ప్రయాణికుల రైలు కాదు...
రైలు నడపడం అంటే అంత ఈజీ కాదు కదా.. మరి.. అలా ఎలా ఎవరికి పడితే వాళ్లకు ఇస్తారు అనే అనుమానం మీకు రావచ్చు. కానీ, ఇది ప్రయాణికులు ప్రయాణించే రైలు కాదు. ఇది కేవలం ‘మినీచర్ ట్రైన్’. కేవలం... ట్రైన్ నడపాలి అనే అనుభవం కోసం సరదాగా తీసుకువచ్చిన ప్రయత్నం ఇది. ఈ లోకో మోటివ్ ను కేవలం 300 మీటర్ల ట్రాక్ పై మాత్రమే నడపగలరు. ఈ రైలులో ఎక్కువ మంది ఎక్కడానికి కూడా ఉండదు. కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణించగలరు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. నిజమైన రైలులో ఉండేలా డ్రైవర్‌కు స్పీడోమీటర్ , బ్రేక్ ప్రెజర్ గేజ్ సౌకర్యం లభిస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, జపాన్ రైల్వే నిబంధనలను తెలుసుకుంటూ ప్రయాణికుల భద్రతను డ్రైవర్లు ఎలా కాపాడుతారో నేర్చుకోవడానికి చక్కటి అవకాశం.
రైలు నడపాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
సైతామాలోని రైల్వే మ్యూజియంలో మినీ రైలును నడపాలనుకునేవారు ముందుగానే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవడం మంచిది. దీనికి విపరీతమైన ఆదరణ ఉండటంతో స్లాట్లు త్వరగా నిండిపోతాయి. మ్యూజియం అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మ్యూజియం రాఫిల్ యాప్ ద్వారా బుకింగ్ లేదా రాఫిల్ కోసం ప్రయత్నించవచ్చు. మీరు ఈ ట్రైన్ డ్రైవ్ చేయాలి అంటే... రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం మ్యూజియం చూడాలి అనుకుంటే... రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
మ్యూజియంలో ముఖ్యమైన విషయాలు...
ఈ మ్యూజియం మొత్తం ఐదు వేర్వేరు స్టేషన్‌లుగా విభజించి ఉంటారు. 'రోలింగ్ స్టాక్ స్టేషన్'లో చరిత్రాత్మక రైళ్లను దగ్గరగా చూడవచ్చు. 'సైన్స్ స్టేషన్' రైళ్లు పనిచేసే విధానాన్ని, 'జాబ్ స్టేషన్' వివిధ రైల్వే ఉద్యోగాలు , భద్రతా కార్యకలాపాలను పరిచయం చేస్తాయి. అలాగే 'హిస్టరీ స్టేషన్' జపాన్ రైల్వే చరిత్రను వివరిస్తే, 'ఫ్యూచర్ స్టేషన్' భవిష్యత్తులో రైల్వే ప్రయాణాల అభివృద్ధిని కళ్లకు కడుతుంది.