చైనాలోని వుహాన్ ల్యాబ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ ల్యాబ్ కు సంబంధించి మరో సంచలన వార్త బయటికొచ్చింది. దీంతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ ఇక్కడినుంచి పుట్టుకొచ్చిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.
అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదికల ఆధారంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే అణు శాస్త్రవేత్తల జర్నల్ ‘బులెటిన్ ఓఆర్జి’ లో కూడా ల్యాబ్ లీకేజీ కథనం వచ్చి సంచలనం సృష్టించింది. వీటిలో వేటికీ చైనా ఆధారాలు చూపించలేదు. ఖండించలేదు.
కేవలం తమపై దుష్ప్రచారం గానే కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్ షీట్ లోని విషయాలు బయటకు రావడంతో మరోసారి చైనా పాత్రను ప్రశ్నిస్తున్నాయి.
బాహ్యప్రపంచంలో సార్స్ కోవ్ -2 వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్ లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలో కోవిడ్ 19 లేదా సాధారణంగా కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ వద్దకు ఒక నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామి నుంచి వచ్చింది.
అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని వెల్లడించినట్లు కొందరు అధికారులు వాల్ స్ట్రీట్ తో పేర్కొన్నారు. కాని వాళ్ళు ఎందుకు జబ్బుపడ్డారో కారణం మాత్రం తెలియదని తెలిపారు.
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ 8వ తేదీన తొలి సార్ కోర్టు కేసు నమోదైంది. కానీ, చాలామంది వైరాలజిస్టులు, అంటు వ్యాధులు చికిత్స నిపుణులు మాత్రం అది 2019 నవంబర్ లోనే వుహాన్ లో వ్యాపించి ఉంటుందని చెబుతున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఊహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్, గబ్బిలాల్లోని కరోనా వైరస్ లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను మాత్రం ఎవరికి ఇవ్వడం లేదు.
గతేడాది మార్చిలో హాడ్సన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి విదేశాంగమంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ‘లెవల్ 3 ల్యాబ్ లో చాలా రక్షణ ఉంటుంది. అక్కడ కరోనా వైరస్ లపై పని చేసిన ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరందరిలో ఇన్ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నాయి. వీరంతా ఒకే వారంలో తీవ్ర అస్వస్థతకు గురికావడం కానీ, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడం కానీ జరిగింది. పరిశోధకులు జబ్బుపడటమే మొదటి క్లస్టర్ కావచ్చు...’ అని పేర్కొన్నారు. పాంపియో గతంలో నిఘా సంస్థ సి.ఐ.ఎ డైరెక్టర్గా కూడా పని చేశారు. ఆయన ఎంతమంది జబ్బుపడ్డారో కూడా అంకెలతో సహా చెప్పారు.
అయితే ఈ కథనంపై వాల్ స్ట్రీట్ చైనా విదేశాంగ శాఖను వివరణ కోరగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ సమాధానం చెప్పింది. ల్యాబ్ నుంచి లీక్ అయ్యే అవకాశం లేదని పేర్కొంది. అమెరికా ఈ ప్రచారాన్ని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. గతంలో కూడా చైనా ఈ వైరస్ తమ దేశంలో పుట్టలేదని.. బయటి నుంచి వచ్చిందని ప్రచారం చేసింది. ఒక దశలో అమెరికాలోని మేరీల్యాండ్ లో ఉన్న ఫోర్ట్ డెట్రిక్ సైనిక స్థావరంలోని ల్యాబ్ నుంచి వచ్చిందని కూడా ఆరోపించింది.
ఈ ఏడాది జనవరిలో వుహాన్ ల్యాబ్ కు వచ్చిన నిపుణుల బృందంతో బ్యాట్ ఉమెన్ గా పేరున్న షీఝెంగ్ లీ మాట్లాడుతూ...‘ తమ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదని తెలిపారు. తమ సభ్యుల్లో ఇప్పటికీ కరోనా వైరస్ యాంటీబాడీలు లేవు..’అని పేర్కొన్నారు.
కానీ, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్ షీట్ మాత్రం షీ చెప్పిన మాటలు ఎంతవరకు నమ్మశక్యం అనే అంశం పై సందేహాలు వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్ షీట్లో చైనా ల్యాబుల్లో జరిగిన పలు ప్రమాదాలు, పి ఎల్ ఎ తో కలిసి చేసిన పరిశోధనలు కూడా పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణు బృందం చైనాలో 76,000 కోవిడ్ కేసుల్లో 92 మంది అక్టోబర్-డిసెంబర్ మొదటి వార మధ్యలో అస్వస్థతకు గురైనట్లు గుర్తించింది. వారి డేటాను ఇవ్వాలని కోరగా చైనా తిరస్కరించింది. ఇక వూహాన్ లోని బ్లడ్ బ్యాంక్ నమూనాలు ఇవ్వాలని.. వాటిల్లో 2019 డిసెంబర్ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని పేర్కొంది. కానీ, వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందని తొలుత పేర్కొంది. ఆ తరువాత ఇచ్చేందుకు అంగీకరించినా.. ఆ నమూనాలు పరిశీలించే అవకాశం ఇప్పటివరకు నిపుణులకు కల్పించలేదు.