అది ఏలియన్స్ పనేనా?.. ఉటా ఎడారిలో మాయమైన లోహపు దిమ్మె...

First Published | Nov 30, 2020, 3:52 PM IST

ఉటా ఎడారిలో విచిత్రంగా ప్రత్యక్షమైన ఓ దిమ్మ ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఈ దిమ్మ కనపడి ఎంత సంచలనం సృష్టించిందో.. ఇప్పుడు మాయమై కూడా అంతే సంచలనానికి దారి తీసింది. 

ఉటా ఎడారిలో విచిత్రంగా ప్రత్యక్షమైన ఓ దిమ్మ ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఈ దిమ్మ కనపడి ఎంత సంచలనం సృష్టించిందో.. ఇప్పుడు మాయమై కూడా అంతే సంచలనానికి దారి తీసింది.
వివరాల్లోకి వెడితే అమెరికాలోని నరసంచారం లేని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం ఓ వింత వస్తువు ప్రత్యక్షమయిన సంగతి తెలిసిందే. 12 అడుగుల పొడవున్న ఈ లోహపు దిమ్మె ఆ ఎడారిలోకి ఎలా వచ్చేందనే విషయం మిస్టరీగా మారింది. ఈ మిస్టరీ ఇంకా వీడకముందే తాజాగా మరో వింత చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఆ దిమ్మె కనిపించకుండా పోయింది. అంతపెద్ద భారీ వస్తువు హఠాత్తుగా రావడం, అంతే హఠాత్తుగా మాయమవడంతో.. ఇది తప్పకుండా ఏలియన్స్‌ పనే అంటున్నారు నెటిజనులు.
అయితే ఈ నేపథ్యంలో ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యూరో అధికారులు మాత్రం ‘ఒక్కరు లేదా కొందరు వ్యక్తులు కలిసి ఈ దిమ్మెను శుక్రవారం రాత్రి తొలిగించినట్లు మాకు తెలిసింది’ అంటున్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
దాని ప్రకారం.. ‘బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పాతిన లోహపు దిమ్మెను తొలగించినట్లు మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది’ అని దానిలో పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని తొలగించినట్లు ఉటా హైవే పాట్రోల్‌ సీపీఎల్‌ అధికారి ఒకరు ఆదివారం వాషింగ్టన్‌ పోస్ట్‌కు తెలియజేశారు. అయితే ఎవరు దాన్ని తొలగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
దీంతో ‘అసలు ఆ దిమ్మెను ఎడారిలో ఎవరు నిలబెట్టారు.. ఇప్పుడు ఎవరు తొలగించారు. అంతా మాయాలా ఉంది’ అంటూ ఆశ్చర్యం వ్యక్యం చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.
‘ఏలియన్స్‌ వచ్చి దాన్ని తీసుకెళ్లాయి’.. ‘ఇప్పుడు ఆ దిమ్మె మరో చోట ప్రత్యక్షం అవుతుందేమో’.. ‘ఆ దిమ్మె ఏలియన్స్‌కు సంబంధించిన వస్తువు అని, అందుకే అధికారుల సీక్రెట్‌గా దాన్ని తొలగించారు.. దానిపై ఏం మాట్లాడటం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నెల 18న కొందరు కార్మికులు రెడ్‌ రాక్‌ రిమోట్‌ ఏరియాలో ఈ నిర్మాణాన్ని గమనించారు. నరసంచారం లేని ఎడారిలో దిమ్మె ప్రత్యక్షం అ‍య్యిందని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ దిమ్మె తెగ వైరలయ్యింది. ఇక ఈ దిమ్మె ఎక్కడ ఉంది అనే దాని గురించి ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలేదు. కారణం.. వివరాలు తెలిస్తే జనాలు పెద్ద ఎత్తున అక్కడికి పోటెత్తుతారని సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.

Latest Videos

click me!