తన దేశానికి ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుని టోర్నీలోకి అడుగుపెట్టిన అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ అనుకున్నది సాధించాడు. టోర్నీలో తొలి మ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో ఓడినా ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్ లో 2018లో ఛాంపియన్ అయిన ఫ్రాన్స్ ను పెనాల్టీ షూట్ అవుట్ లో ఓడించింది.
అయితే 35 ఏండ్ల మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్. వచ్చే వరల్డ్ కప్ (2026) నాటికి మెస్సీ ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల ముందే ఇదే నా చివరి ప్రపంచకప్ అని.. ఈ వరల్డ్ కప్ లో సాధించి తీరుతానని మెస్సీ కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచకప్ తర్వాత మెస్సీ రిటైర్ అవుతాడని.. ఫైనల్ లో తన దేశాన్ని విశ్వవిజేతగా నిలిపి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వెలువడ్డాయి. ఫైనల్ ముగిసిన నేపథ్యంలో విలేకరులు కూడా మెస్సీని ఇదే ప్రశ్న అడిగారు. అయితే అలాంటిదేమీ లేదన్నాడు మెస్సీ.
మెస్సీ మాట్లాడుతూ.. ‘నాకు మాటలు రావడం లేదు. ఇదంతా కలలా ఉంది. ఆ దేవుడు నాకు ఈ ట్రోఫీని ఇస్తాడని తెలుసు. నా దేశానికి ప్రపంచకప్ అందించాలనేది నా కల. నా కెరీర్ ను ప్రపంచకప్ సాధించి ముగించాలనుకున్నా. ఇంతకుమించి దేవుడిని నేను మరేది అడగలేదు..
అయితే ఈ మ్యాచ్ తర్వాత నేను రిటైర్ అవుతానని అంటున్నారు. లేదు. నేను రిటైర్ కావడంలేదు. మేం వరల్డ్ కప్ గెలిచాం. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ అయ్యాం. ఆ ఫీలింగ్ ను నేను ఆస్వాదించొద్దా.. అర్జెంటీనా జెర్సీ మరికొన్నిరోజులు ధరించి వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఆడాలని ఫిక్స్ అయ్యా..’అని స్పష్టం చేశాడు.
ఇక మెస్సీ రిటైర్మెంట్ అంశంపై అర్జెంటీనా హెడ్ కోచ్ లియోనల్ స్కాలోని స్పందిస్తూ.. ‘వచ్చే వరల్డ్ కప్ లో మెస్సీ ఆడాలనుకుంటే అతడికి తప్పకుండా ప్లేస్ ఉంటుంది. మేం అతడిని వదులుకోం. అతడు ఆడినన్ని రోజులు నెంబర్ 10 (మెస్సీ జెర్సీ) అతడిదే..’ అని చెప్పడం గమనార్హం.