నవంబర్ 20 న ఆరంభమైన ఫిఫా ప్రపంచకప్ నేడు జరిగే ఫైనల్ తో ముగియనున్నది. ఫైనల్ పోరు దోహాలోని స్థానిక సమయం ఆరు గంటలకు ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫైనల్ కంటే ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఖతర్ ప్రభుత్వం, పిఫా సిద్ధమయ్యాయి.
ముగింపు వేడుకలకు గాను ప్రముఖ బాలీవుడ్ నటి, తెలుగులో పలు ఐటెమ్ సాంగ్స్ చేసి ఇక్కడి కుర్రాళ్లను తన అందచందాలతో కట్టిపడేసిన నోరా ఫతేహి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నది. 15 నిమిషాల పాటు సాగే ముగింపు వేడుకలలో భాగంగా నోరాకు కూడా డాన్స్ చేసే అవకాశం దక్కింది.
ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ గాయని రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ లు కూడా ఈ వేడుకలలో అభిమానులను అలరించనున్నారు. ముగింపు వేడుకలు ముగిసిన తర్వాత అర్జెంటీనా - ఫ్రాన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 8.30 నుంచి అర్జెంటీనా - ఫ్రాన్స్ మధ్య తుది సమరం మొదలవుతుంది.
ఇక అరబ్బుల అడ్డా ఖతర్ లో ఫతేహి నృత్యాన్ని లైవ్ ద్వారా వీక్షించాలంటే స్పోర్ట్స్ 18 ఛానెల్ లో లైవ్ ద్వారా వీక్షించొచ్చు. మొబైల్ లో అయితే జియో సినిమా యాప్, వెబ్ సైట్ లలో ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూడొచ్చు. ఫిఫా థీమ్ సాంగ్ లో కూడా నోరా ఫతేహి తన డాన్స్ తో అలరించిన విషయం తెలిసిందే.
తన కెరీర్ లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ తన వరల్డ్ కప్ లోటును తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా.. వరుసగా రెండో సారి (గెలిస్తే మూడోసారి) కప్ కొట్టడానికి ఫ్రాన్స్ ఉవ్విళ్లూరుతున్నది. మరి నేటి రాత్రి ఖతర్ లో విశ్వవిజేతగా నిలిచేదెవరోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ మెగా పోరకు ముందు స్టేడియానికి వచ్చే అభిమానులకు నోరా అందాల విందును వడ్డించనున్నది.