
సుహాస్ మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో రాణిస్తున్నాడు. హీరోగా నిరూపించుకుంటున్నాడు. మంచి నటుడిగా ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలో ఇప్పుడు `హే బల్వంత్` అనే మూవీతో వచ్చాడు. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివానీ నగరం హీరోయిన్‌గా నటించింది. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిశోర్, అజయ్ ఘోష్, యాంకర్ స్రవంతి, హర్షవర్థన్ ముఖ్య పాత్రలు పోషించారు. బీ నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. నేడు శుక్రవారం(ఫిబ్రవరి 20) విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కృష్ణ(సుహాస్)కి చిన్నప్పట్నుంచి బిజినెస్‌పై ఆసక్తి ఎక్కువ. తండ్రి రావ్ బలవంత్(వీకే నరేష్) ఎప్పుడూ క్లైంట్లతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన పెద్ద వ్యాపారం చేస్తున్నాడని, పెద్ద కంపెనీ నిర్వహిస్తున్నాడని, తాను కూడా పెద్దయ్యాక తండ్రి బిజినెస్‌ని చూసుకుంటానని కలలు కంటాడు. దీంతో చదువు మీద కూడా శ్రద్ధ పెట్టడు. కానీ తండ్రి ఏం బిజినెస్ చేస్తున్నాడో తెలియదు. నానమ్మ(అన్నపూర్ణమ్మ)ని అడిగితే ఏదో కుటీర పరిశ్రమ(స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్) అని చెబుతుంది. పెద్దయ్యాక ఇక తండ్రి బిజినెస్ టేకోవర్ చేసుకోవాలని కలలు కంటాడు. కానీ తండ్రి ఎప్పుడూ తనని ఎంకరేజ్ చేయడు, చదువుకోవాలని ఫోర్స్ చేస్తుంటాడు. దీంతో తండ్రిమీద కొంత కోపం ఉంటుంది. ఓ రోజు సడెన్‌గా తండ్రి రావ్ బలవంత్‌కి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆయనకు ఎలాంటి ఒత్తిడి ఇవ్వకూడదని డాక్టర్ చెబుతాడు. దీంతో ఇక తండ్రి బిజినెస్‌ని టేకోవర్ చేసే టైమ్ వచ్చిందని భావిస్తాడు. తన ఆఫీస్‌కి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లాక తండ్రి నిర్వహిస్తున్న కంపెనీ చూసి దిమ్మతిరిగిపోతుంది. ఆయన బల్వంత్ అనే లాడ్జ్ ని నడుపుతుంటాడు. అందులో ప్రొస్ట్రిట్యూషన్ హౌజ్‌ని నిర్వహిస్తుంటాడు. అది చూసి కృష్ణ రియాక్షన్ ఏంటి? తన లవర్ మిత్ర(శివానీ నగరం)కి ఈ విషయం తెలిసిందా? ప్రియురాలిని మ్యానేజ్ చేయడానికి ఏం చేశాడు? మిత్ర తాత(బాబుమోహన్) ఎలా చనిపోయాడు? ఆయన చుట్టూ ఈ కథ, అటు రాజకీయం ఎలా తిరిగింది ? ఆ తర్వాత ఎలాంటి ఆసక్తికర పరిణామాలు, ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయనేది సినిమా.
హీరో సుహాస్ మినిమమ్ గ్యారంటీ హీరో అయిపోయాడు. ఆయన సినిమాలు చూస్తే కచ్చితంగా నవ్విస్తాయి. అదే సమయంలో ఏదో ఒక సందేశాన్ని ఇస్తాయి, ఆలోచింపచేస్తాయి. సెన్సిటివ్ సబ్జెక్ట్ లను చాలా నీట్‌గా డీల్ చేసి హిట్ కొడుతున్నాడు. ఇప్పుడు వచ్చిన `హే బల్వంత్` కూడా అలాంటి మూవీనే. కాకపోతే ఇటీవల ఆయన చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించడం లేదు. కానీ ఇప్పుడు `హే బల్వంత్` పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. మంచి ఎమోషన్స్ మేళవింపుతో రూపొందించారు. ఈ సారి మాత్రం సుహాస్ ప్రయత్నం ఫెయిల్ కాలేదని చెప్పొచ్చు. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్‌తో సాగుతుంది. సందర్భానుసారంగా వచ్చే కామెడీతో సాగుతూ, చివర్లో భావోద్వేగాలకు గురి చేస్తుంది. అలా గుండెని టచ్ చేసి ముగుస్తుంది. అదే సమయంలో ప్రొస్ట్రిట్యూషన్ నిర్వాహణకు సంబంధించిన అంశాన్ని డీల్ చేసిన విధానం కూడా అదిరిపోయింది. అందులోని ట్విస్ట్ మాత్రం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. సాధారణంగా ప్రొస్ట్రిట్యూషన్ అంటే తక్కువ చూపు ఉంటుంది. దాన్ని ఇబ్బందిగా చూస్తుంటారు. కానీ ఇందులో దాని వెనక ఆ మహిళల బాధని, వారి స్ట్రగుల్స్ గురించి చెప్పిన తీరు, దాన్ని చర్చించిన తీరు మాత్రం అదిరిపోయింది. ఆ విషయంలో మేకర్స్ ని అభినందించాల్సిందే. చాలా నీట్‌గా, వాహ్ అనేలా తెరపై ఆ ఎపిసోడ్‌ని ఆవిష్కరించారు. సినిమాగా చూసినప్పుడు హీరో సుహాస్ చిన్నప్పట్నుంచి తండ్రి పెద్ద వ్యాపారం చేస్తున్నాడని, తనకు చదువు అవసరం లేదు, తండ్రి బిజినెస్ చూసుకుంటానని భ్రమల్లో బతుకుతుంటాడు. అందరి ముందు గొప్పలు చెప్పుకుంటాడు. అంతేకాదు తాను కూడా బిజినెస్ ఐడియాస్ చాలానే నేర్చుకుంటాడు. వాటిని ఇతరుల బిజినెస్ డెవలప్‌మెంట్ విషయంలో అమలు చేస్తుంటాడు. తన సలహాలిచ్చి ఎన్నో వ్యాపారాలు లాభాల్లోకి వచ్చేలా చేస్తాడు. ఇదంతా తన ప్రియురాలి వల్ల ఆయన చేయగలుగుతాడు. దీంతో ఆమె హీరోని చూసి ఫిదా అవుతుంది. ప్రపోజ్ కూడా చేస్తుంది. ఇవన్నీ చాలా ఫన్నీగా, సరదగా సాగిపోతుంది. మొదటి భాగంలోనే తండ్రి నిర్వహించే వ్యాపారం తెలిస్తే హీరో షాక్ అవ్వడం, ఆ తర్వాత హీరోయిన్‌కి ఈ విషయం తెలియకుండా చేయడానికి హీరో నానా తంటాలు పడటం,ప్రొస్ట్రిట్యూషన్ గృహంలో వెన్నెల కిషోర్ చేసే కామెడీ, దీనికితోడు హీరో ఫ్రెండ్ సుదర్శన్ పంచ్‌లు, ఆయనపై డైలాగులు నవ్వులు పూయిస్తాయి. హిలేరియస్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మతిపోయేలా ఉంటుంది. హీరోయిన్ తన ఫ్యామిలీ గురించి గొప్పలు చెప్పుకోగా, తీరా ఆమె తాత అందులోనే దొరికిపోవడం క్రేజీ విషయంగా చెప్పొచ్చు. సెకండాఫ్ కథ అంతా తాత శవాన్ని ఆయన ఇంటికి తీసుకెళ్లడం చుట్టూనే తిరుగుతుంది. అది కాస్త అజయ్ ఘోష్ ఇంటికి వెళ్తుంది. అక్కడ కామెడీ మరింత పెరిగిపోయిందని చెప్పొచ్చు. సెకండాఫ్ లో నరేష్ విశ్వరూపం చూపించాడు. కామెడీలో పీక్ చూపించాడు. క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో ఏడిపించాడు. ఆయన ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ఇలా సినిమా మొత్తం నవ్విస్తూ, చివర్లో గుండెని బరువెక్కించి ముగింపు పలికిన తీరు బాగుంది.
సినిమాలో ప్లస్ లు మైనస్లు చూస్తే..ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. సందర్భానుసారంగా వచ్చే కామెడీ నవ్విస్తుంది. బల్వంత్ లాజ్జ్ సీన్లు హిలేరియస్ గా ఉంటాయి. హీరోయిన్ ఫ్యామిలీ ఎపిసోడ్లు, ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. రెండు మూడు ట్విస్ట్ లు కామెడీని పెంచాయి, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. క్లైమాక్స్ అదిరిపోయింది. ప్రొస్ట్రిట్యూషన్ సంబంధించిన సందేశం బాగుంది. ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. మ్యూజిక్ బాగుంది. నటీనటులు సినిమాని మరో స్థాయిని తీసుకెళ్లారు. ముఖ్యంగా సుహాస్, నరేష్, శివానీ నగరం, వెన్నెల కిశోర్, సుదర్శన్ ఇరగదీశారు.
