100 గంటలు వంట.. నైజీరియా మహిళ గిన్నిస్ రికార్డ్...

First Published May 17, 2023, 9:00 AM IST

ఓ మహిళ నాన్ స్టాప్ గా వంద గంటలపాటు వంట చేసింది. అప్పటివరకు భారత చెఫ్ పేరుమీదున్న రికార్డును బద్దలు చేసింది. సరికొత్త రికార్డును తన పేరు మీద తిరగరాసింది. 

నైజీరియా : ఎవరైనా వంట చేస్తే ఎంతసేపు చేస్తారు.. గంట, రెండు గంటలు.. ఒక పూట.. ఒకరోజు.. అప్పటికే పూర్తిగా అలిసిపోయి.. బాడీ మొత్తం ఖైమా కొట్టినట్టుగా తయారవుతుంది. మరికొందరైతే రోజువారి చేసే ఓ గంటసేపటి వంటపనికే పూర్తిగా అలసిపోతుంటారు. కానీ నైజీరియా కు చెందిన ఓ మహిళా చెఫ్ మాత్రం ఏకధాటిగా 100 గంటల పాటు వంట చేసింది. దీంతో సరికొత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకుంది. 

అంతకుముందు 2019లో భారత చెఫ్  లతా టాండన్ ఏకధాటిగా 87 గంటల 45 నిమిషాలు వంట చేసి రికార్డును నెలకొల్పారు. ఆ రికార్డును  నైజీరియా చెఫ్ హిల్దా బాసి బ్రేక్ చేశారు. సరికొత్త రికార్డును సృష్టించారు. 

దీనికోసం హిల్దా బాసి  గత గురువారం వంట ప్రారంభించారు. అలా మొదలైన వంట లండన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.45 ని.లకు  పూర్తయింది.

cooking tips

లాగోస్ లోని లెక్కి ప్రాంతం వాణిజ్య నగరంగా పేరుగాంచింది. అక్కడే హిల్దా బాసి ఈ సాహసం చేసింది. ఇక ఈమె చేసిన వంటల్లో..  నైజీరియాకు చెందిన ప్రత్యేక వంటకాలు అయిన సూప్ లు, టమోటా రైస్ వంటి పలు డిష్ లు ఉన్నాయి.

నాన్ స్టాప్ గా 12 గంటల పాటు వంట చేసిన తర్వాత ఓ గంటసేపు విశ్రాంతి తీసుకునేది హిల్దా బాసి. ఆ గంట సమయంలో స్నానం, వైద్య పరీక్షలు.. విశ్రాంతి అన్ని పూర్తయ్యేవి. హిల్దా బాసి చేస్తున్న సాహస ప్రయత్నాన్ని చూసేందుకు వేలాదిమంది ప్రజలు లెక్కి ప్రాంతానికి తరలివచ్చారు.  

ఆమె వంట చేస్తున్నంతసేపు పాటలు పాడుతూ ప్రోత్సహించారు. అంతేకాదు ఆన్లైన్లో కూడా హిల్దా బాసి  వంటల కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేశారు. నైజీరియా మొత్తం ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనించింది.  

రికార్డు నెలకొల్పగానే  నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి కూడా హిల్దా బాసికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన. 

ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ మాట్లాడుతూ.. సంబంధిత ఆధారాలను పరిశీలించిన తర్వాత అధికారికంగా హిల్దా బాసి  నెలకొల్పిన రికార్డును ప్రకటిస్తామని తెలిపింది. దీనిమీద హిల్దా బాసి  మాట్లాడుతూ  ఆఫ్రికన్ మహిళలకు సంఘీభావం గానే తాను ఈ పని చేసినట్లుగా చెప్పుకొచ్చింది. 
 

click me!