ముందుగా నాణ్యమైన సోయా గింజలను ఎంపిక చేసుకుని వాటిలోని దుమ్ము, రాళ్లు, చెత్తను శుభ్రం చేస్తారు. సోయాబీన్స్‌లో సహజంగానే నూనె ఎక్కువగా ఉంటుంది. ఆ నూనెను తీసేశాక, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పిండి మిగులుతుంది. ఇదే మీల్ మేకర్ తయారీకి వాడతారు. ఈ నూనె లేని సోయా పదార్థాన్ని అవసరమైన సైజులో పిండిగా లేదా చిన్న పలుకులుగా మారుస్తారు.సోయా పిండిలో సరైన మోతాదులో నీళ్లు కలిపి, మిశ్రమాన్ని రెడీ చేస్తారు.
సోయా పిండిని మనం చూసే మెత్తటి, పీచు లాంటి సోయా చంక్స్‌గా మార్చే ముఖ్యమైన ప్రక్రియ ఎక్స్‌ట్రూషన్. ఈ మిశ్రమాన్ని ఒక ఎక్స్‌ట్రూడర్ మెషీన్‌లోకి పంపుతారు. అక్కడ వేడి, ఒత్తిడి వల్ల సోయా ప్రోటీన్ నిర్మాణం మారిపోయి, మాంసం లాంటి పీచు పదార్థం వస్తుంది. మెషీన్ నుంచి బయటకు వచ్చే పదార్థాన్ని చిన్న చిన్న ఉండలుగా, ముక్కలుగా కట్ చేస్తారు. తర్వాత వాటిని బాగా ఎండబెడతారు. దీనివల్ల తేమ పోయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎండిపోయిన సోయా చంక్స్‌ను చల్లార్చి, క్వాలిటీ చెక్ చేసి ప్యాక్ చేస్తారు.