Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. కానీ గుండు వల్ల జుట్టు కుదుళ్లలో నిజంగా ఎలాంటి మార్పు వస్తుంది? అసలు జుట్టు పెరుగుదలకి, గుండుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
జుట్టు పలుచగా ఉందని, ఒత్తుగా పెరగాలని చాలామంది గుండు చేయించుకుంటూ ఉంటారు. గుండు తర్వాత జుట్టు మునుపటి కంటే ఒత్తుగా, బలంగా పెరిగినట్లు అనిపించడం సహజమే. కానీ, గుండు చేయడం వల్ల జుట్టు అసలు మందం, సాంద్రత లేదా పెరిగే వేగం నిజంగా మారుతుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా గుండు చేసినప్పుడు మన తల చర్మం పైన ఉన్న జుట్టును మాత్రమే తీసేస్తాం. దానివల్ల జుట్టు కుదుళ్లలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి, గుండు చేస్తే జుట్టు ఎక్కువగా పెరుగుతుందని అనుకోవడం కరెక్ట్ కాదని నిపుణులు సూచిస్తున్నారు.
24
గుండు తర్వాత జుట్టు ఎందుకు కాస్త ఒత్తుగా కనిపిస్తుంది?
సహజంగా పెరిగే జుట్టు కొనలు మృదువుగా, సన్నగా ఉంటాయి. కానీ, గుండు చేసినప్పుడు బ్లేడ్ లేదా రేజర్‌తో జుట్టును నేరుగా కట్ చేస్తారు. ఇలా కట్ అయిన మొండి కొనలతో జుట్టు మళ్లీ పెరగడం మొదలైనప్పుడు, అది మామూలు మృదువైన కొనల కంటే లావుగా, గరుకుగా అనిపిస్తుంది. దీనివల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతున్న భ్రమ కలుగుతుంది. నిజానికి, ఇది జుట్టు అసలు మందాన్ని పెంచదు. మీ జుట్టు మళ్లీ పొడవుగా పెరిగాక, ఆ ఒత్తుగా కనిపించే రూపం క్రమంగా తగ్గిపోతుంది.
34
కుదుళ్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
మన తలపై చర్మానికి పైన కనిపించే భాగాన్ని హెయిర్ షాఫ్ట్ అంటారు. జుట్టు పుట్టే వేరు భాగాన్ని హెయిర్ ఫోలికల్ అంటారు. ఈ కుదుళ్లు చర్మం కింద లోతుగా ఉంటాయి. గుండు చేసే ప్రక్రియ చర్మం పైపైన ఉన్న జుట్టు కాండాన్ని మాత్రమే తొలగిస్తుంది. కుదుళ్లను ప్రభావితం చేయదు. దీనివల్ల కొత్త కుదుళ్లు ఏర్పడటం గానీ, ఉన్న కుదుళ్ల పనితీరు అకస్మాత్తుగా పెరగడం గానీ జరగదు. జుట్టు పెరిగే వేగం కూడా అలాగే ఉంటుంది. ఈ తేడాను అర్థం చేసుకుంటే, గుండుపై ఉన్న అపోహలు తొలగిపోతాయి.
జుట్టు రాలడానికి జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, పోషకాహార లోపం, కొన్ని వ్యాధులు, మందులు వంటి అనేక కారణాలుంటాయి. గుండు చేయించుకుంటే జుట్టు మళ్లీ ఒత్తుగా పెరుగుతుంది అనుకుని, జుట్టు రాలే సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. మీ జుట్టు అకస్మాత్తుగా ఎక్కువగా రాలుతున్నా లేదా కొన్నిచోట్ల బట్టతల వస్తున్నా, వెంటనే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.