`అలనాటి రామచంద్రుడు` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Aug 2, 2024, 3:01 PM IST

ఈ శుక్రవారం అన్నీ సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. అందులో ఒకటి `అలనాటి రామచంద్రుడు`. సరికొత్త లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

పెద్ద సినిమాలు లేనప్పుడు చిన్న చిత్రాలకు పండగే. అలాంటి పండగ ఈ శుక్రవారం వచ్చింది. వరుసగా ఆరేడు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఓ రకంగా చిన్న సినిమాల పండగ వచ్చిందని చెప్పొచ్చు. అందులో భాగంగా వచ్చిన సినిమా `అలనాటి రామచంద్రుడు`. బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటించారు. చిలుకూరి ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించారు. హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి జడపోలు, శ్రీరామ్ జడపోలు సంయుక్తంగా నిర్మించారు. సరికొత్త లవ్‌ స్టోరీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం(ఆగస్ట్ 2) విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః  
సిద్దు (కృష్ణవంశీ) చిన్నప్పట్నుంచి ఇంట్రోవర్ట్. బయటి మనుషులతో కలవడలేడు. గుంపులో ఉండలేడు. సిగ్గు, బిడియం, భయంతో ఇంటికే పరిమితమవుతుంటాడు. తనకు ఒకే ఒక్క ఫ్రెండ్‌ అభి(చైతన్య గరికపాటి)తోన అన్నీ షేర్‌ చేసుకుంటాడు. అదే కాలేజీలో ధరణి(మోక్ష) అనే అమ్మాయి చదువుకుంటుంది. క్లాస్‌మేట్‌ కూడా. ధరణికి నాన్న(బ్రహ్మాజీ) అంటే ఇష్టం. కానీ ఆయన తాను చిన్నగా ఉన్నప్పుడే బార్డర్‌ కాల్పుల్లో చనిపోతాడు. దీంతో తల్లి ఉన్నప్పటికీ ఎక్కువగా తండ్రి జ్ఞాపకాలతో బతికేస్తుంటుంది. సిద్దు ధరణిని ఇష్టపడుతుంటాడు. కానీ ఆమెని కలిసి, తన ప్రేమని వ్యక్తం చేసే ధైర్యం లేదు. దీంతో దూరం నుంచే ఆమెని చూస్తూ ప్రేమిస్తుంటాడు. తన ప్రేమని వ్యక్తం చేసే ప్రయత్నాల్లోనూ విఫలమవుతాడు. ధరణి ఫ్రెండ్‌ ద్వారా సిద్దుకి పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయినా తను సైలెంట్‌గానే ఉంటాడు. కానీ ధరణి టచ్‌ని, ఆమె నవ్వుని, ఆమె మాటలను లోలోపల ఆస్వాధిస్తూ ఉంటాడు. అయితే తన ఫీలింగ్స్ ని ఓ పిక్చర్‌ ద్వారా వ్యక్తం చేస్తాడు. కాలేజ్‌లో దానికి ఫస్ట్ ప్రైజ్‌ వస్తుంది. ఆ ఫోటోని, అందులోని మీనింగ్‌ని వివరించేందుకు స్టేజ్‌పైకి వెళ్లగా, అప్పుడే ధరణి విక్రమ్‌ అనే అబ్బాయిని ప్రేమిస్తుందని తెలుస్తుంది. అతనితో ఆ ఈవెంట్‌ మధ్యలోనే వెళ్లిపోతుంది. అది చూసి తట్టుకోలేక తాను గీసిన పిక్చర్‌ మీనింగ్‌ కూడా చెప్పలేకపోతాడు సిద్దు. తన హార్ట్ బ్రేక్ కావడంతో కుంగిపోతుంటాడు. ధరణి తన లవర్‌తో కలిసి మనాలికి వెళ్తుందని తెలుస్తుంది. దీంతో ఆమెని ఫాలో అవుతూ వెళ్తాడు సిద్దు. కట్‌ చేస్తే ఆమె సూసైడ్‌ చేసుకోవాలనుకుంటుంది. మరి ఎందుకు ఆమె చనిపోవాలనుకుంటుంది? చనిపోయిందా? బతికిందా? సిద్దు ప్రేమ ధరణికి తెలిసిందా? సిద్దు, ధరణిల గతం ఏంటి? మరి ఈ ప్రేమ ఏ తీరం చేరిందనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః
ఒకప్పుడు ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ సినిమాల ట్రెండ్‌ నడిచింది. ఇప్పుడు బోల్డ్ కంటెంట్ ని ఇష్టపడుతున్నారు ఆడియెన్స్. డైరెక్ట్ చాటింగ్‌, డేటింగ్‌ అంటున్నారు. లిప్‌ టూ లిప్‌ కిస్సులతో రెచ్చిపోతూ, ఏమాత్రం ఆలస్యం లేకుండా బెడ్‌ పైకి వెళ్లే ప్రేమ కథల ట్రెండ్‌ నడుస్తున్న రోజులివి. బోల్డ్ డైలాగ్‌ లతో అమ్మాయిలు మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్ ని ఆదరిస్తున్న రోజులివి. ఇలాంటి టైమ్‌లో ఓ నిజాయితీ ప్రేమ, వన్‌ సైడ్‌ లవ్‌, పొయెటిక్‌ లవ్‌ స్టోరీ చెప్పడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. కానీ `అలనాటి రామచంద్రుడు` చిత్రంతో మేకర్స్ అదే సాహసం చేశారు. లవ్‌ స్టోరీస్‌లో ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కించడం ఇందులో ప్రత్యేకత. ఇంట్రోవర్ట్ కుర్రాడి ప్రేమ ఎలా ఉంటుంది, ఎంత నిజాయితీగా ఉంటుంది? అతని ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉంటాయనేది ఈ సినిమా ద్వారా చూపించారు దర్శకుడు చిలుకూరి ఆకాష్‌ రెడ్డి. 
 

