
నవీన్ పొలిశెట్టి హీరోగా తెలుగులో చేసింది మూడు సినిమాలే. `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`, `జాతి రత్నాలు`, `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. ఈ మూడు మంచి విజయాలు సాధించాయి. కానీ `జాతిరత్నాలు` తర్వాత దాన్ని మించిన కామెడీ సినిమా రాలేదు. ఇప్పుడు ఆయన `అనగనగా ఒక రాజు` చిత్రంతో వస్తున్నారు. దీనికి మారి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ మూవీ నేడు బుధవారం(జనవరి 14)న విడుదలైంది. మరి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల కంటే బెటర్‌గా ఉందా? నవీన్ పొలిశెట్టి ఆడియెన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
రాజుగారు(నవీన్ పొలిశెట్టి) గౌరవపురం జమీందారు గోపరాజుగారి మనవడు. ఎప్పుడూ తనకు కోట్ల ఆస్తి ఉందని, తనది పెద్ద రిచ్ ఫ్యామిలీ అని ఊహల్లో తేలియాడుతుంటాడు. కానీ వాస్తవంలో అన్నీ అప్పులే, ఆస్తులన్నీ అమ్మాయిల కోసం తాత గోపరాజు రాసిచ్చాడు. ఇక మిగిలింది ఇళ్లు మాత్రమే. కనీసం ఇంట్లో పనిచేసేవారికి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు. కానీ అప్పు చేసైనా హడావుడి చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఒక రిచ్ గా ఉన్న అమ్మాయిని పెళ్లిచేసుకుంటే తన లైఫ్ సెట్ అవుతుందని భావిస్తుంటాడు. అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్న క్రమంలో పెద్దిపాలెం భూపతి రాజు(రావు రమేష్) బాగా రిచ్ అని తెలుస్తుంది. తమ ఊర్లో జరిగే జాతరలో వాళ్ల అమ్మాయి చారులత(మీనాక్షి చౌదరీ)ని చూసి ఇంప్రెస్ అవుతాడు రాజు. ఆమె మీద ఉన్న నగలు చూసి ఇంకా ఇంప్రెస్ అవుతాడు. వాళ్లని పడేస్తే, భూపతిరాజుకి అల్లుడుగా వెళితే తన లైఫ్ సెట్ అయిపోతుంది, రిచ్‌గా లైఫ్‌ని లీడ్ చేయోచ్చని భావిస్తాడు. దీంతో చారులతని పడేయడానికి `ఆపరేషన్ చారులత` పేరుతో ప్లాన్ చేస్తాడు. ఆమెని రెగ్యూలర్‌గా ఫాలో అవుతూ, ఒక్కో స్టేజ్‌లో చారులతని ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు. అలా ఆమెకి నచ్చిన పనులు చేస్తూ దగ్గరవుతాడు. చివరికి ఆమెని పడేస్తాడు. అంతేకాదు ఏకంగా పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ రోజు అసలు నిజం తెలుస్తోంది. భూపతిరాజుకి కోట్ల అప్పులున్నాయని, తన పేకాట జల్సాలకు అన్నీ ఆస్తులు తాకట్టు పెట్టినట్టు మామ లెటర్ రాసి తీర్థయాత్రలకు వెళ్లిపోతాడు. దీంతో రాజు ఆశలన్నీ తలక్రిందులయ్యాయి. మరి ఈ విషయం తెలిసి రాజుగారి పరిస్థితేంటి? రాజుని పడేయడానికి చారులత, వాళ్ల నాన్న వేసిన స్కెచ్ ఏంటి? అప్పులు తీర్చేందుకు రాజు ఏం చేశాడు? ఉన్నట్టుండి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాడు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ ఫ్యామిలీ అంశాలు, కామెడీని నమ్ముకుని వస్తున్నాయి. చిరంజీవి `మన శంకరవర ప్రసాద్ గారు`, రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అలాంటి జోనర్‌లోనే వచ్చాయి. