పిల్లలు, పెంపుడుజంతువులు ఒకే బెడ్ మీద పడుకుంటున్నారా?.. అది మంచిదేనట..

First Published | Jun 8, 2021, 2:56 PM IST

పెంపుడు జంతువులతో బెడ్ షేర్ చేసుకోవడం అంత మంచి ఆలోచన కాదని పెద్దలు తరచుగా చెబుతుంటారు. దీనివల్ల అలెర్జీలు, నిద్రాభంగం, ఆరోగ్య సమస్యలు వస్తాయని వారిస్తారు. 

పెంపుడు జంతువులతో బెడ్ షేర్ చేసుకోవడం అంత మంచి ఆలోచన కాదని పెద్దలు తరచుగా చెబుతుంటారు. దీనివల్ల అలెర్జీలు, నిద్రాభంగం, ఆరోగ్య సమస్యలు వస్తాయని వారిస్తారు.
అయితే తాజా అధ్యయనం పెంపుడు జంతువులతో బెడ్ షేర్ చేసుకునే పిల్లలు.. మామూలుగా ఒంటరిగా పడుకునే పిల్లలకంటే హాయిగా, గాఢంగా నిద్రపోతారని తేల్చేసింది.

ఈ అధ్యయనం ఫలితాలు 'స్లీప్' పత్రికలో ప్రచురించబడ్డాయి. పెంపుడు జంతువుతో కలిసి పడుకోవడం నిద్రాభంగానికి దారి తీయదు.. అని ఈ అధ్యయన కర్త పీహెచ్‌డీ విద్యార్థి హిల్లరీ రోవ్ అంటున్నారు.
అంతేకాదు రోజంతా కుక్కపిల్లతోనో, పిల్లిపిల్లతోనో ఆడుకునే పిల్లలు రాత్రి వాటితో పాటు పడుకుంటే చక్కగా ఏ టెన్షన్ లేకుండా.. గాఢంగా నిద్ర పోతున్నారని... రోవ్ తెలిపారు.
ఈ అధ్యయనానికి కెనడియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ నిధులు సమకూర్చింది. రోవ్ తో పాటు పిపిహెచ్‌పి పరిశోధకులు డెనిస్ జారిన్, నెరెస్సా నోయెల్, జోవాన్ రామిల్, సైకాలజీ ప్రొఫెసర్, ప్రయోగశాల డైరెక్టర్ జెన్నిఫర్ మెక్‌గ్రాత్‌లు సంయుక్తంగా ఈ పేపర్ ను ప్రిపేర్ చేశారు.
ఇలా పెంపుడు జంతువులతో కలిసి నిద్రించడం వల్ల చిన్నారుల్లో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుందని తేలింది. దీనికోసం వీరు కొంతమంది పిల్లలు, వారి తల్లిదండ్రులను ఎంపిక చేసి పరిశోధన చేశారు.
దీనికోసం వారి దినచర్య, నిద్ర వేళలు, శుభ్రత గురించిన ప్రశ్నలతో ఓ ప్రశ్నావళి తయారు చేశారు. అంతేకాదు ప్రతీరోజూ ఏ టైంకి నిద్రపోతారు, బెడ్ పరిశుబ్రత, ఒకే టైంకు పడుకోవడం, పడుకునేముందు ప్రశాంతంగా ఉండడం,నిశ్శబ్దమైన, సౌకర్యవంతమైన ప్రదేశంలో నిద్రించడంలాంటివాటిమీద ప్రశ్నలు అడిగారు.
ఇక రెండు వారాల పాటు పిల్లలకు చేతికి ఓ బ్యాండ్ లాంటిది వేసి.. దాని ద్వారా వారి నిద్రను.. అందులోని అలజడిని ట్రాక్ చేశారు. పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారి మెదడు తరంగాలను (ఇఇజి సిగ్నల్స్) రికార్డ్ చేయడానికి పరిశోధకులు ప్రత్యేకమైన హోమ్ పాలిసోమ్నోగ్రఫీ పరికరాన్ని కూడా అమర్చారు.
ఈ క్రమంలో మీరు మీ పెంపుడు జంతువులతో ఒకే మంచం మీద పడుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు.. ముగ్గురిలో ఒక చిన్నారి అవునని సమాధానం ఇవ్వడంతో అధ్యయనకారులు ఆశ్చర్యపోయారు.
అయితే, పెద్దవాళ్లు, యువత ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారు. "పెంపుడు జంతువుతో కలిసి పడుకోవడం చాలా మంది పిల్లలు చేస్తున్నది, ఇది వారి నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందో మాకు తెలియదు" అని రోవ్ తెలిపారు. దీనిమీద ఫోకస్ చేశారు.
పరిశోధకులు పిల్లలను తమ పెంపుడు జంతువుతో ఎంత తరచుగా నిద్రపోతున్నారనే దాని ఆధారంగా వారిని మూడు గ్రూపులుగా విడగొట్టి నిద్రను కొలిచారు. ఎప్పుడూ జంతువులతో పడుకోవడం, అప్పుడప్పుడు, అస్సలు పడుకోకపోవడంగా విభజించారు.
ఈ మూడు గ్రూపుల్లో విభిన్న శ్రేణి స్లీప్ వేరియబుల్స్‌తో పోల్చారు, వాటి మధ్య ఏదైనా ముఖ్యమైన తేడాలు ఉన్నాయా అని చూశారు.
దీంట్లో పెంపుడు జంతువుతో పడుకోవడం వల్ల నిద్ర మీద ప్రభావం చూపలేదని..ఇంకా చెప్పాలంటే ప్రశాంతమైన నిద్ర పోగలిగారని తేలింది.

Latest Videos

click me!