
ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతున్న తారు రోడ్లు..ఎండ వేడికి వంగిపోతున్న రైలు పట్టాలు.. వడదెబ్బతో వేలాది మంది మరణాలు..ఇది ఎక్కడో కాదు.. ఎప్పుడూ చలితో వణికిపోయే శీతల ఖండం యూరప్‌లో కనిపిస్తున్న భయంకర నిజాలివి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) స్వయంగా రంగంలోకి దిగి.. 'ఈ హీట్ వేవ్ ను సైలంట్ కిల్లర్ అని హెచ్చరించింది. అసలు ఏసీలు, కూలర్లు కూడా లేని ఆ దేశాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతంగా యూరప్ మారుతోంది.
సాధారణంగా శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా ఖండం.. ఇప్పుడు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం.. జూన్ 21 నుంచి వడదెబ్బ కారణంగా రికార్డు స్థాయిలో 1,300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఫ్రాన్స్ దేశంలోనే, గత బుధవారం నాటికే వెయ్యి మందికి పైగా జనం చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఐరోపాలోని పలు దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తీవ్రమైన వేడికి సంకేతంగా 'రెడ్ అలర్ట్' జారీ చేయాల్సి వచ్చింది.
భారతదేశంలో 40 నుండి 45 డిగ్రీల ఎండలు కామన్ కదా.. మరి యూరప్‌లో ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? దీనికి WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఒక ముఖ్యమైన కారణం చెప్పారు. యూరప్‌లోని ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలలు.. చల్లటి వాతావరణాన్ని తట్టుకుని, లోపల వేడిగా ఉండేలా నిర్మించారు. అంటే అవి హీట్-ఇన్సులేటెడ్ ఇళ్లు. కానీ, ఇప్పుడు బయట ఎండలు పెరిగేసరికి ఆ ఇళ్లు వేడిని లోపలే బంధించేస్తున్నాయి. పైగా అక్కడ ఏసీలు, కూలర్లు వాడే అలవాటు చాలా తక్కువ. దీంతో ఆ ఇళ్లే ఇప్పుడు ప్రజలకు నిప్పులు కొలిమిలా మారుతున్నాయి.
పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే..ఈ ఒక్క ఆదివారమే ఐరోపా వ్యాప్తంగా కనీసం 19 కోట్ల మంది ప్రజలు సగటున 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాలలో ఎండలు మండిపోతున్నాయి. జనం ఒక్కసారిగా ఏసీలు, కూలింగ్ సిస్టమ్స్ ఆన్ చేయడంతో పవర్ గ్రిడ్స్‌పై ఒత్తిడి పెరిగి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వెళ్లే ప్రజలపై ప్రభుత్వాలు వాటర్ స్ప్రేలు చల్లుతుంటే.. కొందరైతే వేడి తట్టుకోలేక రోడ్ల పక్కన ఉన్న కాలువల్లో, నదుల్లో దూకి స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. అడవులు కాలిపోతున్నాయి. ట్రాఫిక్ లైట్లు కరిగిపోతున్నాయి.
వందల ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి విపరీత వాతావరణ మార్పులు, భూతాపం వంటివి.. యూరప్ లో ఇప్పుడు ప్రతి ఏడాది కనిపిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే.. ఈ భూమిపై అత్యధిక వేగంతో ఐరోపా ఖండం వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేడి కంటే ఇక్కడ రెండింతలు ఎక్కువగా వేడి పెరుగుతోంది. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఇటలీ, గ్రీస్, స్పెయిన్ దేశాలలో అడవులు అంటుకుని వేలాది ఎకరాల పచ్చదనం బూడిదైపోతోంది. ఈ హీట్ వేవ్ ఇప్పుడు మిగతా బాల్కన్ దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది.
సాధారణంగా యూరప్ దేశాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. రాత్రి అయితే మైనస్ ల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు 40 వరకూ వచ్చేశాయి. రోడ్లపై తారు కరిగిపోతోంది. రైలు పట్టాలు వంగిపోతున్నాయి. పక్షులు గిలగిలకొట్టుకుంటున్నాయి. జనం వేడిని తట్టుకోలేక నదులు, కాలవల్లో దూకేస్తున్నారు. ప్రస్తుతం ఐరాస (UN) తన సభ్యదేశాలతో కలిసి అత్యధిక వేడితో పొంచి ఉన్న ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ, ఇది ఒక్క యూరప్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచానికి ఇదొక డేంజర్ బెల్ గా మారింది.
ఒకవైపు మన దేశంలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుంటే.. యూరప్ మాత్రం హీట్ వేవ్ తో అల్లాడిపోతోంది. ఇది గ్లోబల్ వార్మింగ్ మానవాళికి ఇస్తున్న చివరి హెచ్చరిక. ఇప్పటికైనా మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మున్ముందు రోజులు ఇంకా భయంకరంగా మారతాయి.