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా అదే జోనర్‌లో `అనగనగా ఒక రాజు` మూవీతో వచ్చారు. అయితే ఇది ప్యూర్ పండగ మూవీ అని చెప్పొచ్చు. పల్లెటూరి పండగవాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమాలా ఉంటుంది. ఊర్లో రాజుగారి హడావుడి, సందడి వంటి వాటిని మేళవించి, దానికి ప్రెసిడెంట్ ఎన్నికలకు లింక్ పెట్టి పక్కా సంక్రాంతి పండగ సినిమాలా దీన్ని తెరకెక్కించారు. నవీన్ పొలిశెట్టి అంటేనే కామెడీ, అందులోనూ గోదావరి యాసలో సాగే డైలాగ్‌లతో వచ్చే కామెడీ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులోనూ అదే చేశారు. ప్రారంభంలో రాజుగారి పాత్రని, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ని ఎస్లాబ్లిష్ చేశాడు. పేరుకే జమీందారు కానీ ఏం లేవని చెప్పే ప్రయత్నం చేశారు. రాజుగారు ఊహల్లో ఉండటం వంటి సీన్లతో ఆయన క్యారెక్టరైజేషన్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. అనంతరం హీరోయిన్ తగలడం, ఆమెని పడేసేందుకు హీరో పడే పాట్లని ఆద్యంతం ఫన్నీగా, కామెడీని నడిపించారు. ఈ క్రమంలోనే బుల్లిరాజు కూడా ఎంట్రీ ఇస్తాడు. వీరి కాంబినేషన్‌లో సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఎలాంటి కష్టం లేకుండా క్రెడిట్ మొత్తం రాజుగారు కొట్టేస్తూ వచ్చే సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా అమ్మాయిని పడేసేందుకు పడే పాట్లతోనే సాగుతుంది. ఇందులో గోవా బీచ్‌ని భీమవరం తీసుకురావడం కామెడీగా ఉంటుంది. ఇందులో హీరోయిన్ తో సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌లో మ్యారేజ్ ఎపిసోడ్, అందులోనే ట్విస్ట్ ఇచ్చిన తీరు అదిరిపోయింది. క్రేజీగా ఉంది. సెకండాఫ్ మొత్తం తమ అప్పులు ఎలా తీర్చాలి, తాము ఎంత తప్పు చేశామని, అదే సమయంలో హీరోయిన్ వేసిన స్కెచ్‌లు కూడా రివీల్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేశారు. అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతున్న సమయంలో కథని ఎన్నికల వైపు తిప్పారు. ఆ తర్వాత మరింత రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సినిమా ఎమోషనల్ వైపు వెళ్తుంది. క్లైమాక్స్ కూడా ఎమోషనల్‌గా ముగింపు పలుకుతుంది. హీరో పాత్రలోని మార్పు ఆకట్టుకుంటుంది. ఎండ్ మాత్రం ఊహించినట్టుగానే ఉంటుంది.
సినిమాలో నవీన్ పొలిశెట్టి నేచురల్‌గా కామెడీ చేసిన తీరు బాగుంది. సందర్భాను సారంగా జనరేట్ అయిన ఫన్ కొంత వరకు నవ్వించింది. ఫస్టాఫ్‌లో రెండు, సెకండాఫ్‌లో రెండు ఎపిసోడ్లు నవ్వించాయి. ఎమోషనల్ అంశాలు కూడా కట్టిపడేశాయి. నవీన్ పొలిశెట్టి యాక్షన్ చేయించి మెప్పించాడు, అదే సమయంలో ఎమోషన్స్ పండించి మెప్పించాడు. అయితే ఇదంతా ఫ్యామిలీ అంశాల చుట్టూ తిరగడం ఇందులో హైలైట్‌గా చెప్పాలి. అదే ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు. పండగని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వల్గారిటీ లేకుండా క్లీన్‌గా మూవీని నడపించారు. ఆయా అంశాలు ఆకట్టుకున్నాయి.
