
యువ నటుడు శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన తెలుగు చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. మంగా శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డాక్టర్ చింతాడ హేమారావు నిర్మించారు. ఇందులో ఇంద్రజ, సుమన్, బ్రహ్మాజీ, ఎల్‌బీ శ్రీరామ్ కీలక పాత్రలు పోషించారు. ప్రేమ, భావోద్వేగాలు, కామెడీ, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు శుక్రవారం (అక్టోబర్ 9, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేమకథగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
రావణ్(శ్రవణ్) చిన్నప్పట్నుంచి తనని ఎవరైనా సహాయం కోరితే తన వద్ద ఏముంటే అది ఇచ్చేస్తాడు. అది వాళ్ల తాత నేర్పించారు. అదే ఆచరిస్తుంటాడు. కానీ పెద్దయ్యాక ఫుల్ కమర్షియల్. డబ్బుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటాడు. చిన్నప్పట్నుంచి జాబిలి లాంటి అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటాడు. ఊహించినట్టుగా ఓ రోజు జాబిలి కనిపిస్తుంది. జూలీ(మలైకా టి వాసుపల్)ని చూసి ఆమెనే తన జాబిలీగా ఫిక్స్ అవుతాడు. తన జీవితం తీసేసుకో అని ఆఫర్ ఇస్తాడు. ఆమె ఒక డాక్టర్. ఆమెని పడేసేందుకు రోజూ ప్రయత్నిస్తుంటాడు రావణ్. ఓ రోజు సవాల్ విసురుతుంది. అందులో సక్సెస్ అవుతాడు. అయినా పట్టించుకోదు. మొత్తానికి తనకు పడిపోతుంది. అయితే అంతలోనే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. తనని చూడకుండా 24 గంటలు ఉండాలని చెబుతుంది. కానీ ఆ తర్వాత తను కనిపించదు. దాగుడు మూతలు ఆడుతుంది. బాగా తిప్సిస్తుంది. చివరికి ఆమెకి పెళ్లి అయ్యిందని తెలుస్తుంది. మరి జూలీ అలా ఎందుకు చేసిందా? ఆమె నిజంగానే రావణ్‌ని ప్రేమించిందా? ఆయన్ని ఎందుకు అలా టెస్ట్ చేసిందా? చివరికి వీరి ప్రేమ సుఖాంతమా? విషాదాంతమా? అనేది మిగిలిన సినిమా.
ప్రేమకథలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమలోని నిజాయితీ, త్యాగం, భావోద్వేగాలను తెరపై సహజంగా చూపించగలిగితే ఆ కథ ప్రేక్షకుల హృదయాలకు చేరువవుతుంది. ‘చకోర’లోనూ అలాంటి స్వచ్ఛమైన ప్రేమ భావనను ప్రధానంగా తీసుకున్నారు. దీనికి కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అంశాలను జోడించారు. అయితే ప్రేమకథలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే కథనం సహజంగా సాగడం, పాత్రల మధ్య అనుబంధం బలంగా కనిపించడం అవసరం. ప్రేమికుల మధ్య సంఘర్షణలు, వారి నిర్ణయాల వెనుక కారణాలు కథలో కీలకంగా నిలుస్తాయి. దర్శకుడు ఈ అంశాలను ఎంత బాగా తెరపై ఆవిష్కరిస్తే, సినిమా అంత బాగా ఉంటుంది. ఆ విషయంలో ఈ చిత్ర దర్శకుడు కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యారనిపిస్తుంది.
అయితే కథ పరంగా ఇదేమీ కొత్త కాదు. రొటీన్ లవ్ స్టోరీ. కానీ దాన్ని తీసుకెళ్లిన తీరు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తుంది. ప్రారంభంలో సినిమా కొంత రొటీన్‌గా ఉంటుంది. హీరో హెల్ప్ చేయడం, ఇతరులు ఏదైనా సహాయం అడిగితే వారికి ఉన్నదంతా ఇచ్చేయడమనే పాయింట్ చాలా ఓల్డ్ ది. కానీ హీరో పెద్దయ్యాక పూర్తి భిన్నంగా కమర్షియల్ గా మారడం ఆసక్తికరంగా ఉంటుంది.
ఇక తన జాబిలి కోసం కోసం తపించడం, ఆమె కోసం ఆరాటపడటం, ఆమె వెంటపడటం ప్రారంభంలో కొంత విసిగించేలా ఉన్నా, ఆ తర్వాత లవ్‌లోని ఫీల్, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. హీరో ప్రేమని టెస్ట్ చేసే సీన్లు బాగున్నాయి. ఆయనకు ఆమె కూడా పడిపోయే సీన్లు మెప్పిస్తాయి. ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరోని టెస్ట్ చేయడం చుట్టూ సాగుతుంది. కొంత వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ బాగుంది. ఇలా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. క్లైమాక్స్ యాక్షన్‌తో, సందేశం, ట్విస్ట్, విషాదంతో ముగుస్తుంది. అయితే ప్రేమకి సంబంధించిన ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది.
హీరో శ్రవణ్‌కు ఈ సినిమా కథానాయకుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కింది. ప్రేమికుడిగా భావోద్వేగాలను పలికించడంతో పాటు, కథ డిమాండ్ చేసే యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. మలైకా టి. వాసుపల్ కథానాయికగా నటించారు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ప్రేమకథకు కీలకంగా నిలుస్తుంది. అమ్మాయి కూడా ఆకట్టుకుంది. వీరితోపాటు అనుష్క లుహార్, యామిని, ఎల్.బి. శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్ తదితరులు ఇందులో ఇతర పాత్రల్లో నటించారు. సీనియర్ నటీనటుల అనుభవం కుటుంబ భావోద్వేగాలకు బలాన్ని చేకూర్చింది. మిగిలిన వారు ఓకే అనిపించారు.
ఈ సినిమాకు మంగా శ్రీనివాస్ కథ, దర్శకత్వం అందించారు. గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రేమకథకు మాస్ అంశాలను జోడించి ప్రేక్షకులకు చేరువ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ప్రేమకి సంబంధించి ఇచ్చిన సందేశం బాగుంది. రూపా గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ, ప్రిన్స్ హెన్రీ సంగీతం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ చిత్రానికి పనిచేసిన ప్రధాన సాంకేతిక విభాగాలు. విజువల్‌గా మూవీ రిచ్‌గా ఉంది. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ పాటలు రాశారు, పాటలు బాగున్నాయి. ప్రేమకథలో పాటలు, నేపథ్య సంగీతం భావోద్వేగాలను ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ప్రేమికుల మధ్య అనుబంధాన్ని అందంగా చూపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎడిటింగ్ పరంగా మరింత కేరింగ్ అవసరం.
మొత్తంగా ‘చకోర’ స్వచ్ఛమైన ప్రేమకథకు కామెడీ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలను జోడించి రూపొందించిన చిత్రం. అయితే కొంత రొటీన్ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. కానీ ప్రేమలోని సందేశం బాగుంది.
రేటింగ్ 2.5