GodFather 2022 Telugu Movie Review
రాజకీయాల్లోకి వెళ్లిన వచ్చిన చిరంజీవి రీఎంట్రీలో ఎక్కువ రీమేక్ లనే ఎంచుకుంటున్నాడు. ఆ క్రమంలోనే ఈ సినిమాని చేసారు. అయితే మళయాళ సినిమా చాలా సీరియస్ నోట్ లో సాగుతుంది. మోహన్ లాల్ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. అలాంటి పాత్రను చేయటానికి చిరంజీవి ఎందుకు ఆసక్తి చూపాడు అనేది ఎవరికీ అర్దం కాలేదు. అయితే అంత సీనియర్ నటుడు అంత నమ్మి చేస్తున్నాడంటే అందులో బలమైన విషయం ఏదో ఉంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే గాడ్ ఫాధర్ ఉందా...ఈ చిత్రం కథేంటి..లూసిఫర్ కు ఈ సినిమా కు చేసిన మార్పులు ఏమిటో రివ్యూలో చూద్దాం.
కథాంశం :
జనజాగృతి పార్టీ అధినేత ముఖ్యమంత్రి పికే రామదాస్ అలియాస్ పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) హఠాత్తు మరణం రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తుంది. సీఎం కుర్చీ కోసం కుట్రలు మొదలవుతాయి. పీకేఆర్ అల్లుడు జయదేవ్(సత్యదేవ్)తనే సీఎం కావాలని భావిస్తాడు. అందుకోసం హోం మినిస్టర్ వర్మ(మురళి శర్మ) తో చేతులు కలుపుతాడు. అందుకోసం డ్రగ్ మాఫియాకు కూడా తెర లేపుతాడు. అయితే ఈ కుట్రలకు చెక్ చెప్పటానికి బ్రహ్మ (చిరంజీవి) వస్తాడు. అతని రాక సీఎం కుమార్తె, జయదేవ్ భార్య సత్య ప్రియ(నయనతార)కు ఇష్టం ఉండదు. ఇద్దరి మధ్యా బద్ద వైరం నడుస్తూంటుంది. ఒంటిరిగా పోరాటం చేస్తున్న బ్రహ్మకు మాసూమ్ భాయ్ (సల్మాన్ ఖాన్) చేతులు కలుపుతాడు. ఇద్దరు కలిసి ఆ కుట్రలను ఎలా ఎదుర్కొన్నారు. అసలు ఈ బ్రహ్మకు ..ముఖ్యమంత్రి కుటుంబానికి సంభందం ఏమిటి...సత్య ప్రియతో బ్రహ్మకు ఉన్న వైరం ఏమిటి,జయదేవ్ చివరకు ఏమయ్యాడు, ఇంటర్ పోల్ వెతుకుతున్న ఇంటర్నేషనల్ డాన్ అబ్రహం ఖురేషి కి ఈ కథలో పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది :
దేవుడి కుడి భుజంగా వెలిగిన దేవదూత లూసిఫర్ ని సాతానుగా ముద్రవేసి స్వర్గం నుంచి బహిష్కరిస్తే ఏం జరిగిందనే హిబ్రూ పురాణ గాథని, వర్తమాన పరిస్థితులకి అన్వయించి నిర్మించిన భారీ ప్రయోగాత్మకం 'లూసిఫర్' . మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించగా సంచలన విజయం సాదించిన చిత్రం ఇది. 'లూసిఫర్' తెలుగులో ఇదే టైటిల్ తో 2019 లో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. ఆన్ లైన్లో ఇది అమెజాన్ లో, యూట్యూబ్ లో అందుబాటులో వుండటంతో ఈ సినిమాని గాడ్ ఫాధర్ రీమేక్ అనగానే చాలా మంది చూసారు. వర్తమాన దేశ రాజకీయాలని కేరళ రాష్ట్ర నేపధ్యంలో పరోక్షంగా చిత్రించే ప్రయత్నం చేసిన ఈ రాజకీయ థ్రిల్లర్ కి దేశ విదేశీలు, కేరళీయులు స్పందించి విశేషంగా కలెక్షన్లు కట్టబెట్టారు.ఇది పొలిటికల్ డ్రామా అయినా మిగతా వాటిలాగా పార్టీ ఎన్నికల ప్రచార సాధనంగా గాక, ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించే కుటిల రాజకీయ శక్తుల ప్రక్షాళనగా 'లూసిఫర్' ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయ్యింది. ఈ కాన్సెప్టుకు అందరూ కనెక్ట్ అయ్యారు.
