మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. ఈ సంగతి అందరికీ తెలుసు. అయితే ప్రస్తుత కాలంలో కూడా అన్నాన్ని మూడు పూటలా తినేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వైట్ రైస్ మనకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్ తో ఎన్ని తీరొక్క కూరలు చేసుకుని తిన్నా దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వైట్ రైస్ కంటే బ్రౌన్ రౌస్ నే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Image: Getty Images
వైట్ రైస్ కు , బ్రౌన్ రైస్ కు తేడా ఏంటి?
వైట్ రైస్ ఎంతో ప్రాసెస్ చేయబడుతుంది. ఈ బియ్యం గింజలు తెల్లగా, అందంగా కనిపించడానికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీని వల్లే వీటిలోని పోషకాలన్నీ పోతాయి. అయితే బ్రౌన్ రైస్ లో ఇలా జరగదు. కేవలం పై పొర మాత్రమే తొలగించబడుతుంది. అందుకే దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మరి బ్రౌన్ రైస్ ను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా, తరచుగా తినలేరు. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది పొట్టను కూడా తగ్గిస్తుంది.
Image: Getty Images
ఆరోగ్యకరమైన గుండె
బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రెండూ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం స్ట్రోక్ ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి బ్రౌన్ రైస్ ను మీ ఆహారంలో చేర్చితే మీ గుండె పదిలంగా ఉంటుంది.
పోషకాహారం
బ్రౌన్ రైస్ పోషకాల భాండాగారం. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు మనల్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది మన ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది. బ్రౌన్ రైస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
మధుమేహాన్ని నివారిస్తుంది
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. బ్రౌన్ రైస్ ను తింటే టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ.