Annapurna Photo Studio Movie Review: `అన్నపూర్ణ ఫోటో స్టూడియో` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Jul 20, 2023, 1:11 PM IST

`30 వెడ్స్ 21` ఫేమ్‌ చైతన్య రావు హీరోగా నటించిన చిత్రం `అన్నపూర్ణ ఫోటో స్టూడియో`. `పెళ్లి చూపులు`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాలను నిర్మించిన యష్‌ రంగినేని నిర్మించిన ఈ సినిమా రివ్యూ, రేటింగ్‌
 

`30 వెడ్స్ 21` వెబ్‌ సిరీస్‌తో పాపులర్‌ అయ్యారు చైతన్య రావు. యూట్యూబ్‌లో మంచి గుర్తింపుతెచ్చుకున్న ఆయన నటుడిగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో మెరిసిన చైతన్యరావు హీరోగా ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా `అన్నపూర్ణ ఫోటోస్టూడియో` చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. లావణ్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. `పెళ్లి చూపులు`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాలను నిర్మించిన బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకంపై యష్‌ రంగినేని నిర్మించారు. ఈ సినిమా రేపు శుక్రవారం(జులై 21న) విడుదల కానుంది. గత వారం రోజులుగా రెండు తెలుగు స్టేట్స్ లో ఈచిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.Annapurna Photo Studio Review.
 

కథః

విలేజ్‌లో అన్నపూర్ణ ఫోటో స్టూడియో నడిపించే చంటి(చైతన్య రావు) చాలా మంచివాడు. నలభై ఏళ్లు దగ్గరపడ్డా పెళ్లి కాదు. తాను ఇష్టపడ్డ అమ్మాయిలందరి పెళ్లిళ్లు అవుతుంటాయి. తనకు పెళ్లి కావడం లేదని బాధ పడుతుంటాడు. అందమైన అమ్మాయి కనిపించిందంటే ఆశలు చిగురిస్తాయి, అంతలోనే నిరాశ ఎదురవుతుంటుంది. ఓ ఫంక్షన్‌లో గౌతమి(లావణ్య) చూడగానే తన లైట్లు వెలుగుతాయి. తన గుండె దడదడ పెరుగుతుంది. ఆమెని చూస్తూ అలానే ఉండిపోతాడు చంటి. ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. తను తన చెల్లి పద్దూ(ఉత్తర రెడ్డి) ఫ్రెండ్‌ అని తెలిసి మరింత సంతోషిస్తాడు. దాన్ని ఆసరాగా చేసుకుని రోజూ ఆమెని కలుస్తుంటాడు. తను వీళ్లింటికి వస్తుంటుంది. ఇలా ఎట్టకేలకు మనసులు కలుస్తాయి. ప్రేమ పుడుతుంది. ప్రేమపాఠాలు చెప్పుకుంటారు. ఈ విషయం చంటి వాళ్ల నాన్నకి తెలుస్తుంది. ఆయన ఊర్లో జోతిష్యుడు. ఆయన చెప్పింది కచ్చితంగా జరుగుతుంది. చంటి గురించిన ఓ రహస్యాన్ని గౌతమికి చెబుతాడు వాళ్ల నాన్న. మరి ఆ రహస్యం ఏంటి? చంటికి ఎందుకు పెళ్లి కావడం లేదు? రాముడు మంచి బాలుడు లాంటి చంటి మర్దర్‌ మర్డర్‌ ఎందుకు చేశాడు? ఇందులో ఫారెన్‌ నుంచి వచ్చిన మిహిర పాత్రేంటి?  యష్‌ రంగినేని ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? చంటి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు?(annapurna photo studio movie review) ఇంతకి చంటి, గౌతమిల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా. 
 


