
మన శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ ఎన్నో వ్యాధులతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే హృదయ సంబంధ వ్యాధులు, పరిధీయ ధమని వ్యాధి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిని పడతాం. ఈ అధిక కొలెస్ట్రాల్ ఎలాంటి లక్షణాలను చూపించదు. ఇతర అనారోగ్య సమస్యల మాదిరిగా కాకుండా.. దీనివల్ల వ్యక్తిలో కొన్ని సంకేతాలు మాత్రం కనిపిస్తాయి. అవేంటంటే..
కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం.. కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి అవసరమే. కానీ ఇవి సాధారణ స్థాయిలను మించిపోయినప్పుడే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కణ త్వచం, హార్మోన్లు ఏర్పడటానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఒక వ్యక్తికి కొలెస్ట్రాల్ ఉందా లేదా అని నిర్ణయించేటప్పుడు రెండు రకాల కొలెస్ట్రాల్ ను పరిగణలోకి తీసుకుంటారు. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు(ఎల్డిఎల్) . దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇకపోతే అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ నే మంచి కొలెస్ట్రాల్ అంటారు.
Triglycerides(రక్తప్రవాహంలో కనిపించే ఒకరకమైన కొవ్వుపదార్థం) శరీరం ద్వారా నిల్వచేయబడిన శక్తి వనరుగా ఉపయోగించబడతాయి. ఇవి ఉపయోగంలో లేనప్పుడు శరీరంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయి పెరుగుతుంది. దీంతో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
సాధారణ కొలెస్ట్రాల్ స్థాయి అంటే ఏమిటి.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు, అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంతో తెలుస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ లెవెల్ ప్రతి డెసిలీటర్ కు 70 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఎటువంటి ప్రమాద కారకాలు లేని వారు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల స్థాయిని డెసిలిటర్ కు 100 నుండి 130 మిల్లీగ్రాముల మధ్య సాధారణమైనదిగా పరిగణించవచ్చు.
హార్వర్డ్ నివేదిక ప్రకారం.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ల కొలెస్ట్రాల్ స్థాయి కూడా ముఖ్యమైనదే. 40 mg/dL కంటే తక్కువ ఉన్న వ్యక్తులు అథెరోస్క్లెరోసిస్, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ట్రైగ్లిజరైడ్ స్థాయి 150 mg/dL కంటే తక్కువగా ఉంటుంది.
మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి.. మీకు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నాయో.. లేవో తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. ఒకటి.. జన్యుకారకాలు, రెండోది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
ఈ అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతక వ్యాధులకు దారితీసే వరకు ఎలాంటి లక్షణాలను చూపదనేది వాస్తవం. అందుకే తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి దారితీస్తుంది. అయితే ఈ సమయంలో మనకు కొన్ని సంకేతాల కనిపిస్తాయి. వాటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గమనించాల్సిన సంకేతాలు..
ఛాతి నొప్పి
వికారం
మాట్లాడటంలో ఇబ్బంది
రక్తపోటు, అలసట
ప్రమాద కారకాలు ఏంటి.. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఈ ప్రమాదం 45 నుంచి 55 ఏండ్లు పైబడిన స్త్రీ, పురుషులు, Menopauseతో బాధపడుతున్న మహిళలు, కరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్న మహిళలు, అకాల కరోనరీ ఆర్టరీ వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర ఉన్న మహిళలకు ప్రమాదం ఎక్కువగా ఉంది.
కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాలంటే మీ జీవనశైలిలో మార్పులు రావాలి. శారీరక శ్రమ, ఆహారం వంటివి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.