హీరోయిన్‌ని దూరంగా చూసి ప్రేమించడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. కాలేజ్‌లో ఆమెని చూసి ఫిదా అవడం, ఆమె కోసం పరితపించడం వంటి సన్నివేశాలతో ఆడియెన్స్ ని కాలేజ్‌ డేస్‌ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాడు. కాలేజీలో లవ్‌ సీన్లు, మరోవైపు ఫెయిల్‌ అయిన సీనియర్ల బ్యాచ్‌తో ఫన్నీ సీన్లతో ఫస్టాఫ్‌ నడిచింది. మరోవైపు గర్ల్స్ హాస్టల్‌ వద్ద వెయిట్‌ చేయడం, అమ్మాయిని చూస్తూ దూరం నుంచి సైట్ కొట్టడం వంటి సీన్లు ఇందులో ఆకట్టుకునేలా ఉంటాయి. ఇంట్రోవర్ట్ అయిన హీరో తన ప్రేమని చెప్పేందుకు ధైర్య చేయలేకపోవడం, ఈ క్రమంలో ఆయన పడే పాట్లు కాస్త ఫన్నీగా ఉంటాయి. ఇంటర్వెల్‌లో ట్రయంగిల్‌ లవ్‌ ట్రాక్‌ చూపించి ట్విస్ట్ ఇచ్చిన తీరు బాగుంది. దీంతో డ్రామా రక్తికట్టేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌ అంతా హీరోహీరోయిన్ల మధ్య సరదా, ఎమోషన్స్ మిక్స్ చేసిన లవ్‌ ట్రాక్‌తో నడిపించి అలరించే ప్రయత్నం చేశారు. తండ్రి ఎమోషన్ ని ప్రియుడిలో చూసుకోవడమనే పాయింట్‌ బాగుంది. ఎమోషనల్‌గా ఉంది. క్లైమాక్స్ పూర్తిగా ఎమోషనల్‌ సైడ్‌ మారుతుంది. గుండె బరవెక్కేలా మారిపోతుంది. సైలెంట్‌గా ఉన్నప్పుడు ఇష్టపడని అమ్మాయి, తాను అబద్దం చెప్పి, తాను వేరేలా ఉన్నానని చెప్పినప్పుడు ఇష్టపడుతుంది, అలాంటి ప్రేమ తనకు వద్దు అని హీరో చెప్పడమనే పాయింట్‌ కొత్తగా అనిపిస్తుంది. ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ పార్ట్ సినిమాకి ప్రధాన బలం. 
 

అయితే సినిమాని దర్శకుడు ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కించాలని భావించాడు. ప్రతి మూమెంట్‌, ప్రతి సీన్‌ని, ప్రతి ఫీలింగ్‌ని డిటెయిలింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో సినిమా బోరింగ్‌గా మారింది. ఫన్‌ ట్రాక్‌, ఫీల్‌ గుడ్‌ లవ్‌ ట్రాక్‌ పక్కకెళ్లి స్లోనేరేషన్‌ ఆడియెన్స్ ని సహనాన్ని పరీక్షించేలా చేస్తుంది. అదే సమయంలో హీరో ఫ్రెండ్‌ కామెడీ, అలాగే కమెడియన్‌ వెంకటేష్‌ కాకుమాను కామెడీ ఆశించిన స్థాయిలో పేలలేదు. అది వర్కౌట్ అయితే ఆ బోర్‌ ఫీలింగ్‌ ఉండేది కాదు. ఇక సెకండాఫ్‌ తర్వాత డ్రామా రక్తికట్టేలా చేయోచ్చు. కానీ దర్శకుడు మళ్లీ అదే స్లో నెరేషన్‌తోనే వెళ్లడం మరింత బోర్‌ ఫీలింగ్‌ తెస్తుంది. అయితే క్లైమాక్స్ ని డీల్‌ చేసి విధానం మాత్రం బాగుంది. దీనికి మెలోడీ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తోడు కావడంతో సినిమాని ఫీల్‌గుడ్‌గా మార్చేశాయి. లవ్‌, ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చే క్రమంలో కమర్షియల్‌ ఎలిమెంట్లు తగ్గాయి. ఆ విషయంలో దర్శకుడు కేర్‌ తీసుకోవాల్సింది.  

ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్ః 
కొత్త కుర్రాడు కృష్ణవంశీ.. సిద్దు పాత్రలో ఒదిగిపోయాడు. రియల్‌ లైఫ్‌లోనూ తాను అలానే ఉంటాడా? అనేట్టుగా పాత్రలో జీవించాడు. ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్‌ కలిగించకుండా నటించాడు. ఇంట్రోవర్ట్ పాత్రకి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌ అనేలా చేసి మెప్పించాడు. ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు. ఇక ధరణి పాత్రలో మోక్ష అదరగొట్టింది. ఆమె క్యూట్‌గా, అందంతో ఆకట్టుకోవడంతోపాటు అంతే క్యూట్‌గా నటనతోనూ మెప్పించింది. ఆమె పాత్రలోని బాధ, సంతోషం, ప్రేమ ఇలా విభిన్నమైన ఫీలింగ్స్ ని బాగా పలికించింది. ఆడియెన్స్ హృదయాలను టచ్‌ చేసింది. ఎప్పుడూ కామెడీ తరహా పాత్రల్లో కనిపించే బ్రహ్మాజీ ఇందులో హీరోయిన్‌ తండ్రిగా ఎమోషనల్‌ రోల్‌లో చేశాడు. ఆకట్టుకున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో చైతన్య గరికపాటి నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన కామెడీ చాలా సందర్భాల్లో మిస్‌ ఫైర్‌ అయ్యింది. కొన్ని సార్లు మాత్రమే వర్కౌట్‌ అయ్యింది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక వెంకటేష్‌ కాకుమాను పాత్ర నవ్వించేలా ఉంటుంది. చైతన్య, వెంకటేష్‌ మధ్య ఫన్‌ వర్కౌట్‌ అయ్యింది. వీరితోపాటు సుధ, ప్రమోదిని, దివ్య శ్రీ, స్నేహ వంటి వారు ఉన్నంతలో మెప్పించారు.
 

టెక్నీషియన్ల పనితీరుః 
సినిమాకి ప్రధాన బలం మ్యూజిక్‌. శశాంక్‌ తిరుపతి అద్భుతమైన మ్యూజిక్‌ని అందించారు. పొయెటిక్‌ లిరిక్స్ తో, అంతేబాగా ఆకట్టుకునే మెలోడీ ట్యూన్లతో మంత్రముగ్దుల్ని చేశాడు. సినిమాని ఫీల్‌ గుడ్‌ మూవీగా మార్చడంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్రనే మెయిన్‌. కెమెరా వర్క్ కూడా బాగుంది. ప్రేమ్‌ సాగర్‌ ప్రతి ఫ్రేముని కలర్‌ఫుల్‌గా, కూల్‌గా చిత్రీకరించి కూల్‌ మూవీగా మార్చేశాడు. ఎడిటర్‌ జేసీ శ్రీకర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సిందే. సినిమాని బాగా కట్‌ చేయాల్సింది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. చిన్న సినిమా అయిన పెద్ద లుక్‌లో కనిపించేలా చేశారు. ఇక దర్శకుడు చిలుకూరి ఆకాష్‌ రెడ్డి మంచి పాయింట్‌ని ఎంచుకున్నాడు. బేసింగ్‌ ఇప్పుడు ఇలాంటి లవ్‌ స్టోరీస్‌ జనాలు ఇష్టపడటం లేదు. కానీ కొత్త తరహా పాయింట్‌తో ఆయన ఈ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది. స్లో నరేషన్‌ కాకుండా కాస్త స్పీడ్‌గా, మరింత ఫన్నీగా చేస్తే బాగుండేది. కానీ ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా మలచడంలో సక్సెస్‌ అయ్యాడు. 
 

ఫైనల్‌గాః  `అలనాటి రామచంద్రుడు` ఓ పొయెటిక్‌ లవ్‌ స్టోరీ. 
రేటింగ్‌ః 2.5

నటీనటులుః కృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మాజీ, వెంకటేష్‌ కాకుమాను, సుధ, ప్రమోదిని, చైతన్య గరికపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లి, స్నేహ మాధురి శర్మ తదితరులు. 

టెక్నీషియన్లుః 
బ్యానర్‌ః హైనివా క్రియేషన్స్ 
నిర్మాతలుః హైమావతి జడపోలు, శ్రీరామ్‌ జడపోలు
దర్శకుడుః చిలుకూరి ఆకాష్‌రెడ్డి
సంగీతంః శశాంక్‌ తిరుపతి
కెమెరాః ప్రేమ్‌ సాగర్‌
ఎడిటర్‌ః జే సీ శ్రీకర్‌
ఆర్ట్ః  రవీందర్‌ పి
పాటలుః చంద్రబోస్‌, రాకేందు మౌళి
 

click me!