సాధారణంగా క్రీడాకారులెవరైనా అత్యుత్తమ క్రీడావేదికపై మెరవాలని, పతకాలు సాధించాలని భావిస్తారు. కొన్ని క్రీడలను పక్కనబెడితే అత్యధికంగా క్రీడాకారులు ఒలింపిక్స్ లో తమ సత్తా చాటాలని భావిస్తారు. అయితే క్రికెట్, ఫుట్‌బాల్ లకు మాత్రం ఒలింపిక్స్ లో ఎంట్రీ లేదు.
దీంతో ఈ రెండు క్రీడల్లో ప్రతీ నాలుగేండ్లకోసారి నిర్వహించే ప్రపంచకప్ ఎంతో కీలకం. ఆడేది తక్కువ దేశాలే అయినా విశ్వవిజేతగా నిలవడానికి అన్ని దేశాలూ తమ వంతు ప్రయత్నం చేస్తాయి. ఆ క్రమంలో ఇప్పటివరకు ఏ ఏ దేశాలు అత్యధిక సార్లు ఫిఫా ప్రపంచకప్ గెలిచాయో ఇక్కడ చూద్దాం. 1930లో మొదలైన ఫిఫా తొలి ప్రపంచకప్ నుంచి ప్రస్తుతం ఖతర్ లో జరుగుతున్న మెగా టోర్నీ 22వది. ఈ సుదీర్ఘ ఫుట్‌బాల్ ప్రయాణంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు విశ్వవిజేతగా నిలిచిన జట్లు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
ఫ్రాన్స్ : సుదీర్ఘకాలంగా ఫుట్‌బాల్ ఆడుతున్న ఫ్రాన్స్ ఇప్పటివరకు రెండు సార్లు ప్రపంచకప్ నెగ్గింది. 1998లో తొలిసారిగా బ్రెజిల్ ను ఓడించి టైటిల్ నెగ్గిన ఫ్రెంచ్.. తర్వాత 2018లో రష్యా వేదికగా ముగిసిన టోర్నీలో క్రొయేషియాను ఓడించి టైటిల్ కొట్టింది. ప్రస్తుతం ఫ్రాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది.
అర్జెంటీనా : ఫ్రాన్స్ తో పాటు అర్జెంటీనా కూడా రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఈ దక్షిణ అమెరికా దేశం తొలిసారిగా 1978లో వరల్డ్ కప్ నెగ్గింది. అప్పుడు నెదర్లాండ్స్ ను ఓడించిన అర్జెంటీనా.. 1986లో ఉరుగ్వేను ఓడించి ట్రోఫీని ఎగురేసుకుపోయింది.
ఉరుగ్వే : పై రెండు దేశాల మాదిరిగానే ఉరుగ్వే కూడా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఫిఫా ఆడించిన తొలి ప్రపంచకప్..1930లో ఉరుగ్వే.. అర్జెంటీనాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకోగా 1950లో కూడా ఆ జట్టు కప్ కొట్టింది.
ఇటలీ : ఫిఫా వరల్డ్ కప్ ను ఇటలీ ఏకంగా నాలుగుసార్లు ఒడిసిపట్టింది. ఈ టోర్నీ రెండో ఎడిషన్ (1934), మూడో ఎడిషన్ (1938)లలో ఇటలీనే విజేత. తిరిగి 1982, 2006లో ఇటలీ విశ్వవిజేతగా అవతరించింది.
జర్మనీ : ఇటలీ మాదిరిగానే జర్మనీ కూడా నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. 1954, 1974, 1990 (ఈమూడు సార్లు వెస్ట్ జర్మనీ పేరిట బరిలోకి దిగింది), 2014లో ప్రపంచకప్ సాధించింది. ఈసారి కూడా జర్మనీ టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగుతున్నది.
బ్రెజిల్ : ఇప్పటివరకు 22 ప్రపంచకప్ లు ముగియగా మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది బ్రెజిల్. ప్రపంచకప్ లో అత్యధిక విజయవంతమైన టీమ్ గా బ్రెజిల్ కు పేరుంది. 1958లో తొలి ప్రపంచకప్ నెగ్గిన బ్రెజిల్ ఆ తర్వాత 1962, 1970, 1994, 2002 లలో ఈ టోర్నీ విజేతగా ఉంది. అయితే బ్రెజిల్ టైటిల్ గెలవక 20 ఏండ్లు కావొస్తున్నది. దీంతోఈసారి ఎలాగైనా విశ్వవిజేతగా నిలిచేందుకు ఆ జట్టు పూర్తి ప్రణాళికతో ఖతర్ లో అడుగుపెట్టింది.