
మలయాళ చిత్రాలు తెలుగు ఆడియెన్స్ ని కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. `ప్రేమమ్`, `మంజుమేల్ బాయ్స్` వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. మంజుమేల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం రూపొందిన లేటెస్ట్ మూవీ `బాలన్‌ః ది బాయ్`. ఇందులో ఆదిశేషన్(బాలనటుడు), ఫర్జానా ఫలథింగల్, మహ్మాద్ జినాన్, జీన్ పాల్ లాల్, టోవినో థామస్(గెస్ట్ రోల్) ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ కే నారాయణ, శైలజ దేశాయ్ నిర్మించారు. ఈ మూవీ తెలుగులో అదే పేరుతో శుక్రవారం(జూన్ 19)న విడుదలైంది. మరి సినిమా ఎలా? తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఇందు (ఫర్జానా)గర్భవతిగా ఉన్న సమయంలో ఓ హత్య కేసులో జైలుకు వెళుతుంది. శిక్ష పూర్తయ్యాక తన కుమారుడు వసుదేవన్ (ఆదిశేషన్)తో కలిసి జైలు నుంచి విడుదలవుతుంది. తమ గతం గురించి ఎవరికీ తెలియని ప్రాంతానికి వెళ్లి, కొడుకుతో ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం షెర్లీ, వందన, మేరీ వంటి మారుపేర్లతో పలు చోట్ల ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఎవరితోనూ బంధాలు, అనుబంధాలు ఏర్పరచుకోకుండా ఉండాలని భావిస్తుంది. చివరికి అటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గ్రామంలో వృద్ధురాలికి కేర్‌టేకర్‌గా పని చేయడానికి చేరుతుంది. ఇందు ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకున్న ఆ వృద్ధురాలు, ఆమెతో పాటు వసుదేవన్ కూడా అక్కడే ఉండాలని కోరుతుంది. ఇందు తన కుమారుడిని సమీపంలోని పాఠశాలలో చేర్పిస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఇందు మరో హత్యకు పాల్పడాల్సి వస్తుంది. ఆ సంఘటన కారణంగా వసుదేవన్ తన తల్లికి దూరమవుతాడు. ఆ తర్వాత ఏమైంది? తల్లికి దూరమైన వసుదేవన్ ఎలా క్రిమినల్ అబ్బాస్ (టోవినో థామస్) వద్దకు చేరాడు? వసుదేవన్ కారణంగా పోలీస్ అధికారి పవిత్రన్ తన ప్రియురాలికి ఎలా దూరమయ్యాడు? అలాగే వసుదేవన్ ఎప్పటికీ తన తల్లిని కలవకుండా ఉండేందుకు పవిత్రన్ ఎలాంటి కుట్రలు పన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ‘బాలన్ ది బాయ్’ మిగిలిన కథ.
భర్తలేని మహిళలను సమాజం చులకనగా చూస్తుంది. మగాళ్ల చూపు మొత్తం వారిపైనే ఉంటుంది. ఇలాంటి ఎన్నో చూపులను దాటుకొని నిలబడటం, సర్వైవ్ కావడం పెద్ద సవాల్‌తో కూడిన అంశం. అందుకోసం ఒక మహిళ చేసిన పోరాటం, తన కొడుకు కోసం, తన కోసం ఆమె పడ్డ స్ట్రగుల్, తిరుగుబాటు ఆమె లైఫ్‌ని ఎలా మార్చిందనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇంటెన్స్, థ్రిల్లర్‌గా సాగుతుంది. తల్లీకొడుకుల అనుబంధాన్ని, వారి బాండింగ్‌ని ఆవిష్కరిస్తూ మూవీ సాగుతుంది. సినిమా కాస్త స్లోగా వెళ్తుంది. ఎమోషన్స్ ని, ఆయా సీన్ల డెప్త్ ని, వారి రిలేషన్‌ని ఆవిష్కరించడానికి దర్శకుడు ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అదే సమయంలో ప్రతిదీ డీటెయిలింగ్‌గా రూపొందించే ప్రయత్నం చేశాడు. జైలు నుంచి బయటకు వచ్చాక, పనిదొరక్క ఆమె పడే ఇబ్బందులు, పేర్లు మార్చుకొని, తన ఐడెంటినీ మార్చుకొని, భర్త ఉన్నాడని నమ్మిస్తూ ఆమె చేసే ప్రయత్నం కదిలిస్తుంది. కొడుక్కి కూడా