మనలో ప్రతి ఒక్కరూ శరీర శుభ్రత గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ కొన్ని అవయవాలను క్లీన్ చేయడం మాత్రం మర్చిపోతుంటారు. వీటిలో చెవులు ఒకటి. నిజానికి మన చెవులు ప్రత్యేక అవయవాలు. శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే చెవులను కూడా క్లీన్ చేయడం చాలా ముఖ్యం. సరిగ్గా క్లీన్ చేయకపోతే చెవిటితనం నుంచి మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చెవిలో గులిమి పేరుకుపోవడం సాధారణ విషయం. ఇది మన చెవుల్లోకి హానికారకమైన బ్యాక్టీరియా, ఇతర క్రిములు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. కానీ దీనిని సమయానికి శుభ్రపరచడం కూడా చాలా ముఖ్యం. దాని పరిశుభ్రతపై శ్రద్ధ వహించకపోతే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చెవుల్లోని గులిమిని ఎలా తీయాలో మనం తెలుసుకుందాం పదండి.
నూనె వాడకం
నూనె వాడకం చెవికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం రాత్రిపూట ఆవాలు, బాదం లేదా కొబ్బరి నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి చెవిలో కొన్ని చుక్కలు వేయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి. మీ చెవిని ఒంపి నూనెను బయటకు తీయండి. ఇది మీ చెవుల్లోని గులిమిని, మురికిని బయటకు తీయడానికి సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని దానిని కొన్ని నీటిలో వేసి చెవిలో కొన్ని చుక్కలు వేయండి. దీన్ని కాసేపు చెవిలో ఉంచి తర్వాత బయటకు తీయండి. చెవిని శుభ్రపరచడంలో వెనిగర్ వాడకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కానీ దీనిని ఉపయోగించే ముందు వైద్యుడిని ఖచ్చితంగా సంప్రదించాలి.
బేబీ ఆయిల్
గులిమిని బయటకు తీయడంలో, చెవులను శుభ్రం చేయడానికి మీరు బేబీ ఆయిల్ ను కూడా ఉపయోగించొచ్చు. కొన్ని చుక్కల బేబీ ఆయిల్ ను చెవుల్లో వేసి కాటన్ సాయంతో మూసేసి 5 నిమిషాల తర్వాత దూదిని తీసేయండి. దీనివల్ల గులిమి అదే బయటకు వస్తుంది.
బేకింగ్ సోడా
మీరు బేకింగ్ సోడాను ఉపయోగించి కూడా చెవులను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం చిటికెడు బేకింగ్ సోడాను తీసుకుని అరగ్లాసు నీటిలో కలపండి. ఇప్పుడు దీన్ని డ్రాపర్ సహాయంతో చెవిలో వేయండి. 15 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత మీ తలను ఒక వైపుకు వంచండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని గులిమిని, నీటిని రెండింటినీ శుభ్రం చేయండి.