Colour of Gold: బంగారం పసుపు రంగులో అందంగా మెరిసిపోతుంది. బంగారానికి అంత చక్కటి రంగు ఎలా వచ్చింది? ఆ మెరుపు వెనుక కారణం ఏమిటి? దీనికి సైన్సు పరంగా చాలా విషయాలు చెప్పుకోవాలి.
బంగారం ఇప్పుడు అత్యంత విలువైన లోహం. పసుపు రంగులో మెరిసిపోతుంది కాబట్టే పసిడి అని కూడా పిలుచుకుంటాము. వెండి బూడిద రంగులో మెరిస్తే, బంగారం పసుపు రంగులో ఉంటుంది. రోజురోజుకీ బంగారంపై పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం వస్తువు పెట్టుకుంటే చాలు ఎంతో కళగా కనిపిస్తారు. అసలు బంగరానికి చక్కటి పసుపు రంగు ఎలా వచ్చింది?
24
రంగు వెనుక సైన్స్
సైన్స్ ప్రతి విషయానికి ఒక మూలాన్ని కనిపెడుతుంది. అలా బంగారం రంగును కూడా తేల్చింది. సైన్సు చెబుతున్న ప్రకారం ఒక వస్తువు రంగు.. అది ఏ కాంతి తరంగాలను వెనక్కి పంపిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. తెల్లటి వస్తువుపై సూర్యరశ్మి పడినప్పుడు అది కొన్ని రంగులను పీల్చుకుని, మరికొన్నింటిని వెనక్కి పంపిస్తుంది. అలా వెనక్కి వచ్చిన కాంతి మన కళ్లకు చేరినప్పుడు, మెదడు దాని రంగును గుర్తిస్తుంది. అలా ఒక వస్తువు రంగు మన కంటికి కనిపిస్తుంది.
34
నీలం, ఊదా రంగులను పీల్చుకుని..
వెండి, అల్యూమినియం వంటి చాలా లోహాలు తమపై పడిన కాంతిలోని అన్ని రంగులను వెనక్కి పంపిస్తాయి. అందుకే అవి తెల్లగా లేదా వెండి రంగులో కనిపిస్తాయి. కానీ బంగారం అలా కాదు. తనపై కాంతి పడినప్పుడు అందులోని నీలం, ఊదా రంగు కాంతిని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఎరుపు, నారింజ, పసుపు రంగులను మాత్రం మన కళ్ల వైపునకు పంపిస్తుంది. ఆ మూడు రంగుల కలయిక వల్ల మన కంటికి బంగారానికి పసుపు రంగులో కనిపిస్తుంది.
బంగారం అటామిక్ నంబర్ 79. ప్రతి బంగారు అణువు కేంద్రకంలో 79 ప్రోటాన్లు ఉంటాయి. ఈ కేంద్రకం చాలా బరువుగా ఉండటం వల్ల, దాని దగ్గరలో ఉన్న ఎలక్ట్రాన్లు బలమైన ఆకర్షణకు లోనవుతాయి. ఈ లోపలి ఎలక్ట్రాన్లు కాంతి వేగంలో సగం వేగంతో, అంటే చాలా వేగంగా తిరుగుతుంటాయి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, అత్యధిక వేగంతో కదిలే కణాల ద్రవ్యరాశి పెరిగినట్లుగా ప్రవర్తిస్తాయి. దీనివల్ల బంగారు అణువులోని లోపలి ఎలక్ట్రాన్ కక్ష్యలు కొద్దిగా కుంచించుకుపోయి, కేంద్రకానికి మరింత దగ్గరగా కదులుతాయి. ఈ మార్పు వల్ల ఎలక్ట్రాన్లు వేర్వేరు శక్తి స్థాయిల మధ్య మారడానికి అవసరమైన శక్తిలో కూడా మార్పు వస్తుంది. ఇదే బంగారం రంగుకు అసలు కారణం.