వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హత్యకు కుట్ర పన్నాడని…ఈ ప్లాన్లో భాగంగానే వైట్ హౌస్ మీద దాడికి ప్రయత్నించాడని తెలుగు సంతతికి చెందిన 19 సాయి వర్షిత్ వాషింగ్టన్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అద్దెకు తీసుకున్న ట్రక్కుతో వైట్ హౌస్ మీద దాడికి ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన అక్కడి సిబ్బంది. సాయి వర్షితను అదుపులోకి తీసుకొని విచారించగా జోబైడెన్ ను హత్య చేయడానికి తానీ పనికి పాల్పడినట్లుగా తెలిపాడు. అతని ట్రక్కులో నాజీల జెండా కనిపించడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.
ప్రస్తుతం అమెరికా మొత్తం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. తెలుగువారు ఎక్కువగా ఉన్న అమెరికాలో.. తెలుగు సంతతికి చెందిన ఈ కుర్రాడు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరి సాయి వర్షిత్? ఆరునెలల పాటు పక్కాగా ప్లాన్ వేసి మరీ జోబైడెన్ ను ఎందుకు చంపాలనుకున్నాడు? అనేది అందరి మనసులోనూ ప్రస్తుతం మెదులుతున్న అనుమానం.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
భారత సంతతికి చెందిన కందుల సాయి వర్షిత్ మిస్సోరీలోని చెస్ట్ ఫీల్డ్ ప్రాంతానికి చెందినవాడు. చాలా ఏళ్ల క్రితమే సాయి వర్షిత్ తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. సాయి వర్షిత్ 2022లో మార్ క్వీట్ సీనియర్ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో స్టూడెంట్ కౌన్సిల్లో సాయి వర్షిత్ పాల్గొన్నారు.
సాయి వర్షిత్ కు టెక్నాలజీ మీద కూడా చాలా అవగాహన ఉంది. ప్రోగ్రామింగ్, కోడింగ్, లాంగ్వేజ్ లపై మంచి పట్టు ఉండడంతో డేటా అనలిస్టుగా కెరీర్ నిర్మించుకోవాలనుకున్నాడు. సాయి వర్షిత్ మీద ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. అలాంటి వ్యక్తి ఏకంగా ఆరు నెలల పాటు పక్కాగా ప్లాన్ చేసి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ని తన స్వాధీనం చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు అనే విషయమే పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
సాయి వర్షితను అదుపులోకి తీసుకున్న తర్వాత అతని విచారణలో వెలుగు చూసిన విషయాలు పోలీసులు కంగుతినేలా ఉన్నాయి. దేశాధ్యక్షుడినే చంపడానికి ఎందుకు ప్రయత్నించావని పోలీసులు విచారణలో భాగంగా సాయి వర్షిత్ ను అడిగారు. దీనికి అతను.. ‘శ్వేత సౌధాన్ని చేజిక్కించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్నదే నా ధ్యేయం.. దీనికోసం అవసరమైతే అమెరికా అధ్యక్షుడిని చంపడానికి కూడా వెనకాడకూడదనుకున్నాను’ అని సాయి వర్షిత్ చెప్పుకొచ్చాడు.
అధ్యక్ష భవనం మీద దాడిని ఎలా చేయాలని దానికి సంబంధించిన ప్లానింగ్ వివరాలను.. సాయి వర్షిత్ ఆరు నెలలుగా ఎప్పటికప్పుడు తన గ్రీన్ బుక్ లో రాసుకున్నట్లు తెలిపాడు. సాయి వర్షితను అదుపులోకి తీసుకున్న సమయంలో అతని దగ్గర నాజీ జెండాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయి వర్షిత్ ఈ జెండాను ఆన్లైన్లో కొన్నట్టుగా చెప్పాడు. నాజీలకు గొప్ప చరిత్ర ఉందని.. హిట్లర్ బలమైన నేత అని.. విచారనాధికారులకు సాయి వర్షిత్ చెప్పినట్లు తెలుస్తోంది. పొంతనలేని ఈ మాటల వల్ల సాయివర్షిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లుగా వారు గుర్తించారు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి పదిగంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆరోజు రాత్రి సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ లోని డ్యుల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సాయి వర్షిత్ అక్కడ ఓట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. నేరుగా వైట్ హౌస్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ట్రాఫిక్ బారియర్స్ ను ఢీకొట్టాడు.
ఈ దాడిలో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు.. కానీ, వెంటనే అలెర్ట్ అయిన యూఎస్ పార్క్ పోలీసులు యుఎస్ సీక్రెట్ సర్వీస్ యూనిఫామ్ విభాగం అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ట్రక్కుతో పాటు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
సాయి వర్షిత్ మీద వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేయడం, వైస్ ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడం వంటి అభియోగాలను మోపారు. ఈ మేరకు సాయి వర్షిత్ మీద కేసులు నమోదయ్యాయి. అతని మానసిక పరిస్థితి మిగతా విషయాలపై కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.