
US deports illegal Indian migrants :అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినతర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అసలే దూకుడుగా నిర్ణయాలు తీసుకునే ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు పెంచారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు అమెరికన్స్ ఫస్ట్ అనేలా పాలన సాగిస్తున్నారు. అధ్యక్షపగ్గాలు చేపట్టి ఇంకా నెలరోజులు కూడా పూర్తికాలేదు అప్పుడే ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికాలో వుంటున్న విదేశీయుల ఏరివేత ప్రారంభించారు.
ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివాసంవుంటున్న విదేశీయులను గుర్తించి దేశంనుండి తరిమేసే ప్రక్రియ చేపట్టింది ట్రంప్ సర్కార్. ఇలా అనేక దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక ఆర్మీ విమానాల్లో ఆయా దేశాలకు పంపిస్తున్నారు. ఇలా భారత్ కు కూడా ఓ అమెరికా ఆర్మీ విమానం బయలుదేరినట్లు సమాచారం. ఇందులో 205 మంది భారతీయులు వున్నారని... ఈ విమానం పంజాబ్ లోని అమృత్ సర్ లో దిగుతుందని తెలుస్తోంది.
అయితే మరికొద్దిరోజుల్లో భారత ప్రధాని అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రంప్ చర్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఏ దేశంలో అయినా విదేశీయుల అక్రమ నివాసం అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని... ఆ దేశ ఆర్థిక,సామాజిక వ్యవహాలకు భంగం కలిగించడమే కాదు భద్రతాపరంగా ప్రమాదకరమని భారత్ పేర్కొంది. కాబట్టి అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకువచ్చే చర్యలు చేపడతామని విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇలా భారత్ అక్రమ వలసదారులను తరలింపుకు అమెరికాకు సహకరిస్తోంది. కాబట్టి మోదీ పర్యటనపై ఈ వ్యవహారం ప్రభావం వుండకపోవచ్చు. కానీ ట్రంప్, మోదీ భేటీ సమయంలో వలసదారుల ఏరివేత అంశం చర్చకు రావచ్చు. ఇరుదేశాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకల సాగేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.
ఇండియాకు బయలుదేరిన ఆర్మీ విమానం :
అమెరికా నుండి అందుతున్న సమాచారం మేరకు అక్కడ అక్రమంగా నివాసముంటున్న భారతీయులు దాదాపు 7 లక్షలకు పైనే వున్నారట. వీరిలో ఇప్పటికే 20 వేలమంది జాబితాను అధికారులు సిద్దం చేసారట. వీరందరినీ తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మొదటి విడతలో 205 మందిని అమెరికా ఆర్మీ విమానం సీ-17 ఇండియాకు తరలిస్తోందట. ఇప్పటికే అమెరికా నుండి బయలుదేరిన ఈ విమానం ఇండియాలో ల్యాండ్ కాబోతోంది. ఇలా యూఎస్ బహిష్కరించిన వలసదారుల్లో భారత్ లోని వివిధ రాష్ట్రాలవారు వున్నట్లు తెలుస్తోంది.
యూఎస్ లో అక్రమ వలసదారుల ఏరివేత విరామం లేకుండా కొనసాగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంటే ఇకపై విడతలవారిగా ఇండియన్ వలసదారులను తరలించనున్నారు... క్రమంగా అమెరికన్ ఆర్మీ విమానాలు వస్తాయన్నమాట. ఇప్పటికే గుర్తించిన 20 వేలమందిని ముందుగా తరలించి మిగతావారికి తర్వాత తరలించనున్నారు.
గతంలో ట్రంప్ ప్రభుత్వం సైనిక విమానాల ద్వారా గ్వాటిమాలా, పెరూ, హోండురాస్‌కు వలసదారులను పంపించింది. అయితే ఇప్పుడు భారతదేశం వంటి అంతర ఖండంలో ఉన్న దేశాలకు కూడా ఇలాగే బహిష్కరించడం ప్రారంభమైంది.
ట్రంప్ నిర్ణయం అమెరికాకు పెనుభారమే :
అమెరికా సైనిక విమానాలను వలసదారుల బహిష్కరణకు ఉపయోగించడం చాలా ఖరీదైన ప్రక్రియ. ఒక వలసదారుని గ్వాటిమాలాకు తరలించేందుకు గత వారం ఖర్చయిన మొత్తం సుమారు $4,675గా లెక్కించబడింది. అలాంటిది భారత్ లాంటి సుదూర దేశాలకు ఇదే విధానం కొనసాగితే ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది.
సైనిక విమానాల ద్వారా టెక్సాస్‌లోని ఎల్ పాసో, కాలిఫోర్నియాలోని సాన్ డియాగో నగరాల నుండి 5,000 మంది వలసదారులను బహిష్కరించాలని పెంటగాన్ ప్రణాళిక రూపొందించింది.
ట్రంప్ ప్రభుత్వం ఈ విధానాన్ని వలస నియంత్రణకు రూపొందించినా ఇది అంతర్జాతీయంగా వివాదాస్పదంగా మారింది. మానవ హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు ఈ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సైనిక విమానాలను వలసదారుల బహిష్కరణకు ఉపయోగించడం ద్వారా అమెరికా ప్రభుత్వం సైనిక శక్తిని వినియోగించే విధానం కొత్త దిశలోకి మళ్ళింది.
భారతదేశంపై ప్రభావం :
భారతదేశానికి తరలించబడే వలసదారులు ఎవరు? వారు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారా? లేక వీసా నిబంధనలు ఉల్లంఘించినవారా? అనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే భారీ సంఖ్యలో భారతీయులను ఈ విధంగా అమెరికా నుంచి పంపడం భారత్‌కు కూడా ఇబ్బందికరమైన సమస్యగా మారే అవకాశం ఉంది.
ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యల్లో భాగంగా సైనిక విమానాలను వినియోగించడం తాజా చర్య. ఇది ఖరీదైన విధానం అయినా అమెరికా వలస నియంత్రణ నిబంధనలను మరింత కఠినతరం చేసే సంకేతాలను ఇస్తోంది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు కూడా ఇదే విధానం కొనసాగితే అంతర్జాతీయంగా అమెరికాపై ఒత్తిడి పెరిగే అవకాశముంది.