Mutton Masala: మటన్ కి అదిరిపోయే టేస్ట్ ఇచ్చే మసాలా పొడి.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు!

Published : Nov 14, 2026, 02:24 PM IST

Mutton Masala: మటన్ కూర, ఫ్రై, బిర్యానీ లాంటి వంటకాలకు మంచి రుచి, వాసన తెచ్చేది మసాలా పొడి. చాలామంది మటన్ మసాలాను బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ మసాలాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైగా ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా..

PREV
15
మటన్ మసాలా పొడి

మటన్ కూర అనగానే ముందుగా దాని వాసన, మసాలా రుచే మనకు నోరూరిస్తాయి. హోటళ్లలో దొరికే మటన్ కర్రీ, మటన్ ఫ్రై, గ్రేవీ ఎందుకంత రుచిగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ప్రధాన కారణం వాళ్లు వాడే మసాలా పొడులే. బయట మార్కెట్లో దొరికే రెడీమేడ్ మసాలాలు కొనే బదులు, ఇంట్లోనే నాణ్యమైన దినుసులతో అసలైన మటన్ మసాలాను మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే మటన్ కూర నుంచి ఫ్రై వరకు అన్నింటికీ వాడుకోవచ్చు. మరి ఈ మసాలా పొడిని ఇంట్లోనే సులువుగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

25
మటన్ మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు
  • ధనియాలు - 1/2 కప్పు
  • ఎండు మిర్చి - 12–15
  • జీడిపప్పు - 10
  • మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
  • బియ్యం - 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • మిరియాలు - 2 టీస్పూన్లు
  • జీలకర్ర - 2 టీస్పూన్లు
  • సోంపు - 2 టీస్పూన్లు
  • గసగసాలు - 1 టీస్పూన్
  • లవంగాలు - 6
  • దాల్చినచెక్క - 2 చిన్న ముక్కలు
  • యాలకులు - 4
  • అనాస పువ్వు - 1
  • బిర్యానీ ఆకు - 1
  • జాపత్రి - 1 చిన్న ముక్క
  • మరాఠీ మొగ్గ - 2
  • కల్పాసి (బండపువ్వు) - కొద్దిగా
  • కసూరి మేతి - 1 టీస్పూన్
  • పసుపు - 1 టీస్పూన్
  • కల్లుప్పు - తగినంత
35
తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. అందులో ధనియాలు, ఎండు మిర్చి వేసి సన్నని మంట మీద దోరగా వేయించాలి. మసాలా దినుసులు మాడిపోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వాటన్నింటినీ ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో జీడిపప్పు, మినప్పప్పు, బియ్యం, శనగపప్పు వేయాలి. వీటిని సన్నని మంట మీద బాగా వేయించాలి. పప్పుల రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి.

45
మసాలా దినుసులు వేయించడం

ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు, లవంగాలు, చెక్క, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బండపువ్వు, కసూరి మేతిని కడాయిలో వేయాలి. వీటిని తక్కువ మంట మీద కాసేపు వేయించాలి. మసాలా దినుసుల నుంచి మంచి సువాసన రాగానే స్టవ్ ఆపేయాలి. వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ ఒక వెడల్పాటి ప్లేట్‌లో పోసి ఆరబెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారాకే మిక్సీ పట్టాలి. వేడిగా ఉన్నప్పుడే రుబ్బితే తేమ చేరి పొడి నాణ్యత దెబ్బతింటుంది.

మసాలా దినుసులు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేయాలి. అందులో పసుపు, తగినంత కల్లుప్పు కలపాలి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి.

55
నిల్వ చేసే విధానం

మిక్సీ పట్టిన మసాలా పొడిని ఒక ప్లేట్‌లో పోసి కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఎటువంటి తేమ లేని, గాలి చొరబడని శుభ్రమైన గాజు సీసాలో లేదా పొడి డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. మటన్ కూర ఉడుకుతున్నప్పుడు ఈ మసాలాను తగినంత వేస్తే మంచి వాసన, రుచి వస్తాయి.

ఈ విషయాలు మర్చిపోవద్దు

మసాలా దినుసులను పెద్ద మంట మీద వేయించకూడదు. మాడిపోతే పొడి చేదుగా మారుతుంది. ప్రతి దినుసును దాని స్వభావాన్ని బట్టి విడివిడిగా వేయించడం మంచిది. కసూరి మేతి ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చే అవకాశం ఉంటుంది. మసాలా దినుసులు పూర్తిగా చల్లారాకే మిక్సి పట్టాలి. తడి గరిటెతో మసాలాను తీయకూడదు. మసాలా పొడిని ఎండ, పొయ్యి వేడి, తేమ తగలని చోట ఉంచాలి.

ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?

ఇంట్లో చేసిన మటన్ మసాలా పొడిని గాలి చొరబడని పొడి డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకుంటే 1-2 నెలల పాటు దాని సువాసన నిలిచి ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచే బదులు, కొద్ది కొద్దిగా అప్పటికప్పుడు తాజాగా చేసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories