Image Credit: Getty Images
నవంబర్ 20నుంచి డిసెంబర్18 వరకు ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగనున్నది. 8 గ్రూపులుగా విడిపోయిన 32 దేశాలు మరో రెండ్రోజుల్లో ఫుట్‌బాల్ అభిమానులకు అసలైన విందును పంచబోతున్నాయి. గోల్స్ తో స్టేడియాలు హోరెత్తబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాను ఇక్కడ చూద్దాం.
ఫిఫా ప్రపంచకప్ లో క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, నైమర్ వంటి దిగ్గజాలు పాల్గొంటున్నారు. కానీ వారెవ్వరూ ఇప్పటివరకూ తాము ఆడిన ప్రపంచకప్ లలో పట్టుమని పదిగోల్స్ కూడా కొట్టలేదు. పది కంటే ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాళ్లు ఎవరున్నారో ఒకసారి పరిశీలిస్తే..
మిరోస్లవ్ క్లోజ్.. జర్మనీకి చెందిన ఈ స్ట్రైకర్ ఫిఫా ప్రపంచకప్ లలో 16 గోల్స్ కొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. నాలుగు ప్రపంచకప్ లు ఆడిన మిరోస్లవ్.. 24 మ్యాచ్ లలో 16 గోల్స్ కొట్టాడు. 63 షాట్లు ఆడే క్రమంలో మిరోస్లవ్ ఈ ఘనత అందుకున్నాడు. (మిరోస్లవ్ 2002, 2006, 2010,2014 ప్రపంచకప్ లలో ఆడాడు)
రొనాల్డో లూయిస్ నజారియో డె లిమా.. బ్రెజిల్ కు చెందిన ఈ స్ట్రైకర్ 19 మ్యాచ్ లలో 15 గోల్స్ చేశాడు. మిరోస్లోవ్ కంటే ముందు ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు రొనాల్డో పేరిటే ఉండేది. మూడు ప్రపంచకప్ లు ఆడిన డె లిమా.. గోల్డెన్ బూట్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. (రొనాల్డో 1998, 2002, 2006లో ఆడాడు)
గెర్డ్ ముల్లర్.. జర్మనీ దిగ్గజమైన ముల్లర్... రెండు ప్రపంచకప్ లలో 14 గోల్స్ చేశాడు. 1970, 1974 వరల్డ్ కప్ లు ఆడిన ముల్లర్.. 13మ్యాచ్ లలోనే ఈ ఘనత అందుకున్నాడు. 1970 వరల్డ్ కప్ లో ముల్లర్ ఏకంగా 10గోల్స్ కొట్టాడు. ఆ ఏడాది ముల్లర్ కు గోల్డెన్ బూట్ కూడా దక్కింది.
జస్ట్ ఫోంటేన్..ఫ్రెంచ్ స్ట్రైకర్ అయినా ఫోంటేన్ ఆడింది ఒకే ఒక్క ప్రపంచకప్.1958 వరల్డ్ కప్ లో ఫోంటేన్.. ఆరు మ్యాచ్ లలో ఏకంగా 13 గోల్స్ కొట్టాడు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
పీలే.. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తన కెరీర్ లో నాలుగు ప్రపంచకప్ లు ఆడాడు. 1958, 1962, 1966, 1970 వరల్డ్ కప్ లలో పీలే బ్రెజిల్ తరఫున ఆడాడు. 14 మ్యాచ్ లలో 12గోల్స్ చేశాడు. ఈ దిగ్గజానికి గోల్డెన్ బూట్ అవార్డు దక్కకపోయినా 1970లో నాలుగు గోల్స్ చేసినందుకు గాను బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
జర్గెన్ క్లిన్స్మన్, సండర్ కోక్సిస్.. జర్మన్ స్ట్రైకర్ అయిన క్లిన్స్మన్ 1990, 1994, 1998 ప్రపంచకప్ లు ఆడి 11 గోల్స్ చేశాడు. 17 మ్యాచ్ లు ఆడిన అతడు.. 1994లో అమెరికాతో మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. ఆ ప్రపంచకప్ లో ఐదు గోల్స్ కొట్టాడు. ఇక హంగేరి దిగ్గజం కోక్సిన్.. ఒకే ప్రపంచకప్ (1954) ఆడి 11గోల్స్ కొట్టాడు.ఐదు మ్యాచ్ లలోనే అతడు ఈ గోల్స్ సాధించాడు.
వీళ్లే గాక గాబ్రియల్ బటిస్తుత (అర్జెంటీనా - 10 గోల్స్), కుబిల్లాస్ (పెరు -10 గోల్స, లటో (పోలండ్ - 10), గ్యారీ లైన్కర్ (ఇంగ్లాండ్ - 10, థామస్ ముల్లర్ (జర్మనీ -10), హెల్మట్(జర్మనీ -10) డబుల్ డిజిట్ గోల్స్ కొట్టారు. ఇక క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ లో ఏడు గోల్స్ చేశాడు. మెస్సీ ఆరు గోల్స్ కొట్టాడు. ఈ ఇద్దరూ ఈసారి డబుల్ డిజిట్ ను అందుకోవాలని చూస్తున్నారు.