Parenting: పిల్లలు అబద్ధాలు చెప్పడానికి 5 కారణాలు ఇవే! చాలామందికి తెలియదు

Published : Jul 07, 2026, 05:10 PM IST

Parenting: పిల్లలు అబద్ధం చెప్పడం ప్రతి పేరెంట్‌ను ఆందోళనకు గురిచేసే విషయం. అయితే పిల్లలు అబద్ధాలు చెప్పడం వెనుక ఎప్పుడూ చెడు ఉద్ధేశమే ఉండకపోవచ్చు. అసలు పిల్లలు అబద్ధాలు చెప్పడానికి కారణాలు ఏంటి? పేరెంట్స్ ఎలా స్పందించాలి? వంటి విషయాలు ఇక్కడ చూద్దాం.

PREV
16
పిల్లలు అబద్ధాలు చెప్పడానికి 5 కారణాలు

పిల్లలు ఎప్పుడైనా అబద్ధం చెప్తే చాలామంది తల్లిదండ్రులు వెంటనే కోప్పడతారు. ఎందుకు అబద్ధం చెప్పావు? అని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం, పిల్లలు అన్నిసార్లు చెడు ఉద్దేశంతోనే అబద్ధాలు చెప్తారని అనుకోవడం సరైంది కాదు. పిల్లలు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో అర్థం చేసుకుంటే, వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులకు సులభమవుతుంది. మరి పిల్లలు అబద్ధాలు చెప్పడానికి కారణాలేంటో చూద్దాం.

26
శిక్షిస్తారనే భయం

పిల్లలు అబద్ధాలు చెప్పడానికి ప్రధాన కారణాల్లో ఒకటి తల్లిదండ్రులు శిక్షిస్తారనే భయం. పిల్లవాడు పొరపాటున వస్తువు పగలగొట్టినా లేదా హోంవర్క్ పూర్తి చేయకపోయినా, నిజం చెప్తే తిడతారేమో, కొడతారేమో అనే భయంతో అబద్ధం చెప్పవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పిల్లవాడు తప్పును దాచడానికి ప్రయత్నిస్తాడు. నిపుణుల ప్రకారం, పిల్లలు నిజం చెప్పినప్పుడు వెంటనే కోపంతో స్పందించకుండా, ప్రశాంతంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అప్పుడు పిల్లల్లో నిజాయతీగా మాట్లాడే అలవాటు పెరుగుతుంది.

36
తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడం

కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి అబద్ధాలు చెబుతుంటారు. ముఖ్యంగా పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు ఏదో ఒక విషయం చెప్పి వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో వారు నిజంగా జరగని విషయాలను కూడా ఆసక్తికరంగా చెప్పవచ్చు. ఇలాంటి ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం ప్రేమ, శ్రద్ధ కావాలనే కోరిక కావచ్చు. అందుకే పిల్లల మాటలను పూర్తిగా కొట్టిపారేయకుండా, వారితో మాట్లాడేందుకు సమయం కేటాయించడం ముఖ్యం.

46
తప్పులను కప్పిపుచ్చుకోవడం

పిల్లలు కొన్నిసార్లు తప్పు చేశామని ఒప్పుకోరు. తమ వల్ల సమస్య వచ్చిందని ఒప్పుకుంటే తల్లిదండ్రులు నిరాశ చెందుతారనే భావనతో అబద్ధం చెప్పవచ్చు. కొందరు పిల్లలు ఏదైనా పని పూర్తి చేయకపోయినా.. చేశానని చెప్తుంటారు. ఇలాంటి సమయంలో పేరెంట్స్ పిల్లల తప్పును మాత్రమే చూడకుండా.. తప్పుల నుంచి నేర్చుకోవడం ముఖ్యమని పిల్లలకు వివరించాలి.

56
ఊహాశక్తి, వాస్తవం మధ్య తేడా తెలియకపోవడం

చిన్న వయసు పిల్లల్లో ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వారు తమ ఊహలను నిజమైన విషయాలుగా చెప్పే సందర్భాలు ఉంటాయి. తాను ఒక సూపర్ హీరోను కలిశానని లేదా ఏదో అద్భుతమైన విషయం జరిగిందని చెప్పవచ్చు. ప్రతి సందర్భాన్ని అబద్ధంగా భావించకూడదు. చిన్న పిల్లల ఆలోచనా విధానం పెద్దల కంటే భిన్నంగా ఉంటుంది. వారి వయసుకు అనుగుణంగా వాస్తవం, ఊహ మధ్య తేడాను నెమ్మదిగా వివరించాలి.

66
ఇతరుల ప్రభావం వల్ల

పిల్లలు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను త్వరగా అనుసరిస్తారు. ఇంట్లో పెద్దలు చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్పడం చూస్తే, పిల్లలు కూడా అదే సరైన పద్ధతి అని భావించే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు నిజాయతీకి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు వెంటనే అబద్ధాలకోరు అనడం మంచిది కాదు. అలాంటి పదాలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. పిల్లలతో ఓపికగా మాట్లాడటం, వారి సమస్యలను వినడం, నిజాయతీగా ఉన్నప్పుడు వారిని అభినందించడం మంచి ఫలితాలను ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories