
ఎవరైనా సరే ఒక టాటూ వేయించుకున్నారంటే.. అది అందం కోసం మాత్రమే కాదు. ప్రతి టాటూ వెనుక ఓ జ్ఞాపకం, ఫీలింగ్ లేదా ఒక చిన్న కథ కచ్చితంగా ఉంటుంది. కొందరు తమకు ఇష్టమైన వారి గుర్తుగా టాటూ వేయించుకుంటారు. మరికొందరు తమ కాన్ఫిడెన్స్ చూపించడానికి, లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకోవడానికి వేయించుకుంటారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పాపులర్ టాటూల అర్థాలు ఇక్కడ తెలుసుకుందాం.
జీవితం ముగిసిపోయిందని అనుకునే టైమ్‌లో కూడా జర్నీ ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి ఈ సెమికోలన్ టాటూను ఒక సింబల్‌గా వాడతారు. ఒక వాక్యం ముగియకుండా ఎలాగైతే ముందుకు వెళ్తుందో.. జీవితంలో కూడా సవాళ్లను దాటుకుని కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టొచ్చనే నమ్మకాన్ని ఇది చూపిస్తుంది. ముఖ్యంగా, మానసిక ధైర్యం, నమ్మకం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనను ఎప్పుడూ గుర్తుచేసుకోవాలనుకునే వాళ్లు ఈ టాటూను ఎంచుకుంటారు. ఇది చిన్న సింబల్ అయినా.. "నా కథ ఇంకా ముగియలేదు" అనే బలమైన మెసేజ్‌ను ఈ సెమికోలన్ టాటూ ఇస్తుంది.
చేతికి కడియం వేసుకున్నట్లుగా.. భుజం లేదా ముంజేతి చుట్టూ గుండ్రంగా వేసే టాటూనే ఈ ఆర్మ్ బ్యాండ్ టాటూ. ఇది బలం, ఐకమత్యం, ధైర్యం, జీవితంలో ముఖ్యమైన వ్యక్తితో ఉన్న బంధాన్ని సూచిస్తుంది. కొందరు తమ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు గుర్తుగా కూడా దీన్ని వేయించుకుంటారు.
చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే సూర్యుడిలా.. జీవితంలో కూడా నమ్మకంతో ముందుకు సాగాలనుకునే వాళ్లకు ఈ సూర్యుడి టాటూ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. సూర్యుడు ఎప్పుడూ ఎనర్జీ, నమ్మకం, బలం, కొత్త ఆరంభానికి ప్రతీకగా కనిపిస్తాడు. జీవితంలో పాజిటివ్ ఆలోచనలతో ఉండాలనుకునే వాళ్లు, తమలోని కాన్ఫిడెన్స్, ధైర్యాన్ని చూపించాలనుకునే వాళ్లు ఈ టాటూను సెలెక్ట్ చేసుకోవచ్చు.
బాణం ఎప్పుడూ ఒక నిర్ధిష్టమైన దిశలో వెళ్తున్నట్లుగానే.. ఈ టాటూ కూడా లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రయత్నం, ఎదుగుదల, పట్టుదలను సూచిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ముందుకు వెళ్లాలనుకునే వాళ్లు ఈ టాటూను ఎంచుకోవచ్చు. బాణం టాటూ అంటే లక్ష్యం వైపు దూసుకెళ్లడం, ఫోకస్‌తో ముందుకు సాగడం, అడ్డంకులను దాటడం లాంటి అర్థాలు వస్తాయి. కొందరు తమ జీవిత లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉండేందుకు, తాము ఎంత దూరం ఎదిగామో గుర్తుచేసుకునేందుకు ఈ టాటూ వేయించుకుంటారు.
