మరీ ఎక్కువ గుడ్లు తింటే జరిగేది ఇదే..
జీర్ణవ్యవస్థపై భారం: గుడ్లలో ప్రోటీన్లు , కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని ఒకేసారి మోతాదుకు మించి తింటే, శరీరం వాటిని పూర్తిగా జీర్ణం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, అసౌకర్యంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
శరీరంలో వేడి చేయడం: ఆయుర్వేద , సాంప్రదాయ ఆరోగ్య సూత్రాల ప్రకారం, గుడ్లు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల కొందరిలో మొటిమలు రావడం, చర్మంపై దద్దుర్లు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.
పోషక విలువల అసమతుల్యత: కేవలం గుడ్ల మీదే పూర్తిగా ఆధారపడితే శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన పీచు పదార్థం (fiber), విటమిన్ సి వంటి ఇతర కీలక పోషకాలు అందవు. ఇది దీర్ఘకాలంలో పోషకాహారలోపానికి లేదా అసమతుల్యతకు దారితీస్తుంది.
గుండె ఆరోగ్యంపై ప్రభావం: గుడ్డులోని తెల్లసొన ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినప్పటికీ, పచ్చసొనలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు లేదా హై కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి గుండెపోటు ముప్పు పెరుగుతుంది.
బరువు పెరిగే అవకాశం: గుడ్లను మితంగా తింటే బరువు తగ్గేందుకు సహాయపడతాయి. కానీ వాటిని నూనెలు, వెన్న, చీజ్ వంటి అధిక క్యాలరీలు ఉండే పదార్థాలతో కలిపి అధికంగా తింటే బరువు తగ్గడానికి బదులుగా వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
గుడ్లు నిజంగానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే, మీ శరీర తత్వానికి తగినట్లుగా మితంగా తిన్నప్పుడే వాటి ద్వారా పూర్తి పోషకాలు అందుతాయి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా, ఏది ఎక్కువైనా అనర్థమే కాబట్టి గుడ్లను కూడా పరిమితంగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రోజుకి 2 లేదా 3 కి మించి తినకపోవడమే మంచిది.