
Modi US Visit : భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల అమెరికా పర్యటన ముగిసింది. ఇటీవలే యూఎస్ ప్రెసిడెంట్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ వంటి రాజకీయ ప్రముఖులను కలుసుకున్నారు. అలాగే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి దిగ్గజ వ్యాపారవేత్తలతోనూ భేటీ అయ్యారు. ఇలా అమెరికాతో దైపాక్షిక సంబంధాలతో పాటు వ్యాపార సంబంధాలను కూడా మెరుగుపర్చుకునేందుకు మోదీ ఈ పర్యటనను ఉపయోగించుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత అభివృద్ది చెందిన అమెరికాలో స్థిరపడాలని చాలా దేశాల్లోనివారు కోరుకుంటారు... ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. మన దేశ యువతలో ఎక్కువమంది డాలర్ డ్రీమ్స్ కంటుంటారు. అలాంటివారి కలలను చిదిమేస్తూ నూతన అధ్యక్షుడు ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. అంతేకాదు అమెరికాలో పుట్టే విదేశీయుల పిల్లలకు కూడా జన్మతహా వచ్చే అమెరికన్ సిటిజన్ రద్దు చేస్తున్నారు. ఇక అక్రమ వలసదారులను గుర్తించి దేశంనుండి తరిమేస్తోంది ట్రంప్ సర్కార్. ఇలా అమెరికాలోని విదేశీయుల విషయం ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయిన మోదీ ఈ అంశాలపై చర్చించారు.
అయితే అమెరికా ఎప్పుడూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుందని... ప్రతిభావంతులు అధికారికంగా తమ దేశానికి అధికారికంగా అన్ని అనుమతులతో వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రధాని మోదీకి ట్రంప్ తెలిపారు. కానీ అక్రమ మార్గాల్లో తమ దేశానికి రావడం, అనుమతులు లేకుండా నివాసం వుండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ట్రంప్ స్పష్టం చేసారు. భారత్ కూడా అక్రమ వసలదారుల విషయంతో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇప్పటికే చేపట్టిన చర్యలను సమర్దించింది.
అక్రమ వలసదారులు మినహా భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేసారు. దీంతో అమెరికాలోని భారతీయులకు ఊరట లభించింది. మరీముఖ్యంగా యూఎస్ లో అత్యధికంగా నివాసముండే తెలుగు రాష్ట్రాలవారికి కూడా మోదీ పర్యటన చాలా మేలు చేసిందనే చెప్పాలి... ట్రంప్ భయాన్ని పొగొట్టింది. అక్రమ వలసదారులనే తమ టార్గెట్ అని మోదీ సాక్షిగా ట్రంప్ స్పష్టం చేయడంతో అమెరికాలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వారు ఊపిరి పీల్చుకున్నారు.
యూఎస్ లో తెలుగోళ్లు ఎంతమంది ఉంటారో తెలుసా?
అమెరికా అంటే భారతీయులు పడిచస్తారు... ఎలాగైనా అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదించాలని కోరుకుంటారు. ఉన్నత చదువుల కోసమని వెళ్లి అక్కడే స్థిరపడిపోతుంటారు. ఇలా ఇండియానుండి ప్రతిఏటా లక్షలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వెళుతుంటారు... వారిలో అధికంగా తెలుగోళ్ళే ఉంటారని అనడంలో ఏమాత్రం సందేహం వుండదు.
ఏటా అమెరికాకు వెళ్లే భారతీయుల్లో 12 శాతానికి పైగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వారే ఉంటారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. యూఎస్ లో ఎక్కువమంది మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగుది 11వ స్థానం... దీన్నిబట్టి అక్కడ మన తెలుగోళ్ళే ఏస్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా 70వేల మంది స్టూడెంట్స్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్నారు.. వీరిలో అత్యధికులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.
ఇలా ప్రస్తుతం అమెరికాలో 12.30 లక్షలమంది తెలుగువారు ఉన్నారు. అత్యధికంగా కాలిఫోర్నియా లో 2 లక్షలు తెలుగువారు ఉన్నారు... ఇక టెక్సాస్ లో 1.50 లక్షలు, న్యూజెర్సీలో 1.10 లక్షలు, ఇల్లినాయిస్ లో 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేలు మంది ఉంటున్నారు. 2016 లో కేవలం 3.20 లక్షలమంది తెలుగోళ్లు మాత్రమే యూఎస్ లో ఉండేవారు... కానీ ఇప్పుడు ఆ సంఖ్య నాలుగింతలు పెరిగింది.
అమెరికాకు వెళ్లేవారితో అత్యధికంగా హెచ్-1బి నాన్ ఇమిగ్రేషన్ వీసాపై వెళుతుంటారు. ఇది ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసుకోడానికి జారీచేసే వీసా. ఈ వీసాలను కూడా ట్రంప్ కుదించే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది. కానీ మోదీతో భేటీలో ఇలాంటి చర్యలేవీ వుండవని స్పష్టమయ్యింది. ఈ వీసాపై అమెరికాకు వెళ్లాలని అనుకునే తెలుగువారికి ఇది గుడ్ న్యూస్.
మొత్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన యూఎస్ లోని 12 లక్షలకు పైగా తెలుగువారికి మేలు చేసింది. ట్రంప్ పై వారికి ఉన్న అనుమానాలు తొలగిపోయాయి... అక్కడ అక్రమంగా వుంటున్నవారు తప్ప మిగతావారికి ఆందోళన తగ్గిందనే చెప్పాలి.
అమెరికాతో భారత్ కీలక ఒప్పందాలు :
ఇక ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలన మరింత మెరుగుపర్చుకోవడమే కాదు వాణిజ్య సంబంధాలను మరింత పెంచారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇరు దేశాలు. ఉమ్మడి అభివృద్ధికి దోహదపడేలా ఉత్పత్తి, సాంకేతిక బదిలీకి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ MAGA (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) వాడిన నినాదం మోదీ గుర్తుచేసుకున్నారు. అలాగే వికసిత్ భారత్ 2047 ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు... దీన్ని MIGA (మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్) గా అభివర్ణించారు. ఇలా రెండు దేశాల కలయిన MEGA భాగస్వామ్యానికి బాటలు వేసిందని మోదీ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
ఇక భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా సహకరిస్తుందని ట్రంప్ తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక F-35 ఫైటర్ జెట్‌లను ఇండియాకు విక్రయించనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇలా రక్షణ పరమైన ఒప్పందాలను కుదుర్చుకుని భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని ప్రపంచానికి చాటారు.