ఈనెల 20 నుంచి గల్ఫ్ దేశం ఖతర్ వేదికగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. 32 దేశాలు 8 గ్రూప్ లుగా విడిపోయి ఆడబోయే ఈ మెగా టోర్నీకి సర్వం సిద్ధమైంది. మరో పది రోజుల్లో ప్రారంభ వేడుకలతో పాటు టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు ఖతర్ ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది.
అయితే టోర్నీ ప్రారంభానికి పది రోజుల ముందు ఫిఫా మాజీ చైర్మెన్ సెప్ బ్లాటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఖతర్ కు ఆతిథ్య హక్కులు ఇవ్వడం చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించాడు.
స్విస్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్లాటర్ మాట్లాడుతూ.. ‘అసలు అది తప్పుడు ఎంపిక. దానికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఫిఫాకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఖతర్ చాలా చిన్న దేశం. ఫుట్‌బాల్, ప్రపంచకప్ అనేది దానితో పోల్చితే చాలా పెద్దవి..’ అని వ్యాఖ్యానించాడు.
FIFA
2010లో బ్లాటర్ ఫిఫా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తీసిన డ్రా లో 2022 ఫిఫా వరల్డ్ కప్ ను ఖతర్ లో నిర్వహించేందుకు అవకాశం వచ్చింది. అయితే ఈ ప్రపంచకప్ లో అంతులేని అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫుట్ బాల్ టోర్నీల నిర్మాణంలో అవినీతిని అక్కడ పత్రికలు ఎత్తిచూపుతున్నాయి. అలాగే సాధారణంగా యూరోపియన్ దేశాలలో ఫిఫా ను నిర్వహిస్తే నైట్ పార్టీలు, స్టేడియాల్లోనే మద్యం సేవించడం, సెక్స్ వంటివి చాలా కామన్ గా ఉంటాయి. కానీ ముస్లిం దేశమైన ఖతర్ వీటిని అనుమతించడం లేదు. దీంతో ఆ దేశం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక వరల్డ్ కప్ గెలిచిన విజేతలకు ఇచ్చే ఫిఫా ట్రోఫీలు ఇప్పుడు ఖతార్ లో అంగట్లో లభ్యమవుతున్నాయి. అచ్చం అసలు ట్రోఫీలను పోలినట్టే ఉండే నకిలీ ట్రోఫీలు.. ఖతార్ మార్కెట్లలో వెలుగుచూడటంతో ఖతార్ పోలీసులు రంగలోకి దిగారు. ఖతార్ రాజధాని దోహాలో అధికారులు ఫిఫా ట్రోఫీని పోలి ఉండే సుమారు 144 నకిలీ ట్రోఫీలను సీజ్ చేశారు. ఈ మేరకు ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటిరీయర్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.