BholaShankar Movie Review: `భోళాశంకర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Aug 11, 2023, 12:48 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన `భోళాశంక్‌` ఈ శుక్రవారం విడుదలైంది. ఫ్యామిలీ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్ ని మెప్పించిందా? తమన్నా గ్లామర్‌, కీర్తిసురేష్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యాయా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

`వాల్తేర్‌ వీరయ్య`తో ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. మళ్లీ హిట్‌ ట్రాక్‌లో పడ్డారు. మెగాస్టార్‌ రేంజ్‌ ఏంటో చూపించారు. ఆ మ్యాజిక్‌ని రిపీట్‌ చేసేందుకు ఇప్పుడు `భోళాశంకర్‌` చిత్రంతో వచ్చారు. మెహెర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో వచ్చిన `వేదాళం`కి రీమేక్‌. తమన్నా కథానాయికగా నటించింది. కీర్తిసురేష్‌ చిరుకి చెల్లిగా చేసింది. సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించాడు. బ్రహ్మానందం, జబర్దస్త్ టీమ్‌, శ్రీముఖి, రష్మి, హైపర్‌ ఆది, సత్య, వెన్నెల కిశోర్‌ వంటి వారు నటించిన `భోళాశంకర్‌` స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు శుక్రవారం(ఆగస్ట్ 11)ని విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? చిరు హిట్‌ మ్యాజిక్‌ రిపీట్‌ చేశాడా? రీమేక్‌తో హిట్‌ కొట్టాడా? విమర్శకుల నోళ్లు మూయిస్తాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః

శంకర్‌(చిరంజీవి), మహా(కీర్తిసురేష్‌) హైదరాబాద్‌ నుంచి కోల్‌కత్తా వస్తారు. మహా మంచి ఆర్టిస్ట్(డ్రాయింగ్‌). కోల్‌కత్తాలో ఆర్ట్ కాలేజ్‌లో చేరుతుంది. శంకర్‌.. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అప్పటికే కోల్‌కత్తాలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్‌లు(ఉమెన్‌ ట్రాఫికింగ్‌) జరుగుతుంటాయి. వందల మంది అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి విదేశాలకు అమ్మేస్తుంటారు బిగ్‌ బ్రదర్‌ అలెక్స్(తరుణ్‌ అరోరా) టీమ్‌. ఇది పోలీసులకు ముంచెమటలు పట్టిస్తుంది. దీంతో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ క్రమంలో సిటీలోని ట్యాక్సీ డ్రైవర్లతో పోలీసులు మీటింగ్‌ అరెంజ్‌ చేసి కిడ్నాప్‌ గ్యాంగ్‌ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తారు. అందుకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తారు. అంతలోనే శంకర్‌.. ఆ కిడ్నాప్‌ గ్యాంగ్‌లోని కొందరిని చూసి పోలీసులకు సమాచారం అందిస్తాడు. పోలీసులు ఎటాక్‌ చేసి వాళ్లని చంపేస్తారు. దీంతో పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించిన శంకర్‌ని గుర్తించి అతన్ని చంపేందుకు అలెక్స్ టీమ్‌ ప్రయత్నిస్తుంది. కానీ వాళ్లని ఎదుర్కొంటాడు శంకర్‌. అలెక్స్ తమ్ముడిని చంపేస్తాడు. ఇది తెలిసి అలెక్స్ మరో తమ్ముడు రంగంలోకి దిగుతాడు. అతన్ని కూడా శంకర్‌ చంపేస్తాడు. దాన్ని లాయర్‌ (తమన్నా) చూస్తుంది. దీంతో అసలు విషయం రివీల్‌ చేస్తాడు శంకర్‌. మరి ఇంతకి శంకర్‌ ఎవరు? మహా కథేంటి? హైదరాబాద్‌లో చిన్న రౌడీ అయిన శంకర్‌కి, కోల్‌కత్తా అమ్మాయిల ట్రాఫికింగ్‌ కి సంబంధం ఏంటి? అసలు కోల్‌కత్తాకి ఎందుకు వచ్చారు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః

`భోళాశంకర్‌`.. తమిళంలో విజయం సాధించిన `వేదాళం` సినిమాకి రీమేక్‌ అనేది తెలిసిందే. దర్శకుడు మెహెర్‌ రమేష్‌ గతంలో చేసిన సినిమాలు `శక్తి`, `షాడో` ఎంతటి డిజాస్టర్లుగా నిలిచాయో తెలిసిందే, `బిల్లా` కాస్త ఫర్వాలేదు. కానీ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా నిరూపించుకోలేకపోయాడు. పైగా చాలా గ్యాప్‌ తర్వాత ఆయన ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారు. ఇక మాతృకతో పోల్చితే `భోళాశంకర్‌`లో చాలా మార్పులు చేశామని అన్నారు. కానీ యధాతథంగా తీసినట్టుగానే ఉంది. లొకేషన్‌ మారింది కానీ కథ మారలేదు. మెగాస్టార్‌ తాలూకు మాస్‌ ఎలిమెంట్లు, ఇప్పుడు ట్రెండ్‌ అయిన యాక్షన్‌ ఎపిసోడ్లు, దీనికితోడు ఓల్డ్ సిస్టర్‌ సెంటిమెంట్‌ని మేళవించి మాస్‌, కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మార్చాడు దర్శకుడు మెహెర్‌‌. ఇంకా చెప్పాలంటే రొటీన్‌ కమర్షియల్ సినిమాగా మార్చేశాడు. కథగా చూస్తే ఇది చాలా ఓల్డ్ స్టోరీ. ఓ ఇరవైఏళ్ల క్రితమే ఇలాంటి స్టోరీస్‌ చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే సంక్రాంతికి వచ్చిన `వాల్తేర్‌ వీరయ్య` కూడా ఇదే ఫార్మాట్‌. రివేంజ్‌ కోసం, పెద్ద చేప పట్టుకునేందుకు వెళ్లడమే ఈసినిమా కథ. అందుకు కొంత సిస్టర్‌ సెంటిమెంట్‌ యాడ్‌ చేశాడు తప్పిదే అంతకు మించి లేదు. 
 

మొదటి భాగం సినిమా మొత్తం చాలా సాధాసీదాగా చిరంజీవి మార్క్ రెగ్యూలర్ కామెడీ, వెన్నెల కిశోర్‌తో రొటీన్‌ కామెడీతో సాగుతుంది. అలాగే లాయర్‌గా చేసిన తమన్నాకి, చిరుకి మధ్య సన్నివేశాలు, వీరితోపాటు తమన్నా అసిస్టెంట్లు హైపర్‌ ఆది, సత్యల మధ్యవచ్చే సీన్ల ద్వారా కామెడీ పుట్టించే ప్రయత్నం చేశారు, కానీ అవి పెద్దగా వర్కౌట్‌ కాలేదు. అలాగే యాక్షన్‌ సీన్లు కూడా రెగ్యూలర్‌గానే ఉంటాయి. `వాల్తేర్‌ వీరయ్య` మార్క్ భారీ యాక్షన్‌ సీన్లు పెట్టారు, కానీ అవి కిక్‌ ఇవ్వలేకపోయాయి. ఇంటర్వెల్‌ వరకు అలా రొటీన్‌గా సాగిపోతుంది. ఎక్కడా ఆడియెన్స్ కి హై మూవ్‌మెంట్స్ కనిపించవు. కానీ సాంగ్‌ల్లో విజువల్స్ అదిరిపోయాయి. చాలా గ్రాండియర్‌గా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో తన ఫ్లాష్‌ బ్యాక్‌ రివీల్‌ అవుతుంది. హైదరాబాద్‌లో భోళాశంకర్‌గా ఆయన చేసే చిన్న చిన్న రౌడీయిజం తాలుకూ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. మొదటి భాగంతో పోల్చితే సెకండాఫ్‌ కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. కీర్తిసురేష్‌ ఇంటి వద్ద భోళా టీమ్‌ చేసే కామెడీ నవ్వులు పూయించేలా ఉంటుంది. అదే సమయంలో `అందరివాడు` సీన్లని తలపిస్తుంటాయి. 

ఇక్కడ శ్రీముఖి, చిరంజీవి మధ్య వచ్చే `ఖుషి` సీన్లు బాగున్నాయి. నవ్వులు పూయించేలా ఉన్నాయి. మరోవైపు చిరంజీవి మేనరిజం వింటేజ్‌ మెగాస్టార్‌ని గుర్తు చేస్తాయి. ఇక్కడ యాక్షన్‌ సీన్లు కూడా మొదటి భాగంతో పోల్చితే బెటర్‌గా ఉంటాయి. కాస్త ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. కానీ ఎలివేషన్లు వర్కౌట్‌ కాలేదు. సినిమాలో అక్కడక్కడ ట్విస్ట్ లు ఉన్నా అవి అంతగా పేలలేదు. కిక్‌ ఇచ్చేలా లేవు. చాలా సీన్ల లాజిక్కులు వదిలేశారు. మరోవైపు సినిమాలో ఎక్కడ ఫీల్‌ లేదు. సీన్‌ బై సీన్లు పడటం తప్పితే కథని నడిపించే త్రెడ్‌  మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. మొదటి భాగంలో ప్రధానంగా అదే మైనస్‌. భారీ యాక్షన్‌ సీన్లు ఉన్నా అవి గూస్‌బంబ్స్ తెప్పించేలా లేవు. పాటలున్నా, ఎగిరి డాన్సులు చేసేలా లేవు. కానీ వాటి కోసం భారీగా ఖర్చు చేయడం విడ్డూరంగా అనిపించింది. నెక్ట్స్ ఏం జరగబోతుందనేది ఆడియెన్స్ కి అర్థమయ్యేలా సాగడం పెద్ద మైనస్‌. సినిమా నెక్ట్స్ సీన్‌ ఏంటనేది క్యూరిసిటీని కలిగించేలా స్క్రీన్‌ప్లేని నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. మొత్తంగా సినిమాలో కొన్ని కామెడీ సీన్లు, కొన్ని యాక్షన్‌ ఎలిమెంట్లు, కొంత సిస్టర్‌ సెంటిమెంట్ తప్ప మరేది ఆకట్టుకునేలా లేదు.  అసలు ఈ సినిమాలో ఏం చూసి చిరంజీవి ఒప్పుకున్నారనేది పెద్ద మిస్టరీ. చిరంజీవిని ఎలా ఒప్పించారనేది మరో మిస్టరీ. దీంతో ఇదొక ఔట్‌ డేటెడ్‌ కమర్షియల్‌ సినిమాగా మారింది. 
 