విశ్లేషణః 

పల్లెటూరు బ్యాక్‌ డ్రాప్ లో సాగే ఓ స్వచ్ఛమైన వినోదాత్మక ప్రేమ కథ ఈ సినిమా. ఇటీవల కాలంలో విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిన సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కమర్షియల్‌ అంశాల వెనకబడి రూట్స్ మర్చిపోతున్న ఈ టైమ్‌లో ఇలాంటి గ్రామీణ నేపథ్యంలో రూపొందే చిత్రాలు ఆడియెన్స్ కి మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. `కేరాఫ్‌ కంచెరపాలెం` నుంచి మొన్న `బలగం` వరకు పెద్ద హిట్‌ అయ్యాయి. కొత్త ట్రెండ్‌ కి శ్రీకారం చుట్టాయి. ఓ రకంగా `దసరా`, `మేమ్‌ ఫేమస్‌` వంటి సినిమాలు కూడా ఈ కోవకే చెందుతాయి. ఓ వైపు పాన్‌ ఇండియా కాన్సెప్ట్ లతో తెలుగు సినిమా సంచలనాలు సృష్టిస్తుంటే, మరోవైపు వింటేజ్‌ లుక్‌లో గ్రామీణ నేపథ్య చిత్రాలతోనూ మంచి హిట్లు అందుకుంటుంది. ఆ కోవకే చెందింది `అన్నపూర్ణ ఫోటో స్టూడియో`. వల్గారిటీకి తావులేని స్వచ్ఛమైన కామెడీతో ఈ సినిమాని రూపొందించారు. పెళ్లికాని ప్రసాద్ లాంటి పాత్రకి వినోదాన్ని జోడించి ఈ సినిమా రూపొందించారు. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్‌ అయ్యారు. సింపుల్‌ స్టోరీకి కామెడీని జోడించిన తీరు ఆకట్టుకుంటుంది. 

మొదటి భాగం మొత్తం హీరో పెళ్లి గురించి పడే బాధలు, పెళ్లి కాకపోవడం, మరోవైపు తాను ఇష్టపడే అమ్మాయి తనని మొదట అపార్థం చేసుకోవడం, ఈ క్రమంలో జనరేట్‌ అయ్యే కామెడీ, చంటి పడే చిన్న చిన్న ఇబ్బందులు, ఫ్రెండ్స్ తో ఆయన చేసే పనులు, వీళ్ల మధ్య జరిగే ఇన్నోసెంట్‌ డిస్కషన్‌ వంటివి ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. దీంతో మొదటి భాగం మొత్తం సరదాగా సాగుతుంది. నవ్వులు పూయించేలా సాగుతుంది. అయితే మధ్య మధ్యలో పోలీసులు వీరి కథని చదవడం, ఆయా సీన్లలో చంటి తన ఫ్రెండ్‌తో కొండమీదకి తీసుకొచ్చి తోసేద్దాం అని పదే పదే చెప్పుకోవడం వంటి సీన్లతో సినిమాపై సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఎంగేజ్ చేస్తుంటాయి. ఇక(Annapurna Photo Studio Movie Review) సెకండాఫ్‌ కథ క్రమ క్రమంగా సీరియస్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. ఓ వైపు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆమెతో ముద్దుముచ్చట్లు ఆకట్టుకుంటూనే సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. మరోవైపు చంటి గురించి ఓ షాకింగ్ నిజం తెలియడంతో హీరోయిన్‌ బాధపడటం, మరోవైపు జగదీష్‌ అనే పాత్ర చంటిని బ్లాక్ మెయిల్ చేయడం వంటి సీన్లు ఉత్కంఠకి గురి చేస్తాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్‌ అయిన తీరు బాగుంది. 
 

