Iran War: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా ప్రజల అభిప్రాయంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. అమెరికన్లు ఈ యుద్ధంపై ఏమనుకుంటున్నారన్న దానిపై తాజాగా జరిగిన ఒక సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
రాయిటర్స్ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం దాదాపు 66 శాతం అమెరికన్లు, అంటే రెండు మూడొంతుల జనాభా, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ముగించాలని కోరుకుంటున్నారు. ప్రారంభంలో యుద్ధానికి ఉన్న లక్ష్యాలు సాధించాయా లేదా అనే విషయాన్ని పక్కనబెట్టి, ఇప్పుడు యుద్ధం కొనసాగకూడదనే అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కేవలం 27 శాతం మంది మాత్రమే యుద్ధం కొనసాగాలని భావిస్తున్నారు. దీని వల్ల అమెరికా ప్రజలలో యుద్ధంపై వ్యతిరేక భావన పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.
25
ఇరాన్‌కు సైన్యం పంపడంపై తీవ్ర వ్యతిరేకత
సర్వేలో బయటపడిన మరో ముఖ్యమైన అంశం అమెరికా సైనికులను నేరుగా యుద్ధరంగంలోకి పంపడంపై తీవ్ర వ్యతిరేకత. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 75 శాతం మంది ఇరాన్‌కు అమెరికా సైన్యాన్ని పంపడాన్ని వ్యతిరేకించారు. ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ వంటి గత యుద్ధాల అనుభవాల కారణంగా మరోసారి దీర్ఘకాల యుద్ధంలో చిక్కుకోవాలని ప్రజలు కోరుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
35
యుద్ధ ప్రభావం… ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం
యుద్ధం ప్రభావం కేవలం సైనిక రంగంలో మాత్రమే కాదు, ఆర్థిక రంగంలో కూడా తీవ్రంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో అమెరికాలో పెట్రోల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇటీవల ఇంధన ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు పైగా చేరాయి. ఇది మూడు సంవత్సరాల తర్వాత కనిపించిన అత్యధిక స్థాయి. ధరలు పెరగడంతో సాధారణ ప్రజల ఖర్చులు పెరిగాయి. చాలా మంది ఈ పరిస్థితికి యుద్ధమే కారణమని భావిస్తున్నారు.
ఈ యుద్ధం విషయంలో అమెరికా రాజకీయాల్లో కూడా విభేదాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు మద్ధతుగా ఉన్న రిపబ్లికన్ పార్టీ లోపలే విభేదాలు మొదలయ్యాయి. సర్వే ప్రకారం సుమారు 40 శాతం రిపబ్లికన్ ఓటర్లు కూడా యుద్ధాన్ని త్వరగా ముగించాలని కోరుకుంటున్నారు. అయితే ఇంకా కొంతమంది మాత్రం యుద్ధం కొనసాగాలని భావిస్తున్నారు. ఇది పార్టీ లోపలే విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని సూచిస్తోంది.
55
అమెరికా సైనిక చర్యలపై పెరుగుతున్న అసంతృప్తి
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 60 శాతం మంది ఇరాన్‌పై అమెరికా దాడులను వ్యతిరేకించారు, కేవలం 35 శాతం మంది మాత్రమే మద్ధతు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడి పెరుగుతుండటంతో ట్రంప్ ప్రభుత్వం కూడా తన వ్యూహాన్ని పునఃపరిశీలించే పరిస్థితి ఏర్పడింది. కొన్ని రిపోర్టుల ప్రకారం, రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యలను తగ్గించే అవకాశముందని సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది నిజంగా విధాన మార్పా? లేక ఎన్నికల ముందు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.