
ఒకప్పుడైతే ఫ్రిజ్ ను లగ్జరీ వస్తువుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే సాధారణ వస్తువుగా మారిపోయింది. ఎండాకాలం, చలికాలం అంటూ తేడా లేకుండా ఫ్రిజ్ ను రోజూ వాడుతుంటారు. నిజానికి ఫ్రిజ్ ప్రతి సీజన్ లో అవసరమే. ఎందుకంటే ఇది ఫుడ్ ను ఎక్కువ సేపు తాజాగా ఉంచుతుంది.
ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. ఇదొక్కటే కాకుండా.. చాలా మందికి ఇదొక అలంకరణ వస్తువుగా కూడా మారింది. ఎలా అంటారేమో.. చాలా మంది ఫ్రిజ్ పైన ఎన్నో రకాల వస్తువులను పెట్టి డెకరేట్ చేస్తుంటారు. ఇది మీకు బాగా అనిపించొచ్చు. కానీ ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫ్రిజ్ పైన వేటిని పెట్టకూడదు?
కొన్ని మొక్కలను పెట్టొద్దు
ప్రతి ఒక్కరూ ఇంటిని మొక్కలతో అందంగా డెకరేట్ చేస్తుంటారు. ఇందుకోసం రకరకాల మొక్కలను, చెట్లను ఉపయోగిస్తారు. నిజానికి మొక్కలు ఇంటిని సహజంగా అందంగా కనిపించేలా చేస్తాయి. అలాగే అదృష్టాన్ని ఆకర్షిస్తాయి కూడా. ఇందుకోసం చాలా మంది బాల్కనీ, వరండాలో, హాల్లోనే కాకుండా ఫ్రిజ్ పైన కూడా రకరకాల మొక్కల్ని పెడుతుంటారు. కానీ వెదురు వంటి కొన్ని రకాల మొక్కల్ని ఫ్రిజ్ పైన అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ విద్యుదయస్కాంత క్షేత్రం దాని నుంచి వెలువడే సానుకూల శక్తిని తొలగిస్తుంది.
మందులను ఫ్రిజ్ పైన ఉంచొద్దు
ఇంట్లో ఎక్కడ పెట్టినా గుర్తుండవని మందులను, మందుల సీసాలను చాలా మంది ఫ్రిజ్ పైన పెట్టేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ మీరు వాడే మందులపై చెడు ప్రభావాన్నిచూపుతుంది. నిజానికి ఫ్రిజ్ లోపల నుంచి చల్లగా ఉంటుంది. అదే బయట వేడిగా ఉంటుంది. ఈ ఫ్రిజ్ వెచ్చదనం మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చేపల అక్వేరియంను పెట్టొద్దు
చాలా మంది ఇంటిని అందంగా మార్చడానికి ఫిష్ అక్వేరియంను ఇంట్లో పెడుతుంటారు. కొంతమంది వీటిని ఫ్రిజ్ పైనే పెట్టేస్తుంటారు. కానీ ఇలా పెట్టడం చేపల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఫ్రిజ్ లోని వేడి, విద్యుదయస్కాంత క్షేత్రం చేపల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సాధారణంగా ఫ్రిజ్ పైన పెట్టిన అక్వేరియంలోని చేపలు తొందరగా చనిపోతాయి. అందుకే అక్వేరియాన్ని ఫ్రిజ్ పైన అస్సలు పెట్టకూడదు.
ట్రోఫీలు, అవార్డులు పెట్టొద్దు
చాలా మంది ఫ్రిజ్ పైన ట్రోఫీలు, అవార్డులను పెడుతుంటారు. మీరు కూడా ఇలా చేస్తే వెంటనే దానిపైనుంచి తీసేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇది అశుభం. వీటిని ఫ్రిజ్ పైన పెడితే మీ సక్సెస్ మీది కాకుండా పోతుంది. వాస్తుతో పాటుగా లోహంతో చేసిన పెద్ద పెద్ద వస్తువులను ఫ్రిజ్ పైన పెడితే దానిలో అంతర్గత నష్టం జరుగుతుందట. అందుకే వీటిని ఫ్రిజ్ పైన పెట్టొద్దంటారు.
ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టకూడదు
రేడియో, టోస్టర్, మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఫ్రిజ్ పైన పెట్టకూడదు. మీరు గనుక ఈ చిన్న పొరపాటు చేస్తే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా తొందరగా పాడవుతాయి. నిజమేంటంటే? ఫ్రిజ్ కంప్రెసర్ నుంచి వచ్చే ప్రకంపనలు ఈ వస్తువుల అంతర్గత భాగాలను దెబ్బతీస్తాయి. అందుకే వీటిని ఫ్రిజ్ పైన పెట్టకూడదని చెప్తారు.