos

click me!