నటీనటులుః
భోళా పాత్రలో చిరంజీవి విశ్వరూపం చూపించారు. కామెడీ పరంగా, యాక్టింగ్‌ పరంగా, డాన్సులు, ఫైట్లు ఇలా అన్నింటిలోనూ ది బెస్ట్ ఇచ్చాడు. అదే ఎనర్జీ, ఎదే జోష్‌తో చేశాడు. రఫ్ఫాడించాడు. కొంత వరకు నవ్వులూ పూయించే ప్రయత్నం చేశాడు. కానీ సినిమాకి ఆయనొక్కడు ఉంటే సరిపోదు, అన్నీ సెట్‌ కావాలి. ఇందులో మిగిలినవన్నీ మైనస్‌గా మారిపోయాయి. ఇక పవన్‌ మేనరిజం చిరుకి సెట్‌ కాలేదు. మహా పాత్రలో కీర్తిసురేష్‌ బాగా చేసింది. సెంటిమెంట్‌ పండించింది. తమన్నా పాత్ర, సుశాంత్‌ పాత్రని బలవంతంగా ఇరికించినట్టుగానే ఉంది. ఆయా పాత్రలకు స్కోప్‌ లేదు. శ్రీముఖి ఉన్నంత సేపు రచ్చ చేసింది. `ఖుషి` ఎపిసోడ్‌లో అదరగొట్టింది. ఇక ఇందులో యాంకర్‌ రష్మి కూడా మెరవడం సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్లు. జబర్దస్త్ బ్యాచ్‌ హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను, నరేష్‌, సత్య కొన్ని సీన్లలో నవ్వించే ప్రయత్నం చేశారు. వీరితోపాటు వెన్నెల కిశోర్‌ పాత్ర ఓకే, బ్రహ్మానందం, ఉత్తేజ్‌ పాత్రలకి స్కోప్‌ లేదు. యానీ మాస్టర్‌ ఉన్నంత సేపు ఆకట్టుకుంది. బ్రహ్మాజీ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో మెరిశాడు.
 

టెక్నీకల్‌గాః 
సినిమాకి టెక్నీకల్‌గా హైలైట్‌ ఏదైనా ఉందంటే అది డడ్లీ కెమెరా వర్క్. విజువల్‌గా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. మహతి సాగర్‌ అందించిన పాటలు అంతంతగానే ఉన్నాయి, బీజీఎం కూడా యావరేజ్‌గానే ఉంది. అయితే సినిమా మొత్తం ఒకే సౌండింగ్‌ రొటీన్‌ అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లని అది ఎలివేట్‌ చేయలేకపోయింది. ఎడిటింగ్‌ పరంగా కొన్ని అవనసరమైన సీన్లు లేపేయొచ్చు. నిర్మాతలు రిచ్‌గా చేశారు. రాజీపడలేదు. కానీ పెద్ద  మైనస్‌ కథ, డైరెక్షన్‌. ఈ విషయంలో దర్శకుడు మెహెర్‌ రమేష్‌ ఏమాత్రం కొత్త దనం చూపించలేకపోయాడు. ఆడియెన్స్ ని రక్తికట్టించేలా తెరకెక్కించలేకపోయాడు. సినిమాలో ఎమోషన్స్ అస్సలే పండలేదు. ఒక్కో సీన్‌ వచ్చిపోతుంటాయి తప్ప ఆడియెన్స్ ఎక్కడా వాటిని ఫీల్‌ కాలేదు. అన్నీ ఆర్టిఫీషియల్‌గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత వచ్చిన గొప్ప అవకాశాన్ని మెహెర్‌ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. 
 

ఫైనల్‌గాః `భోళశంకర్‌` రొటీన్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ మూవీ. చాలా ఔట్‌ డేటెడ్‌ స్టోరీ. చిరంజీవికి ఏం నచ్చిందో ఏమో?

రేటింగ్‌ః 2

నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రఘు బాబు, మురళీ శర్మ, 'వెన్నెల' కిశోర్, తులసి, బ్రహ్మాజీ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా తదితరులు
కథా పర్యవేక్షణ : సత్యానంద్
మాటలు : మామిడాల తిరుపతి
ఛాయాగ్రహణం : డడ్లీ 
సంగీతం : మహతి స్వరసాగర్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
కథనం, మాటలు, కథా విస్తరణ, దర్శకత్వం : మెహర్ రమేష్
 

click me!