#Brahmastra: రణబీర్‌ “బ్రహ్మస్త్రం” రివ్యూ

First Published | Sep 9, 2022, 11:50 AM IST

హిందీ సినిమాల వరస ఫ్లాపుల పరంపరకు 'బ్రహ్మాస్త్ర' బ్రేక్ వేస్తుందని,బాయ్ కాట్ ట్రెండ్ బుద్ది చెప్తుందని  బాలీవుడ్ ఆశిస్తోంది. మరి, సినిమా ఎలా ఉంది? బాలీవుడ్ ఆశలను నెరవేరుస్తుందా

Brahmastra review


బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన  భారీ పాన్ ఇండియా  చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ఈ సినిమా “బ్రహ్మస్త్రం” పేరుతో రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రానికి సోషల్ మీడియాలో బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర పేరుతో చాలా నెగిటివ్ ట్రెండ్ నడిచింది. అయితే హీరో రణ్ బీర్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసారు. చివరకు తెలుగు టీవిలో క్యాష్ షో కు కూడా వచ్చారు. మరో ప్రక్క తెలుగులో రాజమౌళి సమర్పించారు.  ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ పంక్షన్ కు వచ్చారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఈ చిత్రం ఏ మేరకు తెలుగువారిని ఆకట్టుకుంటుంది. బాహుబలి స్దాయి విజయం ఈ సినిమాకు దక్కుతుందా..బాలీవుడ్ వరస పరాజయాల నుంచి ఈ సినిమా బయిటపడేస్తుందా?


కథాంశం :

హిందూ పురాణాలను ఆధారంగా రాసుకున్న కథ. పురాణాలు, ఇతి హాసాల్లో ఉన్న శక్తులన్నింటినీ కలిసి అస్త్రావర్స్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది. 
బ్రహ్మ దేవుడు...అస్త్రాలకు అధిపతి. మనిషి మనుగడకు మూలకారణం పంచభూతాలు. పంచభూతాన్ని శాసించే శక్తి ‘బ్రహ్మ’కు ఉంటుంది. బ్రహ్మ శక్తి నుంచి పుట్టిన శస్త్రాలు..ముఖ్యంగా బ్రహ్మాస్త్రం  ప్రపంచాన్ని దుష్టశక్తుల నుంచి రక్షిస్తూంటాయి. సృష్టికి అపాయం తలెత్తినప్పుడు సంధించేందుకు ఈ బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తూంటారు.  అయితే బ్రహ్మాస్త్రం ఎవరి చేతిలోనూ పడితే ప్రపంచం భస్మమే. అందుకే “బ్రహ్మస్త్రం” ని  మూడు భాగాలు చేసి   బ్రహ్మాన్ష్‌ గ్రూప్(సీక్రెట్ సొసైటి లాంటిది) వాళ్లు జాగ్రత్తగా పరిరక్షిస్తూంటారు.


 
గురు(అమితాబ్) ఆ బ్రహ్మాన్ష్ ని లీడ్ చేస్తూంటాడు. ఇక  బ్రహ్మాస్త్ర లోని ఒక భాగం ను అనీష్(నాగార్జున) వద్ద ఉండగా రెండవ భాగం మోహన్ భార్గవ్‌(షారుఖ్‌ ఖాన్‌) అనే సైంటిస్ట్ దగ్గర ఉంటుంది. విడి విడిగా ఉన్న మూడు భాగాలను కలపడం ద్వారా అద్భుత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ని సాధించి, ప్రయోగించాలని నిశీధి రాణి Junoon(మౌనీరాయ్) తన  గ్రూప్ తో కలిసి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మాస్త్రంతో ప్రపంచాన్ని నాశనం చేయాలనేది ఆమె జీవితాశయం.


మరో ప్రక్క ముంబైలో ఉండే  డీజే శివ(రణబీర్‌ కపూర్‌) అనాధ. మరికొందరు అనాధలను పోగేసి జీవిస్తూంటాడు.  అతనికి అప్పుడప్పుడూ చిత్రమైన కలలు వస్తూంటాయి. అందులో నిప్పు,మంటలు కనపిస్తూంటాయి. అవి దేనికి సంకేతమో అతనికి అర్దం కాదు. ఈ లోగా ఓ ఫారిన్ రిటర్న్ అమ్మాయి ఇషా (అలియాభట్)పరిచయం అవుతుంది.  అది యాజ్ యూజవల్ గా ప్రేమకు దారి తీస్తుంది. ఈలోగా వాళ్లిద్దరూ  ఓ పనిమీద వారణాసి వెళ్తారు. అక్కడ గురు (అమితాబ్) కలుస్తాడు. బ్రహ్మాస్త్ర ని నెగిటివ్ శక్తుల  చేతులో పడకుండా చూడటం కోసం, ప్రపంచ పరిరక్షణ కోసం శివను తమతో కలవమని,సహకరించమని అడుగుతాడు.అప్పుడు శివ ఏం నిర్ణయం తీసుకున్నాడు, ఏం చేసాడు...బ్రహ్మాస్త్రను పరిరక్షించాడా...అతని ప్రేమ కథ ఏమైంది...ఇంతకీ శివనే ఎందుకు ఈ పనికి ఎంచుకున్నారు. అతనికి వస్తున్న కలలకు ఈ  బ్రహ్మాస్త్రకి సంబంధం ఏంటీ? ఇంతకు బ్రహ్మాస్త్ర మూడవ భాగం ఎక్కడ ఉంది? ఈ కథలో నాగార్జున పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   
 

