Government Job : మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా..? అయితే మాజీ మంత్రి హరీష్ రావు సహకారం పొందండి… ఏడాదిలో రూ.2 నుండి రూ.4 లక్షలు ఆదా చేసుకుని గవర్నమెంట్ జాబ్ సాధించండి. ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసా?
Harish Anna Udyoga App : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది చాలామంది యువతీయువకుల కల. మరీముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్నచిన్న పట్టణాల్లోని యువత చదువు పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ప్రిపేర్ అవుతుంటారు. జాబ్ నోటిఫికేషన్స్ సమయానికి రాకపోవడం, ఒక్కసారికే జాబ్ సాధించలేకపోవడం, కోచింగ్ సెంటర్లు వేలల్లో ఫీజులు లాగుతుండటం, ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండాల్సి రావడం... ఇలా అనేక అంశాలు యువత ప్రభుత్వ ఉద్యోగ కలను కాస్ట్లీగా మారుస్తోంది. దీంతో కొందరు పేద విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తమ లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముందుకువచ్చారు.
25
ఏమిటీ హరీష్ అన్న ఉద్యోగ యాప్..?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువతీయువకులకు ఉచితంగా ఆన్ లైన్ కోచింగ్ అందించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సొంతంగా ఓ యాప్ ను రెడీ చేయించారు. ఇదే 'హరీష్ అన్న ఉద్యోగ యాప్ (Harish Anna Udyoga App)''. తన సొంత నియోజకవర్గం సిద్దిపేట యువతకోసం హరీష్ రావు సొంత డబ్బులతో ఈ యాప్ ను డెవలప్ చేయించారు. ఈ యాప్ ను తాజాగా హరీష్ రావు ప్రారంభించారు.
ఈ హరీష్ అన్న ఉద్యోగ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. నిరుద్యోగ యువత దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఉచితంగానే ఆన్ లైన్ క్లాసులకు హాజరుకావచ్చు... ఎలాంటి ఛార్జీలు ఉండవు. 57 రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసులు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. అలాగే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన నమూనా ప్రశ్నపత్రాలు కూడా ఉంటాయి... కాబట్టి యువత వీటిద్వారా ఎగ్జామ్ ఎలా రాయాలి..? ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు? అనేవి తెలుసుకోవచ్చు.
35
వెయ్యిమంది యువతీయువకులకు అవకాశం...
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్ లైన్ క్లాసుల ఫ్రీగా పొందాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ''హరిష్ అన్న ఉద్యోగ యాప్'' ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి... దీంతో ఈ యాప్ ఏడాది పాటు అందుబాటులోకి వస్తుంది. ఇలా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన వెయ్యిమందికి అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్ లో మరింత ఎక్కువమందికి ఈ యాప్ అందుబాటులో ఉండేలా చూస్తామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
ఈ హరీష్ అన్న ఉద్యోగ యాప్ లో యువతకు రీజనింగ్, ఆర్థమెటిక్, కరెంట్ అపైర్స్, హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులు బోధిస్తారు. ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేస్తారు. అంతేకాదు స్టడీ మెటిరియల్స్ కూడా ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. ఇలా హరీష్ అన్న ఉద్యోగ యాప్ పేద, మధ్యతరగతి యువత ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేసుకునేందుకు సహకరిస్తుంది.
తెలంగాణ యువత చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని భావిస్తే ముందుగా గుర్తుకువచ్చేది హైదరాబాద్. నగరంలోని వేలాదిగా వెలిసిన కోచింగ్ సెంటర్లు యువత నుండి వేలల్లో, కొన్ని లక్షల్లో కోచింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు ప్రిపరేషన్ సమయంలో వసతి, భోజనం కోసం కూడా లక్షలు ఖర్చు అవుతుంటాయి. ఇలా మొత్తంగా ఓ విద్యార్థి హైదరాబాద్ లో ఏడాదిపాటు కోచింగ్ తీసుకుంటే మినిమం రూ.2 నుండి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
అయితే ఈ హరీష్ అన్న ఉద్యోగ యాప్ ద్వారా యువత సొంతూళ్లో ఉంటూనే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్దం కావచ్చు. కోచింగ్ ఉచితమే కాబట్టి ఎలాంటి ఖర్చు ఉండదు... కాబట్టి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు... తల్లిదండ్రులపై కూడా ఆర్థిక భారం తగ్గుతుంది.
55
ఈ యాప్ మీ జీవితాలకు గేమ్ చేంజర్..: హరీష్ రావు
‘’హరీష్ అన్న ఉద్యోగ యాప్'' ను యూస్ చేసుకొని ఆత్మవిశ్వాసం పొందుతామని విద్యార్థులు చెప్పిన మాటలు సంతోషాన్ని కలిగించాయని హరీష్ రావు అన్నారు. ఈ యాప్ యువత జీవితాన్ని మారుస్తుంది... ఇది గేమ్ చేంజర్ అవుతుందన్నారు. హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకునే బదులు యాప్ ద్వారా పోటీ పరీక్షల సిలబస్ పై పట్టు సాధించవచ్చని అన్నారు. ఈ యాప్ ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాలని.. గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.