
సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దుమ్మురేపుతున్నారు. బలమైన పాత్రలతో రచ్చ చేస్తున్నారు. ఓ రకంగా ఆయనకిది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. బలమైన పాత్రలకు ఆయన కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో `డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు` అనే వెబ్ సిరీస్ రూపొందింది. దీనికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఇందులో ఉదయబాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్, గాయత్రి భార్గవి ప్రధాన పాత్రలు పోషించారు. `రెక్కీ`, `విరాటపాలెం` వంటి చిత్రాల తర్వాత సౌత్ ఇండియా స్క్రీన్స్ పతాకంపై కేవీ శ్రీరామ్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? రాజీవ్ కనకాల ఆకట్టుకున్నారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ప్రసాద్ రావు(రాజీవ్ కనకాల) చాలా స్టిక్ట్ ఫాదర్. ఆయనతో మాట్లాడాలన్నా, ఏదైనా విషయం చెప్పాలన్నా ఇంట్లో వాళ్లకి భయం. ఆయన కూతురు స్వాతి(వాసంతిక) ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది. ఆమెకి హైదరాబాద్‌లో జాబ్ వస్తుంది. ఆ విషయం చెప్పాలంటే బావ, తమ్ముడు, అమ్మ, చివరికి స్వాతి కూడా భయపడుతుంది. కూతురుని చిన్నప్పట్నుంచి ఒక్క రోజు కూడా ఒంటరిగా బయటకు పంపించింది లేదు. అలాంటిది జాబ్ కోసం అంటే వెంటనే నో చెబుతారు. కానీ కన్విన్స్ చేస్తారు. దీంతో ఆయన హైదరాబాద్‌కి పంపించేందుకు ఒప్పుకుంటాడు. అక్కడ భవానీ హాస్టల్‌లో చేర్పిస్తాడు. ఆ హాస్టల్‌కి వార్డెన్ భవాని(గాయత్రి భార్గవి). ఆమె సమక్షంలో స్వాతి హ్యాపీగానే ఉంటుంది. జాబ్‌కి హ్యపీగా వెళ్లి వస్తుంది. ఇక నెల రోజులు పూర్తవుతుంది. సాలరీ వచ్చే టైమ్ వస్తుంది. కానీ అనూహ్యంగా స్వాతి కనిపించదు. ఆ రోజు ఆఫీస్‌కి సంతోషంగా వెళ్లిన స్వాతి వచ్చేటప్పుడు భయంతో, టెన్షన్‌తో హాస్టల్‌కి వస్తుంది. ఆ తర్వాత ఆమె మిస్ అవుతుంది. ఆ కేసుని సీఐ రెబెకా(ఉదయభాను) ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మరి స్వాతి ఎక్కడికి వెళ్లింది? మిస్సింగ్ కేసు ఎలా మర్డర్ మిస్టరీగా మారింది? స్వాతి మరణానికి కారణం ఎవరు? హాస్టల్ సిబ్బంది, పోలీసులకు కనిపించని స్వాతి ఆమె తండ్రి ప్రసాద్ రావుకే ఎందుకు కనిపించింది? దాని వెనక ఉన్న కథేంటి? ఆ రోజు ఆఫీస్‌లో, హాస్టల్‌లో స్వాతి ఎలాంటి సంఘటనలు ఫేస్ చేసింది? స్వాతి మరణానికి అసలు కారణం ఏంటనేది మిగిలిన కథ.
`డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు` వెబ్ సిరీస్ డెత్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి మిస్టరీతో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. అలాంటిదే ఈ సిరీస్ కూడా. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉన్న ట్విస్ట్ లు, టర్న్ లే. మనం ఒకటి ఊహిస్తాం, కానీ వెనకాల మరోటి జరుగుతుంటుంది. ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. మిస్సింగ్ కేసు, మర్డర్ మిస్టరీగా, ఆ తర్వాత డెత్ మిస్టరీగా, తర్వాత రివేంజ్‌గా టర్న్ తీసుకుంటుంది. ఈ మలుపులే ఈ సిరీస్‌కి హైలైట్‌గా చెప్పొచ్చు. అయితే ఈ కథకి పారలల్‌గా చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. అందులో ఓ అమ్మాయి తనని గేమ్ ఆడిపించుకోలేదని, మరో అమ్మాయిని బావిలో తోస్తుంది. అంతేకాదు డబ్బుతో పారిపోవాలని పేరెంట్స్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. ఇంకోవైపు పెద్దయ్యాక ఏకంగా నగలు, డబ్బు తీసుకొని పారిపోతుంది. మరి ఆ కథకి, స్వాతి మరణానికి ఉన్న లింకేంటి? అనేది చూపించిన తీరు మాత్రం అదిరిపోయింది. సిరీస్ ప్రారంభం నుంచి ఎంగేజింగ్‌గా సాగుతుంది. సస్పెన్స్ తో రన్ అవుతుంది. ఎందుకు ప్రసాద్ రావు టెన్షన్ పడుతున్నాడు, కూతురు కోసం ఆయన తపించే సీన్లు ఎంగేజ్ చేస్తాయి. తీరా అమ్మాయి కనిపించడం లేదని, పోలీసులు రంగంలోకి దిగడం, ఇన్విస్టిగేషన్ చేసే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. ఏం జరగబోతుందనే ఉత్కంఠని గురి చేస్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో అనేక సస్పెన్స్ అంశాలు వస్తుంటాయి. మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. మనం ఒకటి అనుకుంటే, ఉదయభాను మరికొన్ని ఆసక్తికర విషయాలు చెబుతుంది. అనుమానాలు చాలా మందిపైకి వెళ్తుంటాయి. కానీ వాళ్లెవరూ నేరస్తులు కారు. ఇవన్నీ చూపుతిప్పుకోనివ్వవు. ఇక కేసు విచిత్రంగా క్లోజ్ అవుతుంది. కూతురు మరణానికి తండ్రినే కారణం అని చెప్పే పాయింట్ క్రేజీగా ఉంది. అయితే దాని వెనక ఉన్న సందేశం బాగుంది. అందరు పాటించాల్సిన విషయం కూడా. కేసు క్లోజ్ అయ్యాక అసలు ట్విస్ట్ రివీల్ చేసి, స్వాతి మరణానికి అసలు కారణం ఎవరనేది రివీల్ చేసిన తీరు బాగుంది. ఆద్యంతం ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతూ, చివర్లో ఊహించని విధంగా ముగింపుని పలికిన తీరు అదిరిపోయింది. సస్పెన్స్ మర్డర్ మిస్టరీలో ఇదొక డిఫరెంట్ సిరీస్‌గా చెప్పొచ్చు. పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా ఉండాలి, వాళ్లు ప్రతిదీ పేరెంట్స్ తో చెప్పుకునే ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పే సందేశం బాగుంది. అయితే ఈ సిరీస్ కాస్త స్లోగానే సాగుతుంది. మరోవైపు ట్విస్ట్ లు అంత కిక్ ఇవ్వలేదు. ఇంకోవైపు చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. ప్రతీకారానికి సంబంధించిన పాయింట్ చాలా వీక్‌గా ఉంది. కన్విన్స్ అయ్యేలా లేదు. అదే సమయంలో తండ్రి కారణం అని చెప్పిన తీరు కూడా కన్విన్సింగ్ గా లేదు. ఇలాంటి కొన్ని మైనస్‌లను సరిగ్గా డీల్ చేస్తే సిరీస్ ఇంకా బాగుండేది. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. అన్నీ అరగంట కంటే తక్కువే ఉన్నాయి. చూస్తుండగానే అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఓ సినిమా చూసినంత సేపట్లో సిరీస్ ముగుస్తుంది.
ప్రసాద్ రావుగా రాజీవ్ కనకాల నటన అదిరిపోయింది. ఆయనే ఈ సిరీస్‌కి హీరో అని చెప్పొచ్చు. సెటిల్డ్ గా చేసి మెప్పించారు. నటుడిగా ఆయన తన బెస్ట్ ఇచ్చారు. మెప్పించారు. స్వాతి పాత్రలో వాసంతిక అదరగొట్టింది. ఉన్నంత సేపు మెప్పించింది. పోలీస్ ఆఫీసర్‌గా ఉదయభాను చాలా బాగా చేసింది. ఆమెకి అదిరిపోయే పాత్ర పడింది. పోలీస్ రోల్‌లో బాగా సూట్ అయ్యింది. అంతే బాగా చేసింది. గాయత్రి భార్గవి ఉన్నంతలో మెప్పించింది. కానీ ఆమె పాత్రలోని ట్విస్ట్ వాహ్ అనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన నటనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ఈ సిరీస్‌కి శ్రీరామ్ మద్దూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రారంభం నుంచి ఎంగేజ్ చేసేలా ఆయన ఆర్‌ఆర్ ఉంది. సస్పెన్స్ ని మెయింటేన్ చేస్తూ సిరీస్ ని నడిపించిన తీరు బాగుంది. చంద్రశేఖర్ జీవీ ఎడిటింగ్ ఫర్వాలేదు. రామ్ కే మహేష్ కెమెరా వర్క్ కూడా బాగుంది. నీట్‌గా ఆకట్టుకునేలా విజువల్స్ ఉన్నాయి. దర్శకుడు కృష్ణ పోలూరు ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తీసుకెళ్లిన తీరు బాగుంది. ముగింపు కూడా ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో మంచి సందేశం కూడా అందించారు. అయితే లాజిక్స్ వదిలేశారు. కాన్‌ఫ్లిక్ట్ ని మరింత బలంగా, రివేంజ్‌ని ఇంకా బలంగా రాసుకుంటే ఇంకా బాగుండేది. కాకపోతే పిల్లల విషయంలో పేరెంట్స్ కి ఇచ్చిన సందేశం బాగుంది.
ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతూ ఎంగేజ్ చేసే డెత్ మిస్టరీ `డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు`. పేరెంట్స్ చూడాల్సిన సిరీస్.