ఎలా ఉందంటే.:


ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్న ఎన్నో హాలీవుడ్ సినిమాలు  (Avengers/Marvel) 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీస్తున్నవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు వందల సంవత్సరాలుగా కలిగి ఉన్న  మనం ఎన్ని సినిమాలు తీయాలి.  అందులోనూ ఇప్పుడు  టెక్నాలిజీ కూడా బాగా డెవలప్ అయింది.   ఇలాంటి కథలు తెరపై చెప్పటానికి చాలావరకు కలిసొచ్చే అంశం. అయితే ఈ కథలకు బడ్జెట్ ఎక్కువ కోరతాయి. తల ప్రక్కకు తిప్పని స్క్రీన్ ప్లే ని కోరుకుంటాయి. లేకపోతే అంత ఖర్చు నీళ్లలో పోసిన పన్నీరే. ఈ సినిమా విషయంలో దర్శకుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా వరకూ జాగ్రత్తలు తీసుకున్నాడనే చెప్పాలి. 


అయితే స్టోరీ లైన్ ని మూడు పార్ట్ లు కోసం  మూడు భాగాలుగా విస్తరించేటప్పుడు ఏర్పడ్డ సమస్య ఏమో కానీ స్క్రీన్ ప్లే అంత టైట్ గా ఉండదు. తెరపై సీన్స్ మనకు ఎమోషనల్ గా టచ్ అవ్వకుండా తమ మానాన తాము వెళ్లిపోతూంటాయి. ముఖ్యంగా నెగిటివ్ ఫోర్స్ (విలన్) Junoonకు హీరో కు మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్కువగా లేవు. Junoon కు ఈ హీరో గురించి ఎప్పటికో కానీ తెలియదు. ప్రీ క్లైమాక్స్ లో Junoon వచ్చేదాకా సెకండాఫ్ స్పీడు అనిపించదు. Junoon పాత్రకు ట్విస్ట్ ఇవ్వగలిగే స్దాయిలో హీరో పాత్ర ఉండి ఉంటే(సీక్వెల్ లో ఉంటుందేమో) నెక్ట్స్ లెవిల్ లో ఉండేది. 

ఫస్టాఫ్ చూసాక  జస్ట్ ఓకే... లవ్ స్టోరీ తప్ప ఏమి జరగలేదే అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఎక్కువ శాతం లవ్ స్టోరీ పై దృష్టి పెట్టి మెల్లిగా కథలోకి వచ్చారు. సినిమా ప్రారంభంలో అస్త్రాల శక్తి,వాటి తయారి  గురించి చెప్తారు. ఆ తర్వాత ముంబై కు కథ షిప్ట్ అవుతుంది. దాంతో  హీరో...ఎప్పుడు ఈ బ్రహ్మాస్త్రాలకు సంభందించిన అసలు ప్లాట్ లోకి వస్తాడా అని ఎదురుచూస్తూంటాం. ఆ విషయంలోకి రావటానికి దాదాపు ఇంటర్వెల్ దాకా టైమ్ తీసుకున్నారు. దాంతో ఫస్టాఫ్ లో పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. కానీ సెకండాఫ్ లో సర్దుకున్నాడు.  
 


క్లైమాక్స్ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది. సెటప్ వరకూ ఈ సినిమా ఫెరఫెక్ట్ గా ఉంటుంది. భారీ ఫాంటసీ ఎడ్వెంచర్ అవ్వాల్సిన స్టోరీ లైన్. కానీ వీక్ రైటింగ్ ,స్క్రీన్ ప్లే ఆ అవకాసం ఇవ్వలేదు. కానీ కొన్ని సీన్స్ ,సీక్వెన్స్ లు గుర్తుండిపోయేలా డిజైన్ చేసారు. అప్ టు ది మార్క్ అని చెప్పలేం కానీ ఛల్తాహై అనిపిస్తుంది. అలాగే కొన్ని ఫైట్స్ ఇంక అవ్వవేమో అనిపించేటంత లెంగ్తీ గా అనిపిస్తాయి. అలాగే అవి ఒకేలా ఉండటం వల్లనేమో రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. 
 