అయితే సినిమా కథ ఊహించినట్టుగానే ఉంది. కొత్తగా లేదు. రెగ్యూలర్ కమర్షియల్ సినిమాని తలపిస్తుంది. హీరోయిన్ కోసం చేసిన డ్రామాలు తేలిపోయాయి. చాలా చోట్ల బలవంతపు కామెడీగా ఉంటుంది. సీన్ బై సీన్, ఎపిసోడ్ బై ఎపిసోడ్ పేర్చుకుంటూ వెళ్లారు, కానీ అందులో ఎమోషన్స్ మిస్ అయ్యింది. సోల్ మిస్ అయ్యింది. దీంతోనే ఆడియెన్స్ మూవీతో కనెక్ట్ కాలేకపోతుంటారు. ఫస్టాఫ్ అంతా టైమ్ పాస్ వ్యవహారంలా ఉంటుంది. సెకండాఫ్‌లోనూ కొంత రెగ్యూలర్‌గా ఉంటుంది. ప్రెసిడెంట్ ఎన్నికల్లోనూ రొటీన్ సీన్లు ఉంటాయి. క్లైమాక్స్ ఊహించినట్టుగానే ఉంది. సీన్లలో లౌడ్‌నెస్ ఉంది, కానీ ఫన్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు.
జమీందారిగారి మనవడు రాజుగా నవీన్ పొలిశెట్టి ఇరగదీశాడు. సినిమా మొత్తం ఆయనే కనిపిస్తాడు. సింగిల్‌గా సినిమాని తీసుకెళ్లిపోయాడు. అయితే ఆయన మార్క్ కామెడీ మిస్ అయ్యింది. ఇందులో నవీన్‌లోని కొత్త యాంగిల్స్ చూడొచ్చు. ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. ఇక చారులగా మీనాక్షి చౌదరీ కనిపించింది. ఆమె పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. కొంత కామెడీగా ఉంటూ పర్‌ఫెర్మెన్స్ తో మెప్పించింది. రావు రమేష్ కాసేపు మెరిశారు. బుల్లిరాజు కనిపించినంత సేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఝాన్సీ అలా తళుక్కున మెరుస్తుంది. అవినాష్ సైతం ఆకట్టుకున్నాడు. నవీన్ ఫ్రెండ్స్, అసిస్టెంట్ పాత్రధారులు కూడా బాగా చేశారు. వారి పాత్రలు హైలైట్ అవుతాయి. తారక్ పొన్నప్ప పాత్ర ఫర్వాలేదు. ఫరియా అబ్దుల్లా మెరిసినంత సేపు `జాతిరత్నాలు`ని గుర్తు చేసింది. మిగిలిన ఆర్టిస్ట్ లు బాగానే మెప్పించారు.
ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. పాటలు బాగున్నాయి. బీజీఎం రొటీన్‌గా ఉంది. ఏమాత్రం కొత్తదనం లేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా ట్రిమ్ చేయోచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా తీశారు. దర్శకుడు మారి ఎంచుకున్న కొత్త నేపథ్యంలో డిఫరెంట్‌గా ఉన్నా, ఓవరాల్‌గా రొటీన్ స్టోరీ, రొటీన కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. దాన్ని కాస్త అలరించేలా తెరకెక్కించారు. డైలాగ్‌లు ఫర్వాలేదు. సహజమైన ఫన్ విషయంలో ఇంకా శ్రద్ధ పెట్టాల్సింది. దాన్ని మరింత బాగా రాసుకోవాల్సింది. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే, పండక్కి కావాల్సిన ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.
సంక్రాంతి పండగ లాంటి మూవీ. రొటీన్‌గా ఉన్నా, ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ అలరిస్తుంది.
రేటింగ్ 2.75