Circle Review: `సర్కిల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Jul 7, 2023, 3:27 PM IST

జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు నీలకంఠ రూపొందించిన చిత్రం `సర్కిల్‌`.  సాయి రోనక్‌, రిచా పనయ్‌, అర్షిత్‌ మెహతా, నైనా, బాబా భాస్కర్ మాస్టర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నేడు శుక్రవారం(జులై 7)న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

పెద్ద సినిమాలు లేకపోతే చిన్న సినిమాలకు పండగే. అయితే సమ్మర్ ని మొత్తం వృథాగా వదిలేసి ఇప్పుడు థియేటర్లకొస్తున్నాయి చిన్న సినిమాలు. ఈ వారం ఏకంగా చిన్నా, చితకా, ఓ మోస్తారు వరకు ఓ పది సినిమాల వరకు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు నీలకంఠ రూపొందించిన `సర్కిల్‌` కూడా ఉంది. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ రకంగా ఆయనకిది కమ్‌ బ్యాక్‌ మూవీ అని చెప్పొచ్చు. సాయి రోనక్‌, రిచా పనయ్‌, అర్షిత్‌ మెహతా, నైనా, బాబా భాస్కర్ మాస్టర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నేడు శుక్రవారం(జులై 7)న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. Circle Review.

కథః 
కైలాష్‌(సాయిరోనక్‌) ఫోటోగ్రాఫర్‌గా గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌గా ఎదగాలని కలలు కంటాడు. అలాంటి వ్యక్తి రోజూ తాగుతూ బాధలో ఉంటాడు. బాగా తాగి రోడ్డుపై గొడవ కూడా పడ్డాడు. ఓ రోజు బాగా తాగి ఇంటికెళ్లగా, ఇంట్లో కిరాయి హంతకుడు(బాబా భాస్కర్‌ మాస్టర్‌) కైలాష్‌పై దాడి చేస్తాడు. కొట్టి చైర్‌కి కట్టేస్తే నిన్ను ఎవరు చంపమని చెప్పారో గెస్‌ చేస్తే వారితో ఫోన్‌ కలిపి మాట్లాడిస్తానని, ఇద్దరి మధ్య అండర్‌ స్టాండింగ్‌ కుదిరితే వదిలేస్తానని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో కైలాష్‌ గెస్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన లవ్‌ స్టోరీస్‌ బయటపెడుతుంటాడు. ఇందులో ఓ పెయింటింగ్‌ ఆర్టిస్ట్(రిచా పనాయ్‌), అలాగే ఎంపీ కూతురు(అర్షిత్‌ మెహతా), రాజదర్భార్‌ యువరాణి(నైనా)లతో ప్రేమ కథలు రివీల్‌ చేస్తాడు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలేంటి? వారితో ఎందుకు విడిపోయాడు, తనని చంపమని డీల్‌ మాట్లాడింది ఎవరు? ఇందులో బాబా భాస్కర్‌ కథేంటి? అనేది సినిమా కథ.
 


విశ్లేషణః
దర్శకుడు నీలకంఠ అంటే బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలకు కేరాఫ్‌. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ మెప్పిస్తాడు. ఆయన సినిమాలు కమర్షియల్‌గా కంటే క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకున్నాయి. `షో` చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు వచ్చింది. అలాగే `మిస్సమ్మ` క్రిటికల్‌గా, కమర్షియల్‌గా ఆడింది. అయితే `మాయ` చిత్రం తర్వాత నీలకంఠ తెలుగులో సినిమాలు చేయలేదు. మలయాళంలో ఒకటి అర చేశారు. చాలా కాలం తర్వాత ఆయన ఇప్పుడు `సర్కిల్‌` చిత్రంతో వస్తుండటంతో కచ్చితంగా ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్ తో వస్తున్నారని అంతా భావించారు. కానీ ఆయన ఓ చిన్న పాయింట్‌తో `సర్కిల్‌` చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రాణాల విలువ తెలియజేసే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దానికి రొమాంటిక్‌ లవ్‌, క్రైమ్‌, సస్పెన్స్ ఎలిమెంట్లని జోడించారు. నేటి యూత్‌కి కావాల్సిన అంశాలన్ని జోడించి తాను అనుకున్న సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకున్నారు దర్శకుడు. 
 

