FIFA: చాలా దారుణం.. కానీ ఒక విధంగా మంచిదే..!! ఫిఫా నిషేధంపై బైచుంగ్ భుటియా స్పందన

First Published | Aug 16, 2022, 3:23 PM IST

FIFA Bans AIFF: అఖిల భారత క్రీడా సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) పై   అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తీసుకున్న  నిర్ణయంపై భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ సారథి బైచుంగ్ భుటియా స్పందించాడు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని అన్నాడు. 

నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏఐఎఫ్ఎప్ లో బయిటివ్యక్తుల ప్రమేయం  పెరిగిపోయిందనే కారణంతో ఫిఫా.. భారత ఫుట్‌బాల్  సంస్థపై  నిషేధం విధించిన విషయం తెలిసిందే. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా వెల్లడించింది. 

ఫిఫా తీసుకున్న నిర్ణయంపై భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ సారథి బైచుంగ్ భుటియా స్పందించాడు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని, కానీ అదే సమయంలో దేశంలో ఇప్పటికైనా ఈ క్రీడను వృద్ధిలోకి తీసుకురావడానికి ఒక మంచి అవకాశమని వ్యాఖ్యానించాడు.  


భుటియా మాట్లాడుతూ.. ‘ఫిఫా నిర్ణయం చాలా దురదృష్టకరం. భారత ఫుట్‌బాల్ పట్ల ఇది చాలా కఠినమైన నిర్ణయం. అయితే ఇదే సమయంలో ఇది మన దేశానికి ఒక మంచి అవకాశం కూడా కల్పించింది. భారత్ లో ఫుట్‌బాల్ క్రీడలో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది మంచి అవకాశం.

ఏఐఎఫ్ఎఫ్, రాష్ట్ర అసోసియేషన్ లు కూర్చుని నిర్దిష్టమైన, భారత ఫుట్‌బాల్  దశను మార్చేవిధంగా ఉండే  ఒక వ్యవస్థను తయారుచేసుకునే అవకాశం దక్కింది...’ అని తెలిపాడు. 

85 ఏండ్ల ఫిఫా చరిత్రలో భారత్ నిషేధం ఎదుర్కోవడం ఇదే ప్రథమం. ఈ వ్యవహారంలో మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మితిమీరిన జోక్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రఫుల్ పటేల్.. ఏఐఎఫ్ఎప్ ను సర్వనాశనం చేశాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఇక భుటియాతో పాటు ఫుట్‌బాల్ దిగ్గజం షబ్బీర్ అలీ కూడా  ఫిఫా నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు.  ‘ఏం జరిగిందో గానీ అది భారత ఫుట్‌బాల్ కు ఎంతమాత్రమూ మంచిదికాదు.  ఈ నిషేధం త్వరలోనే ఎత్తివేస్తారని నేను ఆశిస్తున్నా. త్వరగా ఎన్నికలు పెట్టి.. కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకుంటే మంచిది. ఫిఫా అండర్ -17  ప్రపంచకప్ భారత్ లోనే జరగాలి. అది దేశంలో చాలా మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది..’ అని తెలిపాడు.

ఫిఫా తాజా నిర్ణయం భారత ఫుట్‌బాల్ కు భారీ షాకే.  దీంతో  భారత పురుషుల, మహిళల జట్లు  అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు వీళ్లేదు.  జూనియర్, సీనియర్ స్థాయిలలో కూడా మ్యాచ్ లు రద్దవుతాయి.వీటన్నింటికంటే ముఖ్యంగా ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉన్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కూడా భారత్ కోల్పోయింది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు  భారత్ ఈ టోర్నీని నిర్వహించేందుకు గాను హక్కులు పొందిన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!