టెక్నికల్ గా ....

దర్శకుడుగా అయాన్ ముఖర్జీ ...వేక్ అప్ సిడ్, యే జవానీ హై దీవాని సినిమాలు ఇదే హీరోతో చేసాడు. పేరు తెచ్చుకున్నాడు. ఆ రెండు సినిమాలకు ఈ సినిమాకు అసలు పోలిక లేదు. ఇది కేవలం హాలీవుడ్ లో గత కొంతకాలంగా వస్తున్న మల్టీవర్స్, సూపవర్ హీరోల సినిమాలను చూసి ప్రేరణ పొంది రాసుకున్న కథ అని అర్దమవుతుంది. డైరక్టర్ గా తను అనుకున్నది తీయగలిగాడు. కానీ స్క్రిప్టే అంత గొప్పగా అతని విజన్ కు తగినట్లు అనిపించదు.


ఇక సినిమా షూటింగ్ చాలా కాలం జరగటం వల్ల చాలా మంది cinematography చేసారు. ఆ డిఫరెన్స్ కాస్త దృష్టి పెడితే తెలిసిపోతూంటుంది. ఒకే ఫ్లోలో విజువల్స్ ఉండవు. ఇక సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ రెండు కొత్తగా లేవు. టిపికల్ బాలీవుడ్ స్టైల్ లో నడిచిపోతూంటాయి. ఎడిటింగ్ ఇంకాస్త టైట్ చేసి, ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గించవచ్చని అనిపిస్తుంది. రైటింగ్ ఫస్టాఫ్ వచ్చే లవ్ స్టోరీ మరీ సాదాసీదాగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కానీ వరల్డ్ సినిమా నడుస్తున్న ఈ టైమ్ లో రావాల్సిన స్దాయిలో లేవు. అబ్బా..భలే ఉందే అని ఎక్కడా అనిపించవు. నాశిరకంగాగానూ లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ ..బాగా పెట్టిన ఖర్చు కనపడుతోంది. తెలుగు డబ్బింగ్ డైలాగులు అయితే బాగోలేవు.

నటీనటుల్లో ...
 
హీరో రణబీర్‌ కపూర్‌ సినిమాలు చూసేవారికి ఇదేమీ నటనగా కొత్తగా అనిపించదు.  ఇంకా అతని స్ట్రెంత్ అయిన లవ్ సీన్స్ లో తేలిపోయాడనే చెప్పాలి. యాక్షన్ ఎపిసోడ్స్ లో బాగా చేసాడు. అయితే అతని పర్శనాలిటి కీ ఆ ఎపిసోడ్స్ కు సంభంధం ఉండదు. అలియాభట్ చేయటానికి ఏమీ లేదు. కేవలం సినిమాలో అతని లవర్ గా కనిపించటం తప్ప. ఇక  నాగార్జున అనీష్ శెట్టి పాత్రలో... వారణాసిలోని ఓ హెరిటేజ్ సైట్ లో ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ కనపడతాడు.గురుగా అమితాబ్,  మరో గెస్ట్ పాత్రలో  షారూఖ్ ఖాన్ చేసారు. వారికి పెద్దగా సీన్స్ లేవు.  కానీ ఉన్న కాసేపు మన అటెన్షన్ ని గ్రాబ్ చేసారు.మౌనీరాయ్ ...విలన్ గా బాగానే రాణించింది.  


నచ్చినవి  :
క్యూట్ గా ఉన్న లీడ్ పెయిర్
VFX
 సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఇంట్రస్టింగ్ సీన్స్
షారూఖ్ ఖాన్ కామియో

నచ్చనవి :
స్క్రీన్ ప్లే
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌,
ఎమోషన్ డెప్త్ మిస్సవటం


ఫైనల్ థాట్:

మార్వలెస్ అనలేము...మార్వెల్ సినిమాలతో పోల్చలేము.....మనకీ రాబోయో రోజుల్లో  ఇలాంటి సినిమాలే వచ్చి రాజ్యం ఏలబోతున్నాయని హింట్ అయితే ఇచ్చింది అని మాత్రం చెప్పగలం.

 ---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating 2.75/5

Brahmastra review


బ్యానర్స్:  స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ 
నటినటులు: రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబచ్చన్, నాగార్జున, షారూఖ్ ఖాన్, మౌని రాయ్ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: ప్రీతమ్  
సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ, పంకజ్ కుమార్, మణికందన్, వికాష్ నౌలాఖ.
డైరెక్టర్: అయాన్ ముఖర్జీ
నిర్మాతలు: మరిఙ్కే డిసోజా, కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ.
Run Time: 2 hr 47 Mins
రిలీజ్ డేట్: 2022, సెప్టెంబర్ 9
 

Latest Videos

click me!