
Kandula Sai Varshith : ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలేవు ... అప్పుడే విప్లవ భావాలకు ఆకర్షితుడయ్యాడు. తాను నమ్మిన సిద్దాంతం కోసం ఏకంగా అగ్రరాజ్యం అమెరికాపై ఒంటరిగా యుద్దానికి సిద్దమయ్యాడు. చివరకు అమెరికా అధ్యక్ష భవనంపై దాడిచేసి ఆ దేశాధినేతనే హతమార్చాలని చూసాడు. చివరకు కటకటాలపాలై శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు యత్నించిన యువకుడు ఎవరో కాదు... తెలుగింటి కుర్రాడే. అతడి పేరు కందుల సాయి వర్షిత్. అమెరికా అధ్యక్షభవనం శ్వేత సౌదంపై దాడిచేసిన అతడికి 8 ఏళ్ల శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. దీంతో మరోసారి సాయి వర్షిత్ పేరు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా అధ్యక్ష భవనంపై దాడిచేసింది భారత సంతతి యువకుడు... అందులోనూ తెలుగోడు... దీంతో అతడిగురించి తెలుసుకునేందుకు తెలుగోళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. వైట్ హౌస్ పై దాడి ఘటనను గుర్తుచేసుకుంటూ అతడు ఎందుకిలా చేసాడంటూ చర్చించుకుంటున్నారు. తాజాగా అతడి విధించిన 8 ఏళ్ల జైలుశిక్షపైనా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కందుల సాయి హర్షిత్ వ్యక్తిగత వివరాలు, అమెరికా అధ్యక్ష భవనంపై దాడికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం.
ఎవరీ సాయి వర్షిత్?
అమెరికాలోని మిస్సౌరి చెస్ట్ ఫీల్డ్ ప్రాంతంలో కందుల సాయి వర్షిత్ కుటుంబంతో కలిసి నివాసం వుండేవాడు. అతడి తల్లిదండ్రులు వర్షిత్ పుట్టడానికి ముందే ఉపాధి నిమిత్తం భారత్ ను వదిలి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ పట్టణం వర్షిత్ తల్లిదండ్రుల స్వస్థలంగా తెలుస్తోంది. కొంతకాలం హైదరాబాద్ లో కూడా వీరు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు వెళ్లాకే వర్షిత్ పుట్టాడు కాబట్టి అతడికి ఆ దేశ పౌరసత్వం వచ్చింది. అతడి సోదరుడు కూడా పుట్టుకతోనే అమెరికన్. ఇలా ఇద్దరు బిడ్డలను ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచారు.
సాయి వర్షిత్ చిన్నతనంనుండి చదువులో మంచి చురుకైన విద్యార్థి. 2022 లో అతడు మార్ క్వీట్ సీనియర్ హైస్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. అతడికి టెక్నాలజీపై మంచి అవగాహన వుంది... పోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజ్ పై పట్టుంది. డేటా అనలిస్ట్ గా స్థిరపడాలని భావించేవాడు... ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసాడు.
ఇలా ఎంతో భవిష్యత్ కలిగిన 19 ఏళ్ల కుర్రాడు వర్షిత్ విప్లవ భావాలతో ఏకంగా అమెరికా అధ్యక్ష భవనంపై దాడిచేసాడు. దీంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది... ఇప్పుడు 8 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తోంది.
వర్షిత్ వైట్ హౌస్ పై దాడికి కారణమిదే..
సాయి వర్షిత్ ఎలా ప్రభావితం అయ్యాడో తెలీదుగానీ అతడి నరనరాన నాజీ భావజాలం నిండిపోయింది. నాజీ నాయకుడు హిట్లర్ పై అభిమానాన్ని పెంచుకున్నాడు. చివరకు అమెరికాలో నాజీల పాలన తీసుకురావాలని కలగనేవాడు. ఇలా జరగాలంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చంపడం ఒక్కటే మార్గమని భావించారు. అందుకోసం ఆరు నెలలపాటు కష్టపడి స్కెచ్ వేసాడు.
గతేడాది 2023 మే 22న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పై దాడిచేసి జో బైడెన్ ను హతమార్చే ప్లాన్ ను అమలుచేసాడు. రాత్రి సమయంలో వాషింగ్టన్ విమానాశ్రయానికి చేరుకున్న అతడు నేరుగావెళ్లి ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. ఆ భారీ వాహనంతో వైట్ హౌస్ వద్దకు వెళ్లి నానా బీభత్సం సృష్టించాడు.
ముందుగా వైట్ హౌస్ వద్దగల సైడ్ వాక్ పైకి వాహనం ఎక్కించాడు. దానిపై కొంతదూరం నడిపాడు... దీంతో పాదచారులు భయాందోళతో పరుగు తీసారు. ఆ తర్వాత వేగంగా దూసుకెళ్లి వైట్ హౌస్ భద్రత కోసం ఏర్పాటుచేసిన బారికేడ్లను ఢీకొట్టాడు. ఇలా అతడు వైట్ హౌస్ వైపు దూసుకెళుతుండగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నాడు.
వర్షిత్ వద్దనుండి ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాహనంలోంచి నాజీ జెండా పట్టుకుని దిగిన వర్షిత్ నినాదాలు చేసాడు.అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటినుండి వర్షిత్ జైల్లోనే వున్నాడు.
వర్షిత్ కు కోర్టు ఏ శిక్ష విధించింది...
పోలీసుల విచారణలో వర్షిత్ అమెరికా అధ్యక్షుడిని చంపేందుకే ఈ దాడి చేసినట్లు తెలిపాడు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసారు పోలీసులు. అప్పటినుండి ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. తాజాగా ఈ విచారణ పూర్తి కావడంతో వర్షిత్ కు 8 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ తీర్పు ఇచ్చారు.
వర్షిత్ దాడి కారణంగా వైట్ హస్ వద్ద చాలా విధ్వంసం జరిగింది. ఇలా ధ్వంసమైన నిర్మాణాల తొలగింపుతో పాటు తిరిగి నిర్మించేందుకు 4,322 డాలర్లు అంటే 3,74,000 రూపాయలు ఖర్చయ్యిందట. ఇలా అమెరికా అధ్యక్షుడిపై కుట్రపన్నడమే కాదు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు వర్షిత్ పై కేసులు పెట్టారు. అందుకే అతడికి 8ఏళ్ళ జైలుశిక్ష పడింది.
వర్షిత్ ను జైలు నుండి బయటకు తీసుకు వచ్చేందుకు తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేసారు. కానీ అతడు తన తరపున వాదించేందుకు అటార్నీని తిరస్కరించాడు. దీంతో అతడికి శిక్ష ఖరారయ్యింది.