pimples
కౌమారదశలో శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. కానీ ఇవి టీనేజర్లకు ఎన్నో సమస్యలను తెచ్చి పెడతాయి. ముఖ్యంగా వీరిలో వచ్చే హార్మోన్ల మార్పులు వల్ల వారి మానసిక ఆరోగ్యం, శరీర నిర్మాణం, చర్మంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. దీనివల్ల మొటిమలు, నల్లమచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. అందుకే టీనేజర్లు తమ చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. మరి టీనేజర్లు ఎలాంటి చర్మ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొటిమలను తాకకూడదు
టీనేజర్లలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు, ముఖంపై మచ్చలు అవుతుంటాయి. ఇది చాలా కామన్. అందుకే దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది తెలియక మొటిమలు తొందరగా పోవాలని వాటిని గిల్లుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలా మొటిమలను తరచుగా తాకడం, గిచ్చడం వల్ల మచ్చలు అవుతాయి. అలాగే సంక్రమణ ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మొటిమలను అస్సలు తాకకండి.
ముఖాన్ని కడగడం
టీనేజర్లు కుదురుగా ఉండరు. అంటే స్కూల్, కాలేజ్, ట్యూషన్స్, ఫ్రెండ్స్ అంటూ ఎప్పుడూ ఏదో ఒక దగ్గరికి వెళుతూనే ఉంటారు. బయట ఎక్కువగా తిరగడం వల్ల ముఖంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల మొటిమలు ఏర్పడతాయి. అందుకే మీరు ఉదయం, రాత్రిపూట మైల్డ్ క్లెన్సర్ తో రోజుకు రెండుసార్లు ముఖాన్ని క్లీన్ చేయండి.
మాయిశ్చరైజర్, సన్స్క్రీన్
మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లు చర్మ సంరక్షణకు చాలా అవసరం. అందుకే వీటిని ఖచ్చితంగా మీ చర్మ సంరక్షణలో చేర్చండి. మాయిశ్చరైజర్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో చర్మం పొడిబారే అవకాశమే ఉండదు. ఇకపోతే సన్ స్క్రీన్ మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. ఈ యూవీ కిరణాలు నల్ల మచ్చలు, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఫేస్ యాక్టివ్ లను ఉపయోగించొద్దు
టీనేజర్ల చర్మం చాలా యవ్వనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో రెటినోల్, ఎహెచ్ఎ, బిహెచ్ఎ వంటి ఫేస్ యాక్టివ్స్ ను యూజ్ చేయడం వల్ల చర్మపు చికాకు వంటి సమస్యలు వస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే వీటిని అస్సలు ఉపయోగించకండి. అవసరమైతే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే వీటిని ఉపయోగించండి.