విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన `దొరసాని`, `మిడిల్ క్లాస్ మెలోడీస్`, `హైవే`, `పుష్పక విమానం` వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. కానీ కమర్షియల్‌గా పెద్ద హిట్ దక్కలేదు. థియేట్రికల్ గా బ్రేక్ రాలేదు. దీంతో గట్టి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన `బేబీ` సినిమాతో రాబోతున్నారు. ట్రాయాంగిల్ లవ్ స్టోరీ చిత్రమిది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా, విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు(జులై 14న)న విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైష్ణవి(వైష్ణవి చైతన్య) స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు. ఆనంద్ అంటే వైష్ణవికి చంచేంత ప్రేమ. ఆనంద్ కూడా ఆమెని అంతకు మించి ప్రేమిస్తాడు. ఆనంద్‌కి చదువు రాదు, టెంన్త్ ఫెయిల్. పైగా తండ్రి లేడు, అమ్మ మూగది. చదివించే స్తోమత లేదు. దీంతో చదువు ఆపేసి ఆటో నడిపిస్తుంటాడు. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసుకుని బి.టెక్‌లో జాయిన్ అవుతుంది. దీంతో రోజూ కాలేజీకి దూరం వెళ్లాల్సి వస్తుంది. తమ మధ్య దూరం పెరుగుతుందని భావించిన ఆనంద్.. తన ఆటో తాకట్టు పెట్టి రెండు స్మార్ట్ ఫోన్లు కొంటాడు. ఆమెతో రోజూ ఫోన్‌లో మాట్లాడుకోవచ్చని. అయితే కాలేజీలో వైష్ణవి పట్ల చిన్నచూపు. అందంగా లేదని, బస్తీల అమ్మాయిలా కనిపిస్తుందని హేళన చేస్తుంటారు. ఈ క్రమంలో విరాజ్ ఆమెని కాలేజీలో ఇష్టపడతాడు. వైష్ణవి ఫ్రెండ్స్ ఆమెని అందంగా తయారు చేస్తారు. పబ్‌లు, తాగుడు అలవాటు చేస్తారు. విరాజ్ ఆమెని ప్రేమిస్తాడు,తనని ప్రేమించమని బలవంతం చేస్తుంటాడు. మరి అటు ఆనంద్ ఆమెని అంతే ప్రేమిస్తుంటాడు. వైష్ణవి ఆనంద్‌ని మర్చిపోలేదు, మరోవైపు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ లు ఇస్తూ తనని తానుగా ప్రేమిస్తున్న విరాజ్‌ని దూరం చేసుకోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైష్ణవిలో వచ్చిన మార్పేంటి? మరి ఆనంద్‌ని వదులుకుందా? విరాజ్‌ని దూరం చేసుకుందా? లేదా ఇద్దరిని ప్రేమించిందా? అసలు ఏం జరిగింది? వైష్ణవి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`బేబీ` ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నేటి యూత్‌ని రిఫ్లెక్ట్ చేసేలా, ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్. కలర్‌ఫుల్ ప్రపంచం, ఫాస్ట్ కల్చర్ యువతలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఎలాంటి వారినైనా ఎలా మార్చేస్తుంది? అమాయకులను సైతం ఎంతగా కన్నింగ్‌గా మార్చేస్తుంది అనే అంశాలకు ఈ సినిమా అద్దం పడుతుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. దాన్ని ఫిల్ గుడ్ ఎమోషనల్ జర్నీగానూ మార్చారు. `బేబీ` అనే టైటిల్ సినిమాకి యాప్ట్. ఎందుకంటే ఈ సినిమాకి హీరో బేబీ(వైష్ణవి)నే. ఆమె సినిమాని నడిపిస్తుంది. ఆమె కేంద్రంగానే రెండు ప్రేమలు సాగుతాయి. అయితే ట్రాయాంగిల్ లవ్ స్టోరీస్ కొత్త కాదు. కానీ సినిమాని నడిపించిన తీరు మాత్రం కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి ప్రధాన బలం. యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈలలు వేసే సీన్లకి కొదవలేదు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల లవ్ స్టోరీ స్వచ్ఛంగా సాగుతూ చిన్నప్పటి ప్రేమ కథలను గుర్తు చేస్తుంది. అదే సమయంలో వారి ప్రేమలోని స్వచ్ఛత అంతే బాగా ఆకట్టుకుంటుంది. మనుసుని హత్తుకుంటుంది. ఈ ఇద్దరి మధ్య కన్వర్జేషన్, డైలాగులు నవ్వులు తెప్పిస్తుంటాయి. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్‌ని, త్రివిక్రమ్‌ని తీసుకొచ్చి వారి డైలాగ్‌లు చెప్పించడం ఆకట్టుకుంటుంది. ఇక ఇంటర్వెల్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అటు ఆనంద్‌కి, ఇటు విరాజ్‌కి మధ్య వైష్ణవి తీసుకున్న బోల్డ్ డెసీషన్ వాహ్ అనేలా చేస్తుంది. యూత్‌కి మాత్రం పిచ్చెక్కిస్తుంది. ఆ తర్వాత వైష్ణవి జర్నీ సాగే తీరు క్రేజీగా అనిపిస్తుంది. రెండు ప్రేమ కథలను ఆమె మెయింటేన్ చేస్తున్న తీరు మరింత క్రేజీగా అనిపిస్తుంది. ఇవి సినిమాలో హైలైట్ పాయింట్స్ గా చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ కూడా కొత్తగా ఉంటుంది. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అదే సమయంలో వైష్ణవి సంఘర్షణ ప్రధానంగా సాగుతుంది. ఆమె కారణంగా ఆనంద్, విరాజ్ ఎలా ఇబ్బంది పడ్డారు, వారిద్దరి మధ్య తను ఎలా నలిగిపోయిందనే అంశాలను ఆద్యంతం ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాయి.
