
మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు తగ్గి, మనుషులకు ఎలక్ట్రానికి గాడ్జెట్స్ తో విడదీయలేని సంబంధం ఏర్పడుతోంది. ముఖ్యంగా మనుషులకు, స్మార్ట్ ఫోన్లకు ఎవరూ విడదీయలేని బంధం ఏర్పడింది. ఈ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చాడు.
కరోనా మహమ్మారి రాకతో స్కూలు పిల్లలు సైతం వీటికి బాగా అలవాటైపోయారు. స్మార్ట్ ఫోన్ లేని నిమిషం ఒక యుగంలా గడుపుతున్నారు. కొందరికైతే ఈ స్మార్ట్ ఫోన్ లేనిదే పూట కూడా గడవదు. ఇది ఒక నిత్యవసర వస్తువులా మారిపోయిందంటే నమ్మండి.
రోజంతా తిండి , నీళ్లూ లేకుండానన్నా ఉంటారేమో గానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం అస్సలు ఉండరు. ఇది నమ్మలేని నిజం. ఎంతో మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారారు. ఈ సంగతి వాళ్లకు తెలియకపోయినా.. ఇదే నిజం. ఏప్రిల్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. కరోనా వచ్చినప్పటి నుంచి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి 81 శాతం మంది జనాలు వీడియో కాల్స్ ను ఉపయోగించారట.
81 శాతం మందిలో 40 శాతం జనాలు విడీయో కాల్స్ లో మాట్లాడి, వాడకం ఎక్కువయ్యి అలసిపోయారనీ సర్వే తేల్చి చెబుతోంది. ఇకపోతే 33 శాతం మంది ప్రజలు తాము ఫోన్ తో గడిపిన లేదా ఇంటర్నెట్ లో ఎంత సేపు గడిపామో తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టు సర్వే పేర్కొంటోంది.
స్మార్ట్ ఫోన్ వాడకం అంత బ్యాడ్ హాబిట్ ఏమీ కాదు. ఫోన్లు వ్యక్తుల మధ్య బంధాలను పెంచుతాయి. ఎన్నో విధాలుగా మనల్ని స్మార్ట్ ఫోన్లు సంతోషపెడుతుంది. కానీ అతిగా ఏది చేసినా.. ఏదీ వినాశనానికి దారి తీస్తుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్లను కూడా ఒక సమయం వరకే ఉపయోగించాలి. లేదంటే ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాట్సాప్, టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, షేర్ చాట్ వంటి యాప్ లను తరచుగా చూసే అలవాటును క్రమ క్రమంగా మానుకోండి. మితిమీరిన స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల మీతో పాటుగా అవతలి వ్యక్తులను కూడా ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా మిమ్మల్ని చూసి అవతలి వ్యక్తులు కూడా ఫోన్ కు అలవాటయ్యే ప్రమాదం ఉంది. ఇది అస్సలు మంచి పద్దతి కాదు.
ఏవైనా అప్ డేట్స్ వస్తాయని అదే పనిగా ఫోన్ వంకే చూసే వారు డూమ్ స్క్రోలింగ్ సమస్యతో బాధపడుతున్నట్టుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల వారు ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందట. దీని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత ఆరోగ్యానికి మంచిదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరేం చేయాలి?
సోషల్ మీడియాను చూసే టైమింగ్స్ ను తగ్గించుకోవాలి. అంటే రోజుకు ఎక్కువ సమయం సోషల్ మీడియాను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఉదయం లేచినప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్లను చెక్ చేయడం, చూడటం మానుకోండి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యం ముఖ్యం.. యోగా, వ్యాయామం వంటివి ప్రతి రోజూ చేయండి. వీటి వల్ల మీరు ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. వీటివల్ల మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.
స్టాప్ టెక్నిక్..మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడుతున్నాను అనిపిస్తే వెంటనే స్టాప్ అని గట్టిగా అరవడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మీ మెదడుకి ఇక ఫోన్ చూసింది చాలు అన్న సందేశం చేరుతుంది. దాంతో మీరు ఫోన్ ను ఎక్కువ సేపు చూడలేరు.
చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వకండి. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లలో అంధతర్వం వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఫోన్లు ఇస్తూ వారిని గుడ్డి వారిని చేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లను దగ్గరినుంచి చూసి చూసి దూరంగా ఉండే వస్తువులను చూడలేకపోతున్నారని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఫోన్ లైటింగ్ వల్ల వారి చూపు దెబ్బతింటుందట. కాబట్టి ఇకనుంచి పిల్లలకు ఫోన్లను అస్సలు ఇవ్వకండి.