మైనస్ లు చూస్తే, ఫస్టాఫ్ లో అంతగా ఫన్ వర్కౌట్ కాలేదు. ఓవర్ డ్రామా అనిపిస్తుంది. సినిమాని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నట్టుగా ఉంది. హీరో నాన్న ప్రొస్ట్రిట్యూషన్ నిర్వహిస్తున్నారనే విషయం ఆడియెన్ కి ముందే తెలుస్తుంది. హీరోలో ఉన్న సస్పెన్సే, ఆడియెన్స్ కి కూడా ఇచ్చి, ఆ ట్విస్ట్ తోనే రివీల్ చేస్తే బాగుండేది. చాలా సీన్లల్లో లాజిక్ లేదు. ఇలాంటి చిన్న చిన్న మైనస్ లు పక్కన పెడితే మూవీ మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ చెప్పొచ్చు.
కృష్ణ పాత్రలో సుహాస్ ఇరగదీశాడు. తండ్రి వ్యాపారం టేకోవర్ చేసుకోవాలనే భ్రమలో ఉండటం, ఆ తర్వాత తెలిసిన తర్వాత ఆయన పడే స్ట్రగుల్స్ నవ్వులు పూయిస్తాయి. ఆయన సీన్లల్లో చాలా సహజంగా చేసి మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. ఇక సినిమాకి మరో హీరో నరేష్. ఇంకా చెప్పాలంటే ఆయనే మెయిన్ హీరో. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ఆయనకున్న ఎలివేషన్ల వేరే లెవల్. వాటిలో అంతే బాగా చేశాడు. మెప్పించాడు. బాలయ్య స్ఫూఫ్ సీన్లలో దుమ్మురేపాడు. ఎమోషనల్ గానూ కట్టిపడేశాడు. ఇక శివానీ నగరం సైతం ఆకట్టుకుంది. ఆమె కామెడీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. సుదర్శన్, వెన్నెల కిశోర్ పాత్రలు సినిమాకి మరో ప్లస్ అయ్యాయి. అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ, బాబుమోహన్, హర్షవర్థన్ అదరగొట్టారు. యాంకర్ స్రవంతి సైతం మెప్పించింది. ఆమెకి బలమైన పాత్ర పడింది. అయితే డైలాగ్ డెలివరీ విషయంలో కొంత కేర్ తీసుకోవాలి. మిగిలిన పాత్రలు ఓకే అని చెప్పొచ్చు.
సినిమాకి మ్యూజిక్ ప్లస్ అయ్యింది. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్‌ఆర్ కూడా బాగుంది. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్ తీసుకోవాల్సింది. మహిరెడ్డి పండుగుల కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. కొన్ని ఫ్రేమ్స్ కనువిందుగా ఉన్నాయి. విప్లవ్ నైషదం ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు చేశారు. అది ప్రతి ఫ్రేములోనూ తెలుస్తుంది. దర్శకుడు గోపీ అచ్చర ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. ప్రొస్ట్రిట్యూషన్ అనే అంశాన్ని చాలా నీట్‌గా, ఫన్నీగా, ఎమోషనల్‌గా డీల్ చేసిన తీరు మాత్రం సూపర్బ్. తండ్రికి సంబంధించిన ఎమోషన్స్, సెంటిమెంట్‌ని కూడా చాలా బాగా చూపించాడు. డైలాగ్‌లు బాగున్నాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. బాగా రాసుకున్నారు, పర్‌ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే కొంత డ్రామా ఎక్కువ అయ్యిందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల కామెడీ అంతగా పండలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ చేశాడు. చిన్నచిన్న మైనస్ లు పక్కన పెడితే డైరెక్టర్ బ్రిలియన్సీ బాగుంది. పెద్ద దర్శకుడు అవుతాడు.
హిలేరియస్‌గా నవ్విస్తూ, భావోద్వేగానికి గురి చేసే `హే బల్వంత్`. మంచి స్ట్రెస్ రిలీఫ్ మూవీ.