అయితే కథని నడిపించే విషయంలో ఆయన తడబాటు పడ్డారు. కథలోకి తీసుకెళ్లేందుకు ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. దీంతో మొదటి భాగం వరకు ఏం జరుగుతుందో అర్థం కాని కన్‌ఫ్యూజన్‌ కలుగుతుంది. అదే సమయంలో దాన్ని అంతే ఎమోషనల్‌గా డీల్‌ చేయాల్సింది. లవ్‌ స్టోరీస్‌పై మాత్రం గట్టిగా ఫోకస్‌ చేశారు. ఎంత రొమాంటిక్‌గా, ఎంత ట్రెండీగా చూపించాలో, అంతకు మించి చూపించారు. యూత్‌ని ఈ విషయాల్లో గట్టిగా టార్గెట్‌ చేశారు. మూడు లవ్‌ స్టోరీస్‌ ఆద్యంతం రొమాంటిక్‌గా సాగుతాయి. అయితే అవి అంతే వేగంగా వచ్చిపోవడం కాస్త డిజప్పాయింట్‌ అనిపిస్తుంది. సాయిరోనక్‌, బాబా భాస్కర్‌ మధ్య జరిగే కన్వర్జేషన్‌ సైతం బోర్‌ తెప్పిస్తుంది. ఆయా సీన్లు కాస్త విసుగు పుట్టించేలా ఉంటాయి. దీనికితోడు పక్కింటి అమ్మాయి జోక్యం సైతం కాస్త చిరాకు అనిపిస్తుంది. మర్దర్‌ చేసే ముందు బాబా భాస్కర్‌ తన స్ట్రాటజీని చెబుతూ హత్య చేసే సన్నివేశాలు కన్విన్సింగ్‌గా అనిపించలేదు. వాటిపై మరింత ఇంట్రెస్ట్ ని, ఉత్కంఠతని పెంచాల్సింది. బాబా భాస్కర్‌ సహజంగా కామెడీ చేస్తాడు. కానీ ఇందులో ఆయన కామెడీ బయట షోస్‌లో పండినంతగా వర్కౌట్ కాలేదు. 
 

ఫైనల్‌గా ఈ సినిమా ద్వారా నీలకంఠ ప్రాణం విలువని చెప్పే ప్రయత్నం చేశాడు.  అందుకు బాబా భాస్కర్‌ మాస్టర్‌ని ఎంచుకున్నారు. ప్రధాన పాత్రల్లో రియలైజేషన్‌ కలిగిస్తాడు. ప్రాణం విలువ ఏంటో బాబా మాస్టర్‌ ద్వారా చెప్పించిన విధానం హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. ఆయా సీన్లు హృదయాన్ని బరువెక్కిస్తుంటాయి. ఊరికే సూసైడ్‌ చేసుకోవాలనుకోవడం, ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడం అంత ఈజీ కాదని, దానికి సంబంధించిన పెయిన్‌ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు నీలకంఠ. కానీ దాన్ని అంతే ఇంట్రెస్టింగ్‌గా, అంతే ఉత్కంఠతగా, అంతే క్యూరియాసిటీ కలిగించేలా కథని నడిపిస్తే బాగుండేది. ఆయన చెప్పాలనుకున్న సందేశం మరింత బాగా ఎక్కేది. లవ్‌ స్టోరీస్‌లోనూ మరింత ఫీల్‌ పెంచేదిగా తీసి ఉండాల్సింది. కానీ ఆయన చాలా పొయెటిక్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. అది పూర్తిగా సక్సెస్‌ కాలేదు. లైఫ్‌ ఒకసర్కిల్‌ లాంటిది. జీవితంలో ఎవరు ఎప్పుడు శత్రువులు అవుతారో, మిత్రులవుతానో తెలియదు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు, జాగ్రత్తగా ఉండాలని, లైఫ్‌ని చాలా ముఖ్యం అనేది ఇందులో చెప్పారు దర్శకుడు. గ్యాప్ ఎక్కువగా తీసుకున్నారు.

నటీనటులుః
సాయిరోనక్‌.. ఫోటోగ్రాఫర్‌ కైలాష్‌గా చాలా బాగా చేశాడు. రొమాంటిక్‌ సీన్లల్లో ఇరగదీశాడు. ప్లేబాయ్‌ తరహా పాత్రకి బాగా సెట్‌ అయ్యారు. డిఫరెంట్‌ షేడ్స్ లో బాగా నటించారు. బాబా భాస్కర్‌ మాస్టర్‌ నటన ఫర్వాలేదు. ఆయన నుంచి కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తాం, ఇందులో అది మిస్‌ అయ్యింది. మరోవైపు హీరోయిన్లుగా రిచా పనయ్‌, అర్షితా మెహతా, నైనా చాలా బాగా చేశారు. అంతే అందంగా ఉన్నారు. మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్‌ లేదు. 
 

టెక్నీషియన్లుః 
దర్శకుడు నీలకంఠ.. బలమైన కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్‌. ఇందులోనూ మంచి పాయింట్‌నే తీసుకున్నారు. కానీ దాన్ని సరైన వేలో ప్రొజెక్ట్ చేయాల్సింది. మరింత ఫన్‌గా, గ్రిప్పింగ్‌గా, కామెడీగా తీయాల్సింది. డైలాగులు బాగున్నాయి. ఎస్‌ఎస్‌ ప్రశు మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. అయితే చాలా సీన్లలో ఖాళీగా వదిలేసిన ఫీలింగ్ కలుగుతుంది. మరోవైపు రంగనాత్‌ గోగినేని కెమెరా వర్క్ సూపర్బ్. రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంది.  నిర్మాణం విషయంలో నిర్మాణలు రాజీపడలేదు. ఎం వీ శరత్‌ చంద్ర, టి సుమలత అన్నిత్‌రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మాతలుగా బాగా చేశారు. 

ఫైనల్‌గాః ప్రాణం విలువ తెలిపే రొమాంటిక్‌ `సర్కిల్‌`. 
రేటింగ్‌ః 2.5

Latest Videos

click me!