Google
Google : కార్పోరేట్ కంపనీలు ఉద్యోగుల నుండి వీలైనంత ఎక్కువ పనిని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వర్క్ లోడ్ ఎక్కువయి చాలామంది ఉద్యోగులు డిప్రెషన్ కు గురవుతుంటారు. కానీ కార్పోరేట్ దిగ్గజం గూగుల్ మాత్రం పని చేయడానికి కాదు... పని చేయకుండా ఉండేందుకు కొందరు ఉద్యోగులకు లక్షల సాలరీలు చెల్లిస్తోంది. ఇలా ఒకటి రెండు నెలలు కాదు కొందరికి ఏడాదిపాటు పనిచేయకుండా పక్కన పెడుతోందట. గూగుల్ ఇలా చేయడంవెనక పెద్ద కారణమే ఉంది.
టెక్ దిగ్గజాలు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంటపడ్డాయి. ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలను సృష్టిస్తున్నాయి. గూగుల్ కూడా ఇదే చేస్తోంది... ఇప్పటికే అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీతో జెమిని 2.5 ప్రో ను తీసుకువచ్చింది. ఇది ఏఐ రేసులో గూగుల్ ను ముందువరుసలో నిలిపింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆధిపత్యం ప్రదర్శించేందుకే గూగుల్ ఉద్యోగులను పని చేయకుండా ఉండేలా ఒప్పందాలు చేసుకుంటోంది.
Garder Leave
గూగుల్ ఉద్యోగులకు 'గార్డెన్ లీవ్స్'... అంటే ఏమిటో తెలుసా?
ప్రస్తుత టెక్ జమానాలో మంచి ప్రతిభ కలిగిన ఉద్యోగులను భారీ సాలరీలు ఇచ్చి అపాయింట్ చేసుకుంటున్నాయి కంపనీలు. వీరి సాయంతో టెక్ రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. అయితే తమ సంస్థలోని ప్రతిభావంతులు బయటకు వెళితే ప్రత్యర్థి కంపనీల పోటీలోకి వస్తాయి. అలాకాకుండా ఉద్యోగులు పని చేయకున్నా మంచి సాలరీ ఇచ్చి కొంతకాలం ఎక్కడా పనిచేయకుండా ఆపుతుంటాయి కొన్ని సంస్థలు. వీటిని 'గార్డెన్ లీవ్' అంటారు. ఇప్పుడు గూగుల్ ఇదే చేస్తోంది.
బ్రిటీష్ అమెరికన్ సంస్థ గూగుల్ డీప్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు చేస్తుంటుంది. బ్రిటన్ కు చెందిన కంపనీని గూగుల్ కొనుగోలు చేసింది... దీని ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది. యూఎస్ తో పాటు కెనడా, జర్మనీ, ప్రాన్స్, స్విట్జర్లాండ్ లో కూడా పరిశోధనా కేంద్రాలున్నాయి. ఈ సంస్థలో 2000 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అయితే ఈ సంస్థ ఏఐపై చేస్తున్న ప్రయోగాల గురించి ప్రత్యర్థి కంపనీలకు తెలియకుండా జాగ్రత్త పడుతోందట. అందుకే ఎవరైనా ఉద్యోగులు రాజీనామా చేసినా బయటి కంపనీలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతోందట. ఇందుకోసం ముందే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. పని చేయకున్నా సరే ఉద్యోగులకు భారీగా జీతాలిస్లోంది.... ఇలా ఒకటిరెండు నెలలు కాదు ఒక్కొక్కరికి ఏడాదిపాటు 'గార్డెన్ లీవ్'లో కొనసాగిస్తోందని బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది.
ఇలా గూగుల్ డీప్ మైండ్ ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయడంలో, జెమిని ప్రాజెక్టులో పనిచేసిన సీనియర్ పరిశోధకులకు ఇలా 'గార్డెన్ లీవ్ లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి జీతం పొందుతున్నప్పటికీ వారికి ఎలాంటి పని ఉండదు... అలాగని వేరే కంపనీకి వెళ్లే అవకాశం ఉండదు. ఒప్పందం ప్రకారం ఎన్ని నెలలైనా అలాగే ఉండాలన్నమాట.
Google DeepMind
డీప్‌మైండ్ ఉద్యోగుల వ్యవహారంపై గూగుల్ ఏమంటోందంటే...
డీప్‌మైండ్ మాజీ డైరెక్టర్, మైక్రోసాఫ్ట్ ఏఐ వైస్ ప్రెసిడెంట్ నాండో డి ఫ్రీటాస్ సోషల్ మీడియాలో ఈ గార్డెన్ లీవ్స్ వ్యవహారాన్ని బైటపెట్టారు. ఈ నిర్బంధ ఒప్పందాల నుండి బయటపడటానికి మార్గాలను అభ్యర్థిస్తూ అనేక మంది ఉద్యోగులు తనను సంప్రదించారని అతడు తెలిపాడు. ఈ ఒప్పందాలను ఫ్రిటాస్ తీవ్రంగా విమర్శించాడు. వాటిని అధికార దుర్వినియోగం అని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా యూరప్‌లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలతో వ్యవహరించేటప్పుడు ఇలాంటి ఒప్పందాలపై సంతకం చేయవద్దని నిపుణులను కోరారు.
దీనికి ప్రతిస్పందనగా గూగుల్ తన విధానాన్ని సమర్థించుకుంది... ఉద్యోగ నిబంధనలు పరిశ్రమ పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. అయితే ఈ వివాదం కార్పొరేట్ నియంత్రణ, ఉద్యోగుల హక్కులు, కృత్రిమ మేధస్సు యొక్క తీవ్రమైన పోటీ ప్రపంచంలో నైతిక నియామక పద్ధతుల గురించి చర్చకు దారితీసింది.