అయితే ఈ చిత్రం తెలుగు కు వచ్చేసరికి చిరంజీవి స్వయంగా మార్పులు చేర్పులు చేసారని చెప్పారు. మళయాళంలో కొంచెం గూడారార్ధాలతో, సంకేతాలతో చెప్పిన కేరళ రాజకీయ కుట్రల కథని తెలుగుకు మార్చేటప్పుడు ఇక్కడ రాజకీయాలను అనువర్తింపచేస్తారమో అనుకున్నారు. కానీ ఆ పని చేయలేదు. అక్కడక్కడా టచ్ అయ్యినట్లుగానే ఉంటుంది. కానీ అది యూనవర్శిల్ గా అనిపిస్తుంది. అలాగే అక్కడ పూర్తి స్దాయి పొలిటికల్ డ్రామా గా చేసిన ఈ సినిమా ఇక్కడ చిరంజీవి హీరోగా వచ్చిన ఓ కమర్షియల్ సినిమాగా మార్చే పక్రియలో చాలా మార్పులే చేపట్టారు. అలా చేయకపోతే ఇక్కడ ప్రేక్షకులు ప్రక్కన పెట్టేస్తారనే విషయం దర్శక,నిర్మాతలకు స్పష్టంగా తెలుసు.
అపారమైన డబ్బుతో ప్రభుత్వాల్ని మార్చెయ్యగల రాజకీయ శక్తికి వ్యతిరేకంగా పోరాడే కథగానే ఇక్కడ ప్రెజెంట్ చేసారు. దేవదూతను ..గాఢ్ ఫాదర్ గా వెనక ఉండి నడిపించే సర్వ శక్తిమంతుడుగా కింగ్ మేకర్ గా చూపెట్టారు. అయితే లూసీఫర్ లో కొన్ని హైలెట్స్ ఇక్కడ నేటివిటికి సెట్ కాలేదనేమో వదిలేసారు. కొత్తవి తీసుకొచ్చి కలిపారు. ఓ రకంగా గుడ్డ తీసుకుని మన సైజ్ కు తగ్గ చొక్కా కుట్టించుకున్నట్లుగా ఈ రీమేక్ ని చేసారు. ఎందుకంటే ఒక్కోసారి రెడీమేడ్ డ్రస్ లలో భుజాలు దిగిపోతాయి...లూజ్ ,టైట్ అవుతూంటాయి. అది జరగకుండా చిరంజీవి కమర్షియల్ ఇమేజ్ కొలతలు తీసుకుని దీన్ని కుట్టినట్లు అర్దమవుతోంది. క్లైమాక్స్, చివరి అరగంట ఇంకాస్త బాగుంటే నెక్ట్స్ లెవిల్ లో ఉండేది.
టెక్నికల్ విషయాలకు వస్తే...
తమన్ మ్యూజిక్ ఎందుకనో అఖండ తర్వాత...పూర్తిగా లౌడ్ గా మారిపోయింది. అయితే అవి కొన్ని సీన్స్ ఎలివేట్ చేసిందనటంలో సందేహం లేదు. అలాగే పాటలు కూడా జస్ట్ ఓకే అనిపిస్తాయి. మెగాస్టార్ మ్యూజికల్ హిట్స్ కు తగ్గట్లు ఇ్వలేకపోయారు. ఇక టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది సినిమా. ముఖ్యంగా నీరవ్ షా కెమెరా వర్క్ చాలా నీట్ గా ...క్లాస్ విజువల్స్ తో మాస్ ఇంపాక్ట్ ఇస్తూ సాగింది. ఎడిటింగ్ వర్క్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యి పరుగెట్టింది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఇబ్బంది పెడతాయి. పాత్రకు తగ్గ డైలాగులు, అక్కడక్కడా మాస్ కు నచ్చే పదాలతో లక్ష్మీ భూపాల్ ఇచ్చారు.
నటీనటుల సంగతికి వస్తే... చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పాత్రకు కొట్టిన పిండి. ఇక సత్యదేవ్...క్రూడ్ పొలిటీషయనన్ గా కనిపించాడు. తనకు ఫెరఫెక్ట్ యాప్ట్ అయ్యాడు. వాయిస్ కూడా నిండుతనం తెచ్చింది. హీరో గా ఇలాంటి పాత్రల్లోనే బాగుంటాడు. నయనతార కొత్తగా ఏమీ అనిపించలేదు. సముద్ర ఖనీ మామూలే.
నచ్చినవి :
చిరంజీవి వయస్సుకు తగ్గట్లుగా హుందాగా పాత్రను నడిపించిన తీరు
ఫస్టాఫ్
కంగాలి చేయని స్క్రీన్ ప్లే
నచ్చనవి :
సల్మాన్ ఖాన్ ని రెండు సార్లు ఇంట్రడ్యూస్ చెయ్యాలనుకోవటం
చివరి అరగంట
లౌడ్ గా అనిపించే బిజీఎం
ఫైనల్ థాట్ :
లూసీఫర్ కు ఈ సినిమా రీమేక్ కావచ్చు ...కానీ ఆ సినిమా నడిచిన తీరు వేరు. ఈసినిమాని నడిపించిన పద్దతి ..దేని విలువ దానిదే.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75
నటీనటులు : చిరంజీవి, నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సముద్రఖని, అనసూయ, 'బిగ్ బాస్' దివి, బ్రహ్మాజీ తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల్
ఛాయాగ్రహణం : నీరవ్ షా
సంగీతం: ఎస్. తమన్
సమర్పణ : శ్రీమతి సురేఖ కొణిదెల
నిర్మాతలు : ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహన్ రాజా
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2022