దీని వెనక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. కర్ణి మాత సవతి కుమారుడు లక్ష్మణ్ నీట మునిగి మరణించినప్పుడు, అతడిని తిరిగి బతికించమని యమధర్మరాజును ఆమె వేడుకున్నారట. దానికి అంగీకరించిన యముడు.. కర్ణి మాత వంశానికి చెందిన మగ సంతానం ఎలుకల రూపంలో పునర్జన్మ ఎత్తేలా వరం ఇచ్చాడని స్థానికులు నమ్ముతారు. అందుకే, ఈ ఎలుకలను తమ పూర్వీకులుగా భావించి భక్తులు పూజిస్తారు. ఎలుకలు కొరికిన ప్రసాదాన్ని తినడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
తెల్ల ఎలుక కనిపిస్తే పంట పండినట్లే...
ఈ వేలాది ఎలుకల్లో తెల్ల ఎలుక కనిపించడం ఎంతో శుభ సూచికంగా భావిస్తారు. అవి కర్ణి మాత, ఆమె కుమారుల ప్రతి రూపాలని భక్తులు నమ్ముతారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఎలుకలకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. పొరపాటున ఎలుకకు ఏదైనా హాని జరిగితే, ప్రాయశ్చిత్తంగా బంగారు ఎలుకను సమర్పించాలి.
ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి?
రైలు, రోడ్డు మార్గం: బికనీర్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దేశ్‌నోక్ ఉంది. ఆలయానికి కిలోమీటర్ దూరంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది.
విమాన మార్గం: సమీప విమానాశ్రయం బికనీర్‌లోని నాల్ ఎయిర్‌పోర్ట్ (సుమారు 42 కిలోమీటర్ల దూరం).
ప్రవేశ రుసుము: ఆలయం ప్రతిరోజూ తెరిచి ఉంటుంది, ఎలాంటి ప్రవేశ రుసుము (Entry fee) లేదు.