అయితే `అన్నపూర్ణ ఫోటో స్టూడియో`తో టీమ్‌ చేసిన ప్రయత్నం బాగుంది. కానీ కొంత వరకే సక్సెస్‌ అయ్యేలా ఉంది. విలేజ్‌లో పుట్టే కామెడీ కొంత బలవంతపు కామెడీగా అనిపిస్తుంది. అన్ని సీన్లలో కామెడీ పండలేదు. ఆ సహజత్వం మిస్‌ అయ్యింది. మరోవైపు సెకండాఫ్‌లో కథ సీరియస్ టర్న్ తీసుకోవడంతో కామెడీ పాళ్లు తగ్గాయి. అది కొంత డిజప్పాయింట్ చేసేలా ఉంటుంది. అదే సమయంలో కొత్త పాత్రల ఎంట్రీ కూడా సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆయా సీన్లు బలవంతంగా ఇరికించినట్టుగా ఉన్నాయి. ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది. వాటిని బలంగా ఆయా సీన్లని రాసుకుంటే బాగుండేది. మరోవైపు చంటి స్టోరీని పోలీసులు మధ్య మధ్యలో చదవడం వంటి సీన్లు కూడా కొంత చిరాకు తెప్పిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ లు మరింత బలంగా, మరింత కిక్ ఇచ్చేలా రాసుకుంటే ఫలితం బాగుండేది. 
 

నటీనటులుః

చైతన్య రావు.. `30వెడ్స్ 21` వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు `అన్నపూర్ణ స్టూడియో`లో కూడా తన ఏజ్‌కి తగ్గ పాత్ర ఎంచుకున్నారు. అదే పెళ్లి గోల ఇందులో పెట్టారు. దీంతో చంటి పాత్రలో ఒదిగిపోయాడు. వింటేజ్‌ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. సినిమాకి ప్రాణం పోశాడు. తన ప్రియురాలు పాత్రలో లావణ్య చక్కగా నటించింది. విలేజ్‌ అమ్మాయిగా బాగా సెట్ అయ్యింది. తనదైన నటనతో మెప్పించింది. ఇక చంటి చెల్లి పద్దూ పాత్రలో ఉత్తరా రెడ్డి పాత్ర మరో హైలైట్‌గా నిలుస్తుంది. గయ్యాలి చెల్లిగా అదరగొట్టింది.  ప్రేమ సీన్లలోనూ ఆకట్టుకుంది. చంటి ఫ్రెండ్‌ పండు పాత్రలో వైవా రాఘవ కామెడీ అలరిస్తుంది. జగదీష్‌గా యష్‌ రంగినేని, ఫారెన్‌ నుంచి వచ్చిన అమ్మాయి సంధ్యగా మహిర, ఇతర పాత్రలు సైతం ఉన్నంతో మెప్పించాయి. Annapurna Photo Studio Review.

టెక్నీషియన్లుః 

దర్శకుడు చెందు ముద్దు విలేజ్‌ నేపథ్యంలో ఓ సరికొత్త కథని ఎంచుకున్నారు. దాన్నే అంతే బాగా తెరకెక్కించారు. అయితే కథ వింటేజ్‌లో జరిగేది కావడంతో కొన్ని సీన్లు కూడా ఓ నలభై ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల్లో తరహాలోనే తెరకెక్కించడంతో కాస్త ఓల్డ్ ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ చిన్న కేర్‌ తీసుకోవాల్సింది. ముందూ వెనుక స్క్రీన్‌ ప్లే కన్‌ఫ్యూజ్‌ చేసినా కొత్తగా ఉంది. పంకజ్‌ తొట్టాడ కెమెరా వర్క్ సినిమాకి మరో అసెట్‌. ప్రతి ఫ్రేమ్ బాగుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. చిన్న సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. అలాగే ప్రిన్స్ హెన్రీ సంగీతం, బీజీఎం కూడా సినిమాకి ఇంకో అసెట్‌గా నిలిచాయి. వింటేజ్‌ సంగీతం, బీజీఎం ఆదరగొడుతుంది. ఎడిటింగ్‌ పరంగా మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అనవసరమైన, ల్యాగ్‌ సీన్లు లేపేస్తే బాగుండేది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. యష్‌ రంగినేని రిచ్‌గా తీశారు. 

ఫైనల్‌గాః గ్రామీణ నేపథ్య చిత్రాల్లో మంచి ప్రయత్నం. జస్ట్ టైమ్ పాస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. Annapurna Photo Studio Review

రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!