అయితే దాన్ని స్లో నెరేషన్ సినిమాకి పెద్ద మైనస్. ప్రారంభం నుంచి సినిమా మొత్తం స్లోగా సాగుతుంది. దీంతో చాలా వరకు బోర్ ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. ఎంత సేపు అక్కడక్కడే సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అస్సలు ముందుకు సాగడం లేదనిపిస్తుంది. సెకండాఫ్ సైతం అలానే సాగుతుంది. ఇక క్లైమాక్స్ మరింత సాగదీశారు. సినిమా మొత్తం సాగదీతే కనిపిస్తుంది. కామెడీకి స్కోప్ ఉన్నా ఆ దిశగా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అలా పెట్టి ఉంటే ఈ స్లో నెరేషన్ అనేది తగ్గిపోయేది. ఇది సినిమాలోని ఫీల్‌ని డైల్యూట్ చేసేలా మారిపోయింది. ఆ ఎమోషనల్ ఫీల్‌ని, లవ్ ఫీల్ పక్కకెళ్లాలా చేస్తూ, బోర్ తెప్పిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు కేర్ తీసుకుంటే సినిమా బాగుండేది. కాస్త ఫాస్ట్ గా కథనం సాగితే సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. ఈ సినిమాకి సాగదీతే పెద్ద మైనస్. దీనికి తోడు క్లైమాక్స్ ముగింపు లోనూ దర్శకుడు క్లారిటీ మిస్ అయ్యింది. అయితే అది కొత్తగా ఉంటుందని అలా వదిలేశాడా? లేక ఏం చేయాలో తోచక వదిలేశాడా? అనేది మిస్టరీగా మారుతుంది. మైండ్‌లో ఓ క్వచ్ఛన్ మార్క్ తో ఆడియెన్స్ బయటకు వస్తారు.
నటీనటులుః
ఆనంద్ దేవరకొండ ఆనంద్ పాత్రలో జీవించాడు. పాత్రని రక్తికట్టించాడు. అద్భుతమైన నటన ప్రదర్శించాడు. చాలా సహజంగా అతని నటన సాగుతుంది. అంతే బాగా ఆకట్టుకుంటుంది. అంతే కన్నీళ్లు పెట్టిస్తుంది. నటుడిగా పది మెట్లు ఎక్కినట్టుగా ఆనంద్ నటన ఉండటం విశేషం. కాకపోతే ఆయనలోవేగం పెరగాలి. మరోవైపు వైష్ణవి పాత్రలో వైష్ణవి పాత్రకి ప్రాణం పోసింది. సినిమాని తన భుజాలపై నడిపించింది. సినిమాకి తనే హీరో అనిపించింది. రెండు లవ్ స్టోరీలను మెయింటేనే చేసే క్రమంలో ఆమెలో చోటు చేసుకునే మార్పు, ట్రాన్ఫర్మేషన్ విషయంలో అత్యద్భుతంగా చేసింది వైష్ణవి. హీరోయిన్‌గా తొలి సినిమానే అయినా అవార్డు విన్నింగ్ నటన కనబర్చడం విశేషం. ఈ సినిమా తర్వాత వైష్ణవి రేంజ్ మారిపోతుంది. విరాజ్.. నటన ఆకట్టుకునేలా ఉంది. తన వంతు బాగా చేశారు. నాగబాబు, వైవా హర్ష, మిగిలిన ఆర్టిస్టులు ఓకే అనిపించేలా ఉన్నారు. వారి పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు.
టెక్నీషియన్లు..
సినిమాకి మ్యూజిక్ ప్రధాన బలం. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ సంగీతం ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. పాటలు వినసొంపుగా ఉంటాయి. పాటలే సినిమా కథని నడిపిస్తాయి. ఆడియెన్స్ ని ఆ ట్రాన్స్ లో తీసుకెళ్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్. మెయిన్ ఆర్టిస్టుల నటనకు విజయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో పిల్లర్‌గా నిలుస్తుంది. పాటల కోసమైనా సినిమా చూసేలా సాంగ్స్ ఉండటం విశేషం. అలాగే ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజువల్ ట్రీట్‌లా ఉంది. చిన్న బడ్జెట్ చిత్రాల్లో ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎడిటింగ్ ప్రధాన లోపం. విప్లవ్ నైషదమ్.. రాజీపడకుండా కత్తిరించి మరో ఇరవై నిమిషాలు తీసేసి ఉంటే సినిమా సూపర్‌గా ఉండేది.
ఇక దర్శకుడు సాయి రాజేష్.. ప్రేమలోని ఫీల్‌ని అద్భుతంగా క్యారీ చేశాడు. దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. డైలాగులు సినిమాకి ఇంకో బలం. `గుండెలపై కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వరూ కొట్టలేరు` అని హీరోయిన్ చెప్పే డైలాగ్‌లు, ఆనంద్ దేవరకొండ డైలాగులు ఆకట్టుకుంటాయి. మనసుని హత్తుకుంటాయి. ఆలోచింప చేస్తాయి. గుండెల్ని పిండేస్తాయి. చివరగా `మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది` అనేది సైతం బాగుంది. కానీ ఆయన స్లో నెరేషన్‌ని తగ్గించి ఉంటే, కాస్త వినోదం పాళ్లు పెంచి ఉంటే బాగుండేది. మాస్ మూవీ మేకర్స్ పై ఎస్‌కేఎన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీ పడకుండా నిర్మించారు.
ఫైనల్‌గాః యూత్‌ఫుల్ ట్రాయాంగిల్ లవ్ స్టోరీ `బే..............బీ`.
రేటింగ్‌ః 3