ప్రేమ, ఆప్యాయత, సాన్నిహిత్యం.. ఇలా మనసుకు నచ్చిన బంధాల జ్ఞాపకాలను ఎప్పుడూ తమతోనే ఉంచుకోవాలనుకునే వాళ్లు ఈ హార్ట్ షేప్ టాటూను ఎంచుకుంటారు. పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా జీవితంలో ముఖ్యమైన వాళ్లపై ప్రేమను చూపించడానికి కూడా ఈ టాటూ ఉపయోగపడుతుంది. స్మాల్ హార్ట్, డబుల్ హార్ట్, పేరు రాసి ఉన్న హార్ట్.. ఇలా చాలా డిజైన్లలో ఉండే ఈ టాటూ చూడటానికి సింపుల్‌గా ఉన్నా, దీని వెనుక చాలా లోతైన ఫీలింగ్స్ ఉంటాయి.
జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఒకరోజు మనం కూడా అందంగా రెక్కలు విప్పుకుని ఎగరగలమని గుర్తుచేసే అందమైన సింబల్ ఈ బటర్‌ఫ్లై టాటూ. గొంగళిపురుగుగా మొదలై.. రంగురంగుల సీతాకోకచిలుకగా మారే దాని జీవిత చక్రం, మార్పును, కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. జీవితంలో కష్టకాలాన్ని దాటుకుని వచ్చిన వాళ్లు, పాత బాధలను వదిలేసి కొత్త దారిలో ప్రయాణించాలనుకునే వాళ్లు ఈ టాటూను ఎంచుకోవచ్చు. స్వేచ్ఛగా బతకాలనే ఆలోచనను, కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లాలనే కోరికను ఇది చూపిస్తుంది.
సింహం ఎప్పుడూ బలం, ధైర్యం, లీడర్షిప్ క్వాలిటీస్‌కి సింబల్‌గా కనిపిస్తుంది. జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండాలి అనుకునే వాళ్లు ఈ టాటూను ఎంచుకోవచ్చు. తమలోని లీడర్షిప్ స్కిల్స్, పట్టుదలను బయటపెట్టాలనుకునే వాళ్లకు కూడా ఇది పర్ఫెక్ట్ డిజైన్‌గా ఉంటుంది.
అంతులేని ప్రేమ, ఎప్పటికీ మారని స్నేహం, కాలం దాటినా కొనసాగే బంధం.. ఇలా లోతైన ఫీలింగ్స్‌కి సింబల్ ఈ ఇన్ఫినిటీ టాటూ. ఈ సింబల్.. ముగింపు లేని ప్రయాణాన్ని, కొనసాగింపును సూచిస్తుంది. కేవలం ప్రేమ బంధాలే కాదు.. కుటుంబంపై ఆప్యాయత, స్నేహం, జీవితంలో ఎప్పటికీ నిలిచిపోవాలనుకునే ప్రామిస్‌లకు గుర్తుగా చాలామంది ఈ టాటూను ఎంచుకుంటారు. పేరుతో కలిపి ఉండే ఇన్ఫినిటీ, హార్ట్‌తో కలిసిన డిజైన్, ఫెదర్స్తో ఉండే డిజైన్.. ఇలా చాలా రకాలుగా దీన్ని వేయించుకోవచ్చు.
ఓటమికి కుంగిపోకుండా.. బూడిదలోంచి మళ్లీ ప్రాణం పోసుకుని లేచే పక్షిగా ఈ ఫీనిక్స్ను చెబుతారు. ఇది పునర్జన్మ, నమ్మకం, పట్టుదలను సూచిస్తుంది. కష్టమైన అనుభవాలను దాటుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకునే వాళ్లకు ఈ టాటూ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. కింద పడినా మళ్లీ పైకి లేవగలం అని ఈ టాటూ గుర్తుచేస్తుంది.
ఫెదర్ టాటూ సాధారణంగా స్వేచ్ఛ, ప్రశాంతమైన మనసు, నమ్మకం, తమకంటూ ఒక దారిని ఎంచుకునే ఆలోచనతో ముడిపడి ఉంటుంది. కొందరు తమ జీవితంలో కోల్పోయిన వారి జ్ఞాపకార్థం కూడా దీన్ని వేయించుకుంటారు. తమకు నచ్చిన జీవితాన్ని తామే ఎంచుకుని, డిఫరెంట్‌గా బతకాలనుకునే వాళ్లకు ఈ టాటూ పర్ఫెక్ట్గా ఉంటుంది.