కథలు చెబుతూ మానసికంగా అతన్ని ప్రిపేర్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేస్తూ, చివరికి ఓ విలేజ్‌కి దూరంగా ఉన్న ఒక ఇంట్లో బామ్మని చూసుకునే కేర్ టేకర్‌గా వెళ్లిన తర్వాత ఆమె అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ తాను సెటిల్ అవుతుందనే లోపే ముసలావిడ మరణించడం, ఆ తర్వాత జైల్లో ఉన్న మహిళ తనని వెంటాడటం, ఆమెని చంపేయడం, ఆ తర్వాత ఇంటి యాజమాని ఉన్నట్టుండి రావడం వంటి సంఘటనలు ఇందుని గందరగోళానికి గురి చేస్తాయి. దీంతో తప్పుమీద తప్పు చేస్తుంది. ఇది ఆమె లైఫ్ మొత్తాన్ని తలక్రిందులు చేస్తుంది. తల్లీ కొడుకులను విడగొడుతుంది. ఆయా సన్నివేశాలు ఎంగేజింగ్‌గా ఉంటాయి. థ్రిల్లింగ్‌గా ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ లవర్ విడిపోవడానికి చిన్న పిల్లాడు కారణం కావడంతో అది మనసులో పెట్టుకొని వాళ్ల అమ్మని ఇబ్బంది పెట్టడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఎంతసేపు అక్కడే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. చాలా డ్రైగా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. అందులో వచ్చే ట్విస్ట్ హైలైట్ గా నిలుస్తుంది. స్టార్ హీరో ఎంట్రీ వాహ్ ఫీలింగ్ తెప్పిస్తుంది. దీంతో సినిమా స్టయిలే మారిపోతుంది. అంతకు ముందు జరిగిందంతా మర్చిపోయేలా చేస్తుంది. ఇదే ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. సినిమా ఆద్యంతం ఎమోషనల్‌గా, థ్రిల్లర్‌గా రన్ అవుతూ ఎంగేజ్ చేస్తుందని చెప్పొచ్చు. స్లోగా సాగడం పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు.
ఇందుగా ఫర్జానా పలథింగల్ నటన అదిరిపోయింది. సినిమాకి ఆమెనే హీరో. తన పాత్రలో జీవించింది. ఎమోషనల్ సీన్లు, ఇంటెన్స్ సీన్లు, భయపడే సీన్లు ఇలా అన్నింటిలోనూ అదరగొట్టింది. సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచింది. కొడుకు పాత్రలో ఆదిశేషన్ బాగా చేశాడు. చిన్నప్పుడు ఇన్నోసెంట్‌గా, క్యూట్‌గా కనిపించి, అద్బుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నారు. పెద్దగా అయ్యాక జీనన్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. పోలీస్ కాన్సిస్టేబుల్‌గా జీన్ పాల్ లాల్ నటన మరో హైలైట్. ఇలా ప్రతి ఒక్కరు సినిమాలో ఒదిగిపోయి కనిపించారు. టొవినో థామస్ ఎంట్రీ సర్‌ప్రైజ్ చేస్తుంది.
కాన్సెప్ట్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో కమర్షియాలిటీ తగ్గిపోయింది. ఆర్ట్ ఫిల్మ్ ఛాయలు కనిపిస్తాయి. దర్శకుడు మాత్రం తాను అనుకున్న కథను నిజాయితీగా స్క్రీన్‌పై చూపించాడు. తల్లీకొడుకుల బాండింగ్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఎమోషనల్, థ్రిల్లర్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ మూవీ స్లోగా ఉంటుంది. కొంత బోరింగ్‌గా ఉంటుంది. సైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ, సుషీన్ శ్యామ్ బీజీఎమ్ బాలన్‌కు ప్రాణం పోశాయి. కాన్సెప్ట్ పరంగా విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా సత్తా చాటడం కష్టమే.
తల్లీకొడుకుల బాండింగ్‌ని ఎమోషనల్‌గా ఆవిష్కరించిన మూవీ `బాలన్ ది బాయ్`. హృదయాన్ని కదిలించే చిత్రమవుతుంది.
